అడ్డగోలు ప్రతిపాదనలకు చెక్
ABN , Publish Date - Dec 07 , 2025 | 01:15 AM
జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం గతానికి భిన్నంగా వాడీవేడిగా సాగింది.
బీచ్‌రోడ్డులో చేపట్టిన పనులపై విజిలెన్స్ విచారణ కోరదాం
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం
గతానికి భిన్నంగా వాడీవేడిగా సమావేశం
అజెండాలోని 248 అంశాలు ఆమోదం, 34 వాయిదా
ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో రాళ్ల తొలగింపునకు రూ.14 లక్షలు ఖర్చా!
అధికారులను నిలదీసిన మేయర్, సభ్యులు
బీచ్‌రోడ్డులో అనధికార దుకాణాలపై సర్వేకు ఆదేశం
విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం గతానికి భిన్నంగా వాడీవేడిగా సాగింది. గతంలో అజెండాలోని అంశాలపై మొక్కుబడిగా చర్చించి ఆమోదించేస్తుండేవారు. అలాగే రెండు, మూడు గంటల్లోనే సమావేశం ముగించేసేశారు. కానీ, ఈసారి ఉదయం 11 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ చర్చించారు. జీవీఎంసీ పాత కౌన్సిల్‌హాలులో శనివారం సమావేశమైన స్టాండింగ్ కమిటీ ప్రధాన అజెండాలోని 257 అంశాలతోపాటు టేబుల్ అజెండాలోని 30 అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రధాన అజెండాలోని 216 అంశాలను ఆమోదించిన కమిటీ 34 అంశాలను సరైన వివరాలు సమర్పించాలని కోరుతూ వాయిదా వేసింది. యోగాంధ్ర సందర్భంగా బీచ్‌రోడ్డులో ఫుట్‌పాత్‌లు, కెర్బ్‌లకు రంగులు వేయడం, శుభ్రం చేయడం, వాహనాల పార్కింగ్‌కు మార్జిన్ వేయడం వంటి నాలుగు అంశాల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నందున వాటిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కోరాలని నిర్ణయించింది. అలాగే యోగాంధ్ర సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ఏర్పాటుచేసిన హెలీపాడ్ పరిసరాల్లో ఉన్న కఠినమైన రాళ్లను తొలగించామని అందుకోసం సుమారు రూ.14 లక్షలు బిల్లు చెల్లించాలని కోరుతూ అజెండాలో చేర్చిన మూడు అంశాలపై సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో వాటిని స్వయంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సభ్యులు నిర్ణయించారు. అలాగే బీచ్‌రోడ్డులోని స్విలర్ స్పూన్ రెస్టారెంట్‌కు అదనంగా 460 చదరపు గజాలు ఇచ్చే అంశాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మేయర్, ఆ స్థలంలో జీవీఎంసీయే స్వయంగా దుకాణాలు ఏర్పాటుచేసి వేలం నిర్వహించేలా ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశాలు జారీచేశారు. టేబుల్ అజెండాలోని 30 అంశాలు వార్డుల్లో అభివృద్ధికి సంబంధించినవే కావడంతో వాటిని కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
యోగాంధ్ర సందర్భంగా బీచ్‌రోడ్డులో ఏర్పాటుచేసిన పోర్టబుల్ టాయిలెట్లకు రూ.16 వేల చొప్పున అద్దె చెల్లించాలంటూ ప్రజారోగ్యం విభాగం అధికారులు రూ.1.62 కోట్ల మేర బిల్లు పెట్టారు. ఇందుకు సంబంధించిన 26 అంశాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రూ.నాలుగు వేల అద్దెకు గతంలో పోర్టబుల్ టాయిలెట్లను జీవీఎంసీ తీసుకుంటే..ఇప్పుడు ఏకంగా నాలుగు రెట్లు పెంచేయడం వెనుక పెద్దఎత్తున అవినీతి జరిగిందనే ప్రచారంపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో కమిటీ చైర్మన్ హోదాలో మేయర్‌తోపాటు సభ్యులు పది మంది కూడా తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్నందున సమగ్ర వివరాలు అందజేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే భీమిలిలో చెత్త బదిలీ స్టేషన్ (జీటీఎస్)లో ఏర్పాటుచేసిన సీసీఎస్ ప్రాజెక్టును ప్రారంభించి ఏడాది అయిన తర్వాత ఇప్పుడు టెండర్లు పిలవడంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవ్వడంతో కమిటీ సభ్యులు దీనిపై అధికారులను నిలదీశారు. సీసీఎస్ ప్రాజెక్టును కమిటీ పరిశీలించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో రూ.14 లక్షలు ఖర్చుతో రాళ్లు తొలగించినట్టు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు పెట్టడంపై కమిటీ సభ్యులు అవాక్కయ్యారు. ఏయూలో గతంలో ఎన్నోముఖ్యమైన సమావేశాలు, సదస్సులు జరిగాయని, అప్పుడు లేని రాళ్లు యోగాంధ్ర సమయంలో ఎలా వచ్చాయంటూ నిలదీశారు. బీచ్‌రోడ్డులో అనధికార దుకాణాలు వెలుస్తున్నాయని, వాటివల్ల జీవీఎంసీకి పైసా ఆదాయం రావడం లేదు కాబట్టి, అలాంటి దుకాణాలు ఎన్ని ఉన్నాయో సర్వే చేసి అందజేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు. గెడ్డల్లో పూడికతీతకు జీవీఎంసీకి సొంతంగా జేసీబీలు, బాప్‌కాట్‌లు ఉండగా, అద్దెకు యంత్రాలు తీసుకుంటున్నట్టు చూపించి బిల్లులు చెల్లించడం సరికాదని, ఇకపై అలాంటి ప్రతిపాదనలు పెట్టవద్దని ప్రజారోగ్యం, మెకానికల్ విభాగం అధికారులకు స్పష్టంచేశారు. ఏదైనా పనిచేస్తే ఏడాది తర్వాత బిల్లుకు ప్రతిపాదన పెడుతున్నారని, దీనివల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇకపై నెల రోజుల్లో బిల్లు పెట్టాల్సిందేనని స్పష్టంచేశారు. కుక్కలకు ఆపరేషన్లు చేసే అంశంపై సభ్యులు అనుమానాలు వ్యక్తంచేయడంతో, వాటికి సంబంధించిన ఆధారాలను చూపిస్తామని అధికారులు సమాధానం ఇవ్వడంతో వాటిని ఆమోదించారు. పారిశుధ్య నిర్వహణకు తాత్కాలిక సిబ్బందిని నియమించినట్టు చూపించి బిల్లు పెట్టడంపై కమిటీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు వస్తున్నందున, ఎవరిని విధుల్లోకి తీసుకున్నారో వారి గుర్తింపుకార్డులు, ఆధార్ కార్డులను కూడా ఫైల్‌లో పెట్టాలని మేయర్ ఆదేశించారు. నగరంలో అమూల్ సంస్థకు స్థలాల అద్దెను రెన్యువల్ చేసే అంశంపై చర్చ సందర్భంగా ఇకపై స్థానిక డెయిరీలకు అవకాశం కల్పించేలా ప్రతిపాదనలు తయారుచేయాలని జోన్-3 కమిషనర్‌కు మేయర్ సూచించారు. ఈ సమావేశంలో కమిటీసభ్యులతోపపాటు అన్నివిభాగాల అధికారులు పాల్గొన్నారు.