Share News

ఏయూలో గందరగోళం

ABN , Publish Date - Aug 27 , 2025 | 01:20 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడింది.

ఏయూలో గందరగోళం

అధికారుల మధ్య విభేదాలు

కొరవడిన సమన్వయం

ఈ నేపథ్యంలోనే రిజిస్ర్టార్‌ రాజీనామా

వీసీకి, ఉన్నతాధికారులకు నడుమ కూడా అంతరం

కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని ప్రిన్సిపాల్స్‌ అసంతృప్తి

పదవుల నుంచి తప్పుకునే యోచనలో కొందరు?

శతాబ్ది వేడుకలు జరుగుతున్న వేళ

వర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై అధ్యాపక, విద్యార్థి వర్గాల్లో ఆందోళన

విశాఖపట్నం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఇది పాలనపై ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు, కొన్ని నియామకాల విషయంలో అధికారుల మధ్య పొరపొచ్ఛాలు ఉన్నట్టు చెబుతున్నారు. తాజాగా రిజిస్ర్టార్‌ రాజీనామా వర్సిటీలో నెలకొన్న పరిస్థితులను బహిర్గతం చేసింది. అయితే, వైస్‌ చాన్సలర్‌, రిజిస్ర్టార్‌ నడుమ మాత్రమే కాదని, మరికొంతమంది ఉన్నత అధికారులకు, వీసీకి మధ్య కూడా అంతరం పెరిగిందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.

వైస్‌ చానల్సర్‌ తీరుపై వర్సిటీలోని కొన్ని కాలేజీలకు చెందిన ప్రిన్సిపాల్స్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని ప్రిన్సిపాల్స్‌ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కొద్దిరోజుల కిందట హాస్టళ్లకు వార్డెన్లను వీసీ నియమించారు. సాధారణంగా హాస్టళ్లకు ఆయా కాలేజీలకు చెందిన ప్రిన్సిపాల్స్‌ చైర్మన్లుగా వ్యవహరిస్తారు. వార్డెన్లను నియమించా లనుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రిన్సిపాల్స్‌ రిక మండేషన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, వారికి తెలియకుండానే వార్డెన్ల నియామకాలను వీసీ పూర్తి చేశారు. కొద్దిరోజుల కిందట చేపట్టిన అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియలోనూ ఇదే తరహాలో వీసీ వ్యవహ రించినట్టు ప్రిన్సిపాల్స్‌ పేర్కొంటున్నారు. గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామక ప్రక్రియ ప్రిన్సిపాల్స్‌ ఆధ్వర్యంలో చేపట్టాలి. అందుకు విరుద్ధంగా వీసీ చేపట్టినట్టు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే ఇద్దరు ప్రిన్సిపాల్స్‌ అసంతృప్తిని వెళ్లగక్కారు. అలాగే, రీసెర్చ్‌ స్కాలర్స్‌కు సంబంధించిన ఫైల్స్‌ ప్రిన్సిపాల్స్‌ కార్యాలయాల నుంచి వీసీ ఛాంబర్‌కు వెళుతుంటాయి. వాటిని క్లియర్‌ చేయకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని, ఇదంతా తమను అవమానించడమేనని ప్రిన్సిపాల్స్‌ను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలో ప్రిన్సిపాల్స్‌కు కొన్ని అధికారాలు ఉంటాయని, వాటికి విఘాతం కలిగించేలా ప్రస్తుత వీసీ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రిజిస్ర్టార్‌ బాటలో రాజీనామా చేయాలన్న యోచనలో ఇద్దరు ప్రిన్సిపాల్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

వర్సిటీ వర్గాల్లో ఆందోళన

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రస్తుతం శతాబ్ది ఉత్స వాలను జరుపుకుంటోంది. ఇటువంటి సమయంలో వర్సిటీలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఉద్యోగులు, విద్యా ర్థులు, పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శతాబ్ది ఉత్సవాల నిర్వహణ సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల మధ్య విబేధాలు పెరగడం ఇబ్బందికరంగా మారుతుందని పలువురు పేర్కొంటున్నారు. వర్సిటీలో తలెత్తిన సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 27 , 2025 | 01:20 AM