గోమంగి గురుకులంలో గందరగోళం
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:21 AM
మండలంలోని గోమంగి మినీ బాలికల గురుకుల పాఠశాల ఎస్‌వో మందలించిందని 16 మంది విద్యార్థినులు గురువారం ఉదయం బయటకు వెళ్లిపోయారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు వారికి వెతికి సాయంత్రానికి తిరిగి గురుకులానికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఎస్‌వో మందలించిందని బయటకు
వెళ్లిపోయిన 16మంది విద్యార్థినులు
సాయంత్రానికి విద్యార్థినులను
తీసుకువచ్చిన ఉపాధ్యాయులు
ఎస్‌వో కొట్టారని విద్యార్థినుల ఆరోపణ
తానెవరనీ కొట్టలేదని ఎస్‌వో వివరణ
సమగ్ర విచారణ జరిపిస్తామన్న ఎంఈవో
పెదబయలు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోమంగి మినీ బాలికల గురుకుల పాఠశాల ఎస్‌వో మందలించిందని 16 మంది విద్యార్థినులు గురువారం ఉదయం బయటకు వెళ్లిపోయారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు వారికి వెతికి సాయంత్రానికి తిరిగి గురుకులానికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని గోమంగి మినీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం సాయంత్రం విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినులంతా ఒకచోట గుమిగూడి ఉన్నారు. రాత్రి భోజనానికి అందరూ రావాలంటూ ఎస్‌వో టి. వసంతకుమారి విద్యార్థినులను పిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఆమె మందలించారు. దీంతో గురువారం ఉదయం వేకువజామున 16 మంది బాలికలు గురుకుల కళాశాల నుంచి వెళ్లిపోయారు. వారు ఎక్కడి వెళ్లారన్నది ఎవరికీ తెలియదు. ఈ విషయం ఎస్‌వో దృష్టికి వెళ్లడంతో ఆమె ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు చుట్టుపక్కల గల గ్రామాలకు వెళ్లారు. ఈ 16 మంది బాలికలు లింగేరిపుట్టు గ్రామంలో ఉన్నారని తేలడంతో ఉపాధ్యాయులు వెళ్లి వారికి నచ్చజెప్పి గురుకులానికి తీసుకువచ్చారు. ఎస్‌వో తమను కొట్టడం వల్లే వెళ్లిపోయామని బాలికలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎస్‌వో వసంతకుమారి వద్ద ప్రస్తావించగా.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను కేవలం ముగ్గురిని మాత్రమే మందలించానని, ఎవరిని కొట్టలేదని పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఎంఈవో కృష్ణమూర్తి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని ఎంఈవో తెలిపారు.