Share News

మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు

ABN , Publish Date - Sep 25 , 2025 | 01:14 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్‌ ప్లాన్‌-2041లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్లాన్‌లో అనేకచోట్ల ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా రహదారులు డిజైన్‌ చేశారు. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం అభ్యంతరాలు స్వీకరించి, వాటికి మార్పులు చేపడుతోంది. దీనివల్ల అనేక మంది సామాన్య ప్రజలకు మేలు జరగనున్నది.

మాస్టర్‌ ప్లాన్‌లో  మార్పులు

వీఎంఆర్‌డీఏ కసరత్తు

అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన

భీమిలి బీచ్‌ రోడ్డులో అడ్డగోలు అలైన్‌మెంట్‌కు చెక్‌

రాడీసన్‌ బ్లూ హోటల్‌, ఏ-1 కన్వెన్షన్‌ సెంటర్‌ల వద్ద మార్పులు

దసపల్లా హిల్స్‌లోను...

పార్క్‌ హోటల్‌ నుంచి దత్‌ ఐల్యాండ్‌ వరకూ ప్రతిపాదించిన మేరకు రహదారి విస్తరణ

దత్‌ ఐల్యాండ్‌-తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మార్గంలో మెట్రో రైలు స్టేషన్‌ ఏర్పాటు ప్రతిపాదనలు అందిన తరువాత నిర్ణయం

పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి, ఎలమంచిలిల్లో కొత్త రహదారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్‌ ప్లాన్‌-2041లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్లాన్‌లో అనేకచోట్ల ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా రహదారులు డిజైన్‌ చేశారు. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం అభ్యంతరాలు స్వీకరించి, వాటికి మార్పులు చేపడుతోంది. దీనివల్ల అనేక మంది సామాన్య ప్రజలకు మేలు జరగనున్నది.

వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌-2041ను రెండు దశాబ్దాల అవసరాల కోసం వైసీపీ హయాంలో తయారుచేశారు. వైసీపీ నాయకుల్లో అత్యధికులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉండడం, వారి సానుభూతిపరులకు కూడా భారీగా భూములు ఉండడంతో వారికి లబ్ధి చేకూరేలా మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు డిజైన్‌ చేశారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో మిగిలినవారు ఆర్థికంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కంటి తడుపుగా అభ్యంతరాలు స్వీకరించిన వైసీపీ ప్రభుత్వం వాటిని పరిశీలించకుండా పక్కన పెట్టేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై దృష్టిసారించింది. చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రణవ్‌ గోపాల్‌ నియోజకవర్గాల వారీగా అభ్యంతరాలు స్వీకరించారు. అందులో ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములను చేశారు.

పరిశీలన, చర్యలకు శ్రీకారం

వేల సంఖ్యలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్న అధికారులు అన్నింటినీ క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేస్తున్నారు. నిజంగానే తప్పులు జరిగాయా?, ప్రతిపాదించిన రహదారులు అక్కడ అవసరమా?...అనే విషయాలు పరిశీలిస్తున్నారు. వీలైనంత వరకు ప్రభుత్వ భూముల మీదుగానే రహదారులు వెళ్లేలా చూస్తున్నారు. ఇప్పటికే లేఅవుట్లుగా మారిన భూముల మధ్య నుంచే ఏమైనా రహదారులు ఉంటే వాటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో అడ్డగోలు నిర్ణయాలంటూ కొన్ని రహదారులపై తీవ్రమైన చర్చ జరిగింది. వాటిని ఇప్పుడు మార్చేందుకు అధికారులు నిర్ణయించారు.

రుషికొండలో ఏ-1 కన్వెన్షన్‌ సెంటర్‌ వైపు...

రుషికొండలో ఏ-1 కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద 200 అడుగుల మేర రహదారి విస్తరణకు ప్రతిపాదించారు. అయితే కన్వెన్షన్‌ సెంటర్‌కు నష్టం రాకుండా రెండో వైపు రహదారి విస్తరణకు అప్పట్లో ప్రతిపాదించారు. దీనిని కూడా ఇప్పుడు అధికారులు సరిచేస్తున్నారు. అటు..ఇటు సమానంగా విస్తరణ చేయడానికి ప్లాన్‌ సరి చేస్తున్నారు.

దసపల్లా హిల్స్‌లో నేవీ హౌస్‌కు నష్టం లేకుండా

నగరంలో దసపల్లా భూములను వైసీపీ నాయకులు హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ అతి పెద్ద అపార్టుమెంట్ల నిర్మాణానికి ప్లాన్‌ చేసుకున్నారు. అందుకోసం మాస్టర్‌ప్లాన్‌లో 100 అడుగుల రహదారిని ప్రతిపాదించారు. వాస్తవానికి అటు వైపు అంత ట్రాఫిక్‌ ఉండదు. పైగా విస్తరణ సర్క్యూట్‌ హౌస్‌ వైపు లేకుండా, ఎదురుగా ఉన్న నేవీ హౌస్‌ వైపు ప్రతిపాదించారు. అసలు అక్కడ 100 అడుగుల రహదారి అవసరమే లేదంటూ అక్కడి నివాసితులు కొందరు హైకోర్టుకు వెళ్లారు. దాంతో అక్కడ కూడా సవరణ చేస్తున్నారు. స్థానికులు 60 అడుగులు సరిపోతుందని చెబుతుండగా, అధికారులు 80 అడుగులు ఉంచాలని భావిస్తున్నారు. రెండు వైపుల సమానంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

- పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి దత్‌ ఐల్యాండ్‌ వరకు రహదారి విస్తరణకు రైల్వే గెస్ట్‌ హౌస్‌, క్రిస్టియన్‌ స్కూల్‌ మాత్రమే అడ్డంకిగా ఉన్నట్టు, మిగిలినవన్నీ ప్రభుత్వ భూముల్లోనే ఉన్నట్టు గుర్తించారు. దాంతో ఆ మార్గం విస్తరణకు లైన్‌ క్లియర్‌ అయినట్టుగా చెబుతున్నారు.

- దత్‌ ఐల్యాండ్‌ నుంచి జీవీఎంసీ కమిషనర్‌ బంగ్లా మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వరకు రహదారిని విస్తరణ చేస్తే సంపత్‌ వినాయకుడి ఆలయం అడ్డంకిగా ఉంది. ఆ మార్గంలో ఎంవీవీ పీక్‌ కొత్త రహదారి కోసం భూమిని జీవీఎంసీకి అప్పగించింది. మధ్యలో మరో సంస్థ కూడా అలాగే భూమి విడిచి పెట్టింది. వాటి అలైన్‌మెంట్‌లో ఆ మార్గాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు. ఈ మార్గంలో మెట్రో రైలు ప్రాజెక్టు ఉంది. వారు ఎక్కడ మెట్రో స్టేషన్‌ పెడతారో చూసుకొని దాని ప్రకారం ఈ మార్గం విస్తరించాలని భావిస్తున్నారు.

బిల్డర్‌కు అనుకూలంగా అలైన్‌మెంట్‌

వేపగుంటలో ఓ బిల్డర్‌కు లబ్ధి చేకూర్చడానికి రహదారి అలైన్‌మెంట్‌ను గతంలో మార్చేశారు. సింహాచలం గోశాల నుంచి వేపగుంట వెళ్లే మార్గం విస్తరణలో ఆ బిల్డర్‌కు నష్టం లేకుండా రెండో వైపు పనులకు ప్రతిపాదించారు. దానిని ఇప్పుడు సరిచేసి, ఇరువైపులా సమానంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

- రైల్వే ఆస్పత్రి నుంచి రైల్వే స్టేషన్‌ వరకు భూములు రైల్వేకి సంబంధించినవి కావడం, అభ్యంతరాలు లేకపోవడంతో దానిని పూర్వం అనుకున్నట్టుగానే విస్తరిస్తారు.

- పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి, ఎలమంచిలి ప్రాంతాలకు మాస్టర్‌ ప్లాన్‌లో రహదారులు ప్రతిపాదించలేదు. ఆయా ప్రాంతాల నుంచి అభ్యర్థనలు రావడంతో ప్రధాన రహదారులతో అనుసుంధాన మార్గాలను కొత్తగా ప్రతిపాదిస్తున్నారు.

- విజయనగరం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీటి వనరులు గుర్తించారు. అయితే అవన్నీ జిరాయితీ భూములుగా తేలడంతో వాటిని మార్చాలని నిర్ణయించారు.

రాడీసన్‌ బ్లూ హోటల్‌ వద్ద...

విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకు ఆరు వరుసల బీచ్‌ కారిడార్‌ ప్రతిపాదన ఉంది. ఈ మార్గాన్ని 200 అడుగులకు విస్తరించాలనేది యోచన. అయితే కొన్నిచోట్ల 100 అడుగులు, మరికొన్నిచోట్ల 120, ఇంకొన్నిచోట్ల 150 అడుగులు ప్రతిపాదించారు. ఒకేవిధంగా అలైన్‌మెంట్‌ చేయలేదు. అంతేకాకుండా రహదారి విస్తరణ చేస్తే ఇరువైపులా సమానంగా ఉండాలి. కానీ నాటి వైసీపీ నేతలు వారి భాగస్వాములకు మేలు చేకూర్చేందుకు వారి నిర్మాణాల వైపు విస్తరణ లేకుండా చేశారు. ఇలా సాగర్‌నగర్‌ దాటిన తరువాత వచ్చే రాడీసన్‌ బ్లూ హోటల్‌కు నష్టం జరగకుండా విస్తరణ అంతా ఎదురుగా ఉన్న భూముల వైపు ప్రతిపాదించారు. దీనిపై పెద్దఎత్తున ఆరోపణలు, అభ్యంతరాలు రావడంతో అధికారులు దానిని ఇప్పుడు సరి చేస్తున్నారు. ఆ హోటల్‌ ముందు సుమారుగా 20 అడుగుల వెడల్పున ఫుట్‌పాత్‌ ఏరియా ఉంది. అక్కడి వరకూ రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. అంటే హోటల్‌ ప్రహరీ గోడ వరకూ రోడ్డు వస్తుంది.

Updated Date - Sep 25 , 2025 | 01:14 AM