మెట్రో టెండర్లలో మార్పు
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:58 AM
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి.
ఏకమొత్తంగా కాకుండా ప్రాజెక్టును విభజించి ఇవ్వాలని నిర్ణయం
19న ప్రీ బిడ్డింగ్ సమావేశం
బిడ్ల దాఖలుకు అక్టోబరు ఏడో తేదీ వరకూ గడవు
మొదటి దశలో 46 కి.మీ. పొడవున నిర్మాణం
ఇందులో 20 కి.మీ. డబుల్ డెక్కర్ మోడల్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో సాయం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ‘మెట్రో రైలు’ మంజూరైన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి కోల్‌కత్తా మెట్రో రైలుకు ఎలాగైతే కేంద్రం వంద శాతం ఖర్చులు భరించిందో అదే విధంగా విశాఖ మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు అడుగుతున్నారు. దీనిపై కేంద్ర పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు.
కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించేంత వరకూ ప్రాజెక్టును పెండింగ్‌లో ఉంచకుండా ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (ఏఎంఆర్‌సీఎల్) ద్వారా మొదటి దశ పనులకు టెండర్లను ఆహ్వానించింది. అమరావతి మెట్రోతో పాటు విశాఖ మెట్రోను కూడా కలిపి టెండర్లను ఆహ్వానించారు. అయితే ఇవి పెద్ద మొత్తాలతో కూడినవి కావడంతో సింగిల్ బిడ్డర్ చేయడం కష్టమని, కొన్ని భాగాలు చేసి టెండర్లను పిలిస్తే బాగుంటుందని పలు సంస్థలు సూచించాయి. దీంతో టెండర్ల దాఖలుకు గడువు పెంచారు. అక్టోబరు ఏడో తేదీ వరకు సమయం ఇచ్చారు. ఈలోగా ప్రీ బిడ్డింగ్ సమావేశం ఈ నెల 19న నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖ ప్రాజెక్టును ఎన్ని భాగాలుగా విభజించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.
20 కి.మీ. పొడవున డబుల్ డెక్కర్ విధానం
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును మొదటి దశ కింద 46 కి.మీ. పొడవున నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో 20 కి.మీ. డబుల్ డెక్కర్ మోడల్, మిగిలిన 26 కి.మీ. మెట్రో రైలు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం డబుల్ డెక్కర్ విధానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో సింగిల్ పిల్లర్‌పై రెండు కారిడార్లు ఒక దానిపై మరొకటి వస్తాయి. కింద కారిడార్‌లో వాహనాలు ప్రయాణించడానికి, పై కారిడార్‌లో మెట్రో రైలు నడపడానికి ఏర్పాట్లు ఉంటాయి. ఇందులో డబుల్ డెక్కర్ మళ్లీ రెండు భాగాలుగా ఉంటుందని అధికార వర్గాల సమాచారం. కొమ్మాది జంక్షన్ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15 కి.మీ. ఒక విభాగంగా, స్టీల్ ప్లాంటు ప్రవేశ ద్వారం నుంచి గాజువాక వరకు 5 కి.మీ. రెండో విభాగంగాను నిర్మిస్తారని సమాచారం. మొదటి దశ ప్రాజెక్టు రూ.11,498 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో డబుల్ డెక్కర్ చేరడంతో అదనంగా మరో రూ.2,000 కోట్లు అవసరమని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 99.75 ఎకరాలు అవసరమని నిర్ధారించారు. అందులో సుమారు పది ఎకరాలు ప్రైవేటు భూమి ఉంది. ఆ భూ సేకరణకు మరో రూ.882 కోట్లు అవసరమని గతంలోనే లెక్కలు వేశారు. అంటే మొత్తంగా చూసుకుంటే తొలిదశ నిర్మాణానికి రూ.14,380 కోట్లు అవసరం. ఇందులో ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 60 శాతం నిధులు పీపీపీ విధానంలో సేకరించి, మిగిలిన 40 శాతం నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పెట్టుకోవాలనే ప్రాతిపదికన ఫైల్ నడుపుతున్నారు. ఈ నెల 19న జరిగే సమావేశంలో మొదటి దశ పనులు ఎన్ని భాగాలుగా చేసి కాంట్రాక్టర్లకు అప్పగిస్తారనే అంశంపై స్పష్టత వస్తుంది. అప్పుడే ఇది ముందుకు కదులుతుంది.