మహిళల ఆర్థికాభివృద్ధికి చంద్రబాబు బాటలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:16 PM
మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేనని తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంటరీ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు.
జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్
పాడేరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేనని తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంటరీ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో స్థానిక మోదకొండమ్మ ఆలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన ‘స్త్రీ శక్తి’ విజయోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వారిని సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే నాడు చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళలను ఆర్థికాంశాల వైపు నడిపించారన్నారు. అది మొదలు క్రమంగా మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యారని, ఫలితంగా నేడు పారిశ్రామికవేత్తలుగా మారి ఆర్థిక శక్తిగా ఎదిగారన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. గిరిజన ప్రాంతమంటే చంద్రబాబునాయుడుకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయన ఏజెన్సీలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు గిరిజన మహిళలతో రాఖీని కట్టించుకుని, వచ్చే జన్మంటూ ఉంటే గిరిజనుడిగా పుడతానని చంద్రబాబునాయుడు సభాముఖంగా పేర్కొనడం గొప్ప విషయమన్నారు. అనంతరం టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలను బ్యాంకు లింకేజీ, రుణాలు, మహిళల పేరిట ఇల్లు, తల్లికి వందనం వంటి వాటిని అమలు చేస్తూ మహిళలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమేనన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలన్నారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్ డప్పోడి వెంకటరమణ, డైరెక్టర్ బుద్ధ జ్యోతికిరణ్, ఎంపీపీ ఎస్.రత్నకుమారి, టీడీపీ మహిళా నేతలు గబ్బాడ శాంతికుమారి, అల్లంగి సుబ్బలక్ష్మి, డిప్పల కుమారి, టీడీపీ సీనియర్ నేతలు రొబ్బి రాము, బాకూరు వెంకటరమణ, పాండురంగస్వామి, టి.సత్యనారాయణ, బుక్కా జగధీశ్, అధిక సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొన్నారు.