చెలరేగుతున్న చైన్‌స్నాచర్లు
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:10 AM
నగరంలో చైన్‌స్నాచింగ్‌లు మళ్లీ పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఒకేరోజు వేర్వేరుచోట్ల ముగ్గురు మహిళల మెడలోని ఆభరణాలను లాక్కుపోయిన దుండగులు
అంతర్‌రాష్ట్ర ముఠాగా పోలీసుల అనుమానం
ప్రత్యేక బృందాలతో గాలింపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో చైన్‌స్నాచింగ్‌లు మళ్లీ పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చాలాకాలం తర్వాత అదీ ఒకేరోజు మూడుచోట్ల స్నాచింగ్‌లు జరగడం నగరవాసులతోపాటు పోలీసులను సైతం ఆందోళనకు గురిచేసింది. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఇతర రాష్ట్రాలకు చెందినవారు నేరాలకు పాల్పడినట్టు గుర్తించి వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించారు.
నగరంలో చైన్‌స్నాచర్లు చెలరేగిపోతున్నారు. రెండేళ్ల క్రితం పోలీసులకు చైన్‌స్నాచర్లు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అయితే ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలతో చైన్‌స్నాచింగ్‌లు తగ్గాయి. కొంతకాలం నుంచి పెద్దగా కేసులు నమోదుకావడం లేదు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఇటీవల కాలంలో మళ్లీ చైన్‌స్నాచర్లు విజృంభిస్తున్నారు. ఈనెల 18వ తేదీన జాతీయ రహదారి పక్కన షీలానగర్ జంక్షన్‌లో ఉన్న డీమార్ట్‌లో సరకులు కొనుగోలు చేసుకుని ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న మహిళను ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు అనుసరించారు. జాతీయ రహదారి దిగిన వెంటనే ఆమె మెడలోని రెండున్నర తులాల పుస్తెలదాడుని తెంచుకుని పరారైపోయారు. ఆ తరువాత కొద్దిసేపటికే అక్కిరెడ్డిపాలెం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి నుంచి జాతీయ రహదారి వైపు నడుచుకుంటూ వస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును తెంచుకుపోయారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి సీ హార్స్ జంక్షన్‌లో నడుచుకుంటూ టౌన్‌కొత్తరోడ్డువైపు వెళుతున్న మహిళ మెడలోని తులం చైన్‌ను వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు తెంచుకుని పరారైపోయారు. చైన్‌స్నాచర్లు బలంగా ఆమె మెడలోని చైన్‌ను లాగడంతో అదుపుతప్పిన ఆమె తూలికిందపడిపోయింది. దీనిపై వన్‌టౌన్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఒకేరోజు గంటల వ్యవధిలో మూడుచోట్ల చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో సీపీ శంఖబ్రతబాగ్చి సీరియస్‌గా తీసుకున్నారు. నేరం జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చైన్‌స్నాచర్లు వినియోగించిన వాహనాలు, వారి ఫొటోలు, వీడియోలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. నేరానికి పాల్పడినవారు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. వారి కోసం ప్రత్యేక బృందాలతో వివిధ రాష్ట్రాలకు వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.