Share News

521 మారుమూల పల్లెల అభివృద్ధికి కేంద్ర సాయం

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:01 PM

జిల్లాలో వెనుకబడిన 521 గ్రామాలను ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్‌ గ్రామ్‌ అభియాన్‌ యోజన (పీఎం జుగా) అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు.

521 మారుమూల పల్లెల అభివృద్ధికి కేంద్ర సాయం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, పక్కన జేసీ అభిసేక్‌గౌడ

జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

పీఎం జుగాపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి

శాఖల వారీగా సర్వే చేయాలని ఆదేశం

అన్ని రంగాల్లో ఆయా గ్రామాలు అభివృద్ధి

పాడేరు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వెనుకబడిన 521 గ్రామాలను ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్‌ గ్రామ్‌ అభియాన్‌ యోజన (పీఎం జుగా) అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. పీఎం జుగా పథకం అమలుపై ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే పీఎం జన్‌మన్‌లో మంజూరైన పథకాల అమలు తీరును పరిశీలించాలన్నారు. గిరిజనులకు పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది పరిశీలించాలన్నారు. జిల్లాలో వెనుకబడిన 521 గ్రామాల్లో ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్‌ గ్రామ్‌ అభియాన్‌ యోజన అమలుకు ఎంపికయ్యాయని, పాడేరు ఐటీడీఏ పరిధిలో 260, రంపచోడవరంలో 204, చింతూరులో 57 గ్రామాలను ఎంపిక చేశారన్నారు. ఈ పథకంలో గిరిజనులకు పక్కా గృహాలు, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి పథకాలు, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు అందిస్తారన్నారు. అలాగే గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు, మొబైల్‌ కనెక్టవిటీ, ఇంటర్నెట్‌ సదుపాయం, ఆరోగ్యం, పోషకాహారం, విద్యా సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తారని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. పీఎం జుగా సర్వే ప్రొఫార్మాలను జిల్లా అధికారులకు అందించిన ఆయన, వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి నివేధికలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, డీఆర్‌వో కె.పద్మలత, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:01 PM