Share News

వందేళ్ళ వేడుక

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:27 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

వందేళ్ళ వేడుక

  • ఏయూ శత వసంతాల వేడుకలు ఘనంగా ప్రారంభం

  • ఉదయం బీచ్‌రోడ్డులో వాక్‌థాన్‌

  • సాయంత్రం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రధాన కార్యక్రమం

  • శతాబ్దకాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేక మంది జీవితాలను స్పృశించిందన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.మధుమూర్తి

  • ట్రైనింగ్‌, ప్లేస్‌మెంట్‌ విభాగాలను మరింత బలోపేతం చేస్తామన్న వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌

  • ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంగా బీచ్‌రోడ్డులో ఉదయం కాళీమాత ఆలయం నుంచి ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ వరకూ వాక్‌థాన్‌ను నిర్వహించారు. వీసీ జీపీ రాజశేఖర్‌, ఏయూ అధికారులు, పూర్వ ఉపకులపతులతో కలిసి ఈ వాక్‌థాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జయహో ఏయూ నినాదాలతో హోరెత్తించారు. ఏయూ ఖ్యాతిని తెలియజేసేలా ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపకులపతులు ప్రొఫెసర్‌ వి.బాలమోహన్‌దాస్‌, జీఎస్‌ఎన్‌ రాజు, బీల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఇక సాయంత్రం బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.మధుమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘనమైన వారసత్వం కలిగిన ఏయూ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషిచేయాలన్నారు. శతాబ్దకాలంగా ఆంధ్ర యూనివర్సిటీ అనేక మంది జీవితాలను స్పృశించిందన్నారు. విశిష్ట అతిథిగా అతిథిగా హాజరైన ఐఐటీ పాలక్కాడ్‌ డైరెక్టర్‌ ఎ.శేషాద్రి శేఖర్‌ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జాతీయ విద్యా విధానం డాక్యుమెంట్‌ను చదవాలన్నారు. ఏయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ మాట్లాడుతూ దార్శనికుల వారసత్వం, నాయకత్వం ఏయూను నడిపిస్తున్నాయన్నారు. ట్రైనింగ్‌, ప్లేస్‌మెంట్‌ విభాగాలను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. నిబద్ధతతో పనిచేస్తామని, ఏడాదిపాటు నిర్వహించే శతాబ్ది వేడుకలకు నోబెల్‌ గ్రహీతలను ఆహ్వానిస్తామన్నారు. ఈ సందర్భంగా ఏయూపై స్వయంగా ఆయన రాసిన కవితను చదివి వినిపించారు. ఎంపీ ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతూ దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని వాటిని సాధించే దిశగా పనిచేయాలన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం తరపున వర్సిటీ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తామని చైర్మన్‌ కేవీవీ రావు అన్నారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ఈఎన్‌ ధనుంజయరావు, రెక్టార్‌ ఎన్‌.కిశోర్‌బాబు, మాజీ వీసీలు బీల సత్యనారాయణ, జీఎస్‌ఎన్‌ రాజు, శశిభూషణ్‌, ప్రిన్సిపాల్స్‌ ఎంవీఆర్‌ రాజు, సత్యనారాయణతోపాటు పలు విభాగాధిపతులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సీనియర్‌ ప్రొఫెసర్‌ శాంతమ్మ, మాజీ ప్రొఫెసర్‌ బి.ప్రసాదరావును సన్మానించారు. సెంటినరీ విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి నిర్వహించిన సెంటినరీ లోగో పోటీలకు సంబంధించిన విజేతను ప్రకటించారు. ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థి షేక్‌ రఫీ రూపొందించిన లోగోను ఏడాదిపాటు నిర్వహించనున్న వేడుకలకు వినియోగిస్తామని వీసీ ప్రకటించారు.

రాష్ట్రానికే తలమానికం: నగర పోలీస్‌ కమిషనర్‌

రాష్ట్రానికే ఏయూ తలమానికంగా నిలిచిందని, ఇది అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందాలని నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. శనివారం ఉదయం ఏయూ పరిపాలనా భవనం వద్ద శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ వ్యవస్థాపక ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన బెలూన్‌ను ఆయన ఎగురవేశారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు పాల్గొన్నారు. వీసీతోపాటు ఏయూ అధికారులు ఏయూ పరిపాలనా భవనం, సిరిపురం కూడలి వద్ద ఉన్న సీఆర్‌ రెడ్డి విగ్రహాలకు, మహాత్మా గాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌, ఏపీ పాత్రతో సహా పలువురు ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Apr 27 , 2025 | 01:27 AM