Share News

రేషన్‌ డిపోల్లో సీసీ కెమెరాలు

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:22 AM

ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టడానికి పౌర సరఫరాల శాఖ కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది. ప్రతి రేషన్‌ డిపోలో సీసీ కెమెరాలు అమర్చాలని ప్రతిపాదించింది. తొలుత నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో అన్ని జిల్లాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పౌర సరఫరాల శాఖ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ల ప్రతినిధులు ఇటీవల పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది.

రేషన్‌ డిపోల్లో సీసీ కెమెరాలు

బియ్యం విక్రయాలకు చెక్‌ చెప్పేందుకు

ఉన్నతాధికారుల నిర్ణయం

తొలుత నెల్లూరు జిల్లాలో ఏర్పాటు

అక్కడ పనితీరు మదించిన తరువాత మిగిలిన జిల్లాల్లో...

ముందు గోదాముల్లో ఏర్పాటుచేయాలంటున్న డీలర్లు

విశాఖపట్నం/గాజువాక/ఆరిలోవ,

నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):

ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టడానికి పౌర సరఫరాల శాఖ కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది. ప్రతి రేషన్‌ డిపోలో సీసీ కెమెరాలు అమర్చాలని ప్రతిపాదించింది. తొలుత నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో అన్ని జిల్లాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పౌర సరఫరాల శాఖ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ల ప్రతినిధులు ఇటీవల పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది.

ప్రభుత్వం కిలో బియ్యం రూ.46 చొప్పున కొనుగోలు చేసి డిపోల ద్వారా కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అయితే పౌర సరఫరాల శాఖ సరఫరా చేసే బియ్యం వినియోగించేందుకు కార్డుదారుల్లో అత్యధికులు విముఖత చూపుతున్నారు. డీలర్‌ వద్దకు వెళ్లి వేలిముద్ర వేసి కిలోకు రూ.12 నుంచి రూ.15 సొమ్ములు తీసుకుంటున్నారు. డీలర్లు ఆ బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి తెరదించాలని మంత్రిని అధికారులు కోరారు. డిపోల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే బియ్యానికి బదులు సొమ్ములు తీసుకునే ప్రక్రియకు చెక్‌ పడుతుందని సూచించారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలని అధికారులు ప్రతిపాదించగా నెల్లూరు జిల్లాలో డీలర్లు ముందుకు వచ్చారు. ఆ జిల్లాలోని అన్ని డిపోల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు తరువాత పనితీరును మదించి మిగిలిన జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.

రేషన్‌ డిపోల్లో సీసీ కెమెరాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే ముందుగా పౌర సరఫరాల సంస్థ గోదాముల్లో పెట్టాలని డీలర్లు కోరుతున్నారు. పౌర సరఫరాల సంస్థ గోదాముల నుంచి ప్రతి నెలా సరకులను డిపోలకు సరఫరా చేస్తారు. అయితే ప్రతి బస్తాలో కిలో నుంచి రెండు కిలోల బియ్యం తక్కువగా ఉంటున్నట్టు డీలర్లు చెబుతున్నారు. అందువల్ల తొలుత గోదాముల్లో అక్రమాలు అరికట్టేందుకు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని డీలర్లు కోరుతున్నారు. అలాగే డీలర్లకు ప్రతి కిలోకు ఇప్పుడు ఇస్తున్న రూపాయి కమీషన్‌ను మూడు రూపాయలకు పెంచాలని అడుగుతున్నారు. అక్రమ బియ్యం కొనుగోలు చేసే రైస్‌మిల్లుల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాల్సి ఉంది.

Updated Date - Nov 27 , 2025 | 01:22 AM