వైద్యుడిపై సీబీఐ
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:50 AM
మెడికల్ కాలేజీల తనిఖీల్లో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన పలువురిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
నగరానికి చెందిన డాక్టర్‌తో పాటు మెడికల్ కళాశాల డైరెక్టర్‌పై చార్జిషీట్
అనుమతుల వ్యవహారంలో అక్రమాలు
లంచాలతో అధికారులను ప్రలోభ పెట్టినట్టు అభియోగాలు
వైద్య వర్గాల్లో కలకలం
విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):
మెడికల్ కాలేజీల తనిఖీల్లో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన పలువురిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా 36 మందిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేయగా, వారిలో విశాఖకు చెందిన ఒక వైద్యుడు, మరో ప్రముఖ ఆస్పత్రి డైరెక్టర్ కూడా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో నగరానికి చెందిన డాక్టర్ కృష్ణకిషోర్, ఓ ఆస్పత్రి డైరెక్టర్ వెంకట్ పేర్లు ఉండడంతో వైద్య వర్గాల్లో కలకలం రేగింది. ఈ కేసు విషయానికి వస్తే...నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, ఇతర వివరాలను పరిశీలిస్తుంటుంది. అక్కడి పరిస్థితులను బట్టి ప్రవేశాలకు అనుమతులు జారీచేస్తుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన వైద్యులను తనిఖీల నిమిత్తం పంపిస్తుంటుంది. అయితే, ఇలా వెళ్లిన వైద్యులతోపాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు చెందిన అధికారులను ప్రలోభపెట్టి కొన్ని కాలేజీలు అనుమతులను తెచ్చుకున్నట్టు సీబీఐ విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తం చేతులు మారినట్టు గుర్తించారు. విశాఖకు చెందిన డాక్టర్ కృష్ణకిశోర్ కూడా అడ్డగోలు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. నగర పరిధిలోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ నుంచి సుమారు రూ.50 లక్షల వరకు తీసుకున్నట్టు సీబీఐ అధికారులు తేల్చారు. సదరు ఆస్పత్రి డైరెక్టర్ అనుమతుల కోసం అడ్డగోలు వ్యవహారానికి పాల్పడినట్టు నిర్ధారించారు. ఈ మేరకు డాక్టర్ కృష్ణకిశోర్‌తోపాటు సదరు ఆస్పత్రి డైరెక్టర్‌పై సీబీఐ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు చెందిన వైద్యులు తనిఖీలకు వచ్చిన సమయంలో డమ్మీ బోధకులను ఏర్పాటుచేసి ఆస్పత్రికి అనుమతులు రావడంలో వీరు కీలకంగా వ్యవహరించినట్టు సీబీఐ అధికారులు తేల్చినట్టు తెలిసింది. అయితే, డాక్టర్ కృష్ణకిశోర్ విశాఖలో ఎక్కువగా ఉండరని, విజయవాడకు చెందిన మరో వైద్యుడికి సహాయకుడిగా ఉంటూ ఈ వ్యవహారాన్ని సాగించినట్టు చెబుతున్నారు.
బహిర్గతమైన డొల్లతనం..
నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు తెచ్చుకునేందుకు అనేక మెడికల్ కాలేజీలు ఈ తరహా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడడం ఎప్పటి నుంచో జరుగుతోందని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా తాజా ఉదంతం నొక్కి చెప్పింది.