Share News

జీడిమామిడి రైతు డీలా

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:20 AM

అకాల వర్షాలు జీడిమామిడికి అపార నష్టం కలిగించాయి. పూత పిందెతో కళకళలాడుతున్న సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో పూత, పిందె నేల రాలి తోటలన్నీ బోడిగా ఆకులతో దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయని ఆశించిన రైతులు వర్షాల వల్ల నష్టపోయి దిగాలు చెందుతున్నారు.

జీడిమామిడి రైతు డీలా
వచ్చిన ఫలసాయం నుంచి పిక్కలు వేరు చేస్తున్న రైతులు

అకాల వర్షంతో అపార నష్టం

స్థానిక వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించేస్తున్న వైనం

నష్టాలతో రైతులు విలవిల

ఐటీడీఏ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని వేడుకోలు

కొయ్యూరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు జీడిమామిడికి అపార నష్టం కలిగించాయి. పూత పిందెతో కళకళలాడుతున్న సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో పూత, పిందె నేల రాలి తోటలన్నీ బోడిగా ఆకులతో దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయని ఆశించిన రైతులు వర్షాల వల్ల నష్టపోయి దిగాలు చెందుతున్నారు.

మండల వ్యాప్తంగా సుమారు ఐదు వేల హెక్టార్లులో జీడిమామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన మైదాన ప్రాంత వర్తకులు ఇక్కడి జీడిమామిడి తోటలను లీజుకు తీసుకుంటున్నారు. దీనికి గానూ రైతులకు వారు రూ.లక్షల్లో నగదు చెల్లిస్తుంటారు. కొన్ని పంచాయతీల్లో రైతులే సొంతంగా పెట్టుబడులు పెట్టి ఫల సాయాలను సేకరిస్తారు. ఈ ఒక్క మండలం నుంచే సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. గతంలో ఒడిశా, తుని, నర్సీపట్నం, తదితర ప్రాంతాల వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసేవారు. అప్పట్లో కొంత మేర రైతులకు న్యాయం జరిగేది. అయితే కృష్ణాదేవిపేట, గింజర్తి, కాకరపాడు, కొయ్యూరు, రేవళ్లు, కంఠారం, రావణాపల్లి పంచాయతీల్లోనూ వంద మందికి పైగా వ్యాపారులు తయారై వారే ఈ ప్రాంతంలో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు. గతంలో పలాసా నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసేవారు. స్థానిక వ్యాపారులు సిండికేట్‌గా మారి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులను అడ్డుకుంటున్నారు.

రైతుల ఆశలు ఆవిరి

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆశించిన రీతిలో దిగుబడి వచ్చే సూచనలతో జీడిమామిడి తోటలు కనిపించాయి. దీంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అకాల వర్షాలతో పాటు అగ్గి తెగులు, తేనె మంచు ప్రభావంతో దిగుబడి పూర్తిగా తగ్గడంతో వారి ఆశలు ఆవిరై పోయాయి. ప్రస్తుతం ఎకరానికి కనీసం బస్తా పిక్కలు రాని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు బహిరంగ మార్కెట్‌లో బస్తా ధర(80 కిలోలు) రూ.12 వేలు నుంచి రూ.13 వేలు మధ్యలో ఉండగా, కొయ్యూరులో దళారులు రూ.10,800 నుంచి ప్రారంభించి వర్షాల వల్ల పిక్కలు రంగు లేదని, కటింగ్‌లో పప్పు రావడం లేదని సాకులు చెబుతూ రూ.10 వేలుకు కొనుగోలు చేస్తున్నారు. అయితే రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో జీడిమామిడి పిక్కలు వన్‌ధన్‌ వికాస కేంద్రాల ద్వారా కిలో రూ.150 వంతున అంటే బస్తా రూ.12 వేలు చొప్పున కొనుగోలుకు అక్కడి ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం చర్యలు చేపట్టారు. కొయ్యూరు మండలానికి వచ్చే సరికి స్థానిక వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. తూకంలో కూడా మోసాలకు పాల్పడుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా పాడేరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో స్పందించి గిట్టుబాటు ధరకు జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:20 AM