ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే డీలర్లపై కేసులు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:54 AM
రైతులకు ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రైతులకు ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎరువుల డీలర్లు, వ్యవసాయాధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. డీలర్లు ఎరువులను అధిక ధరకు విక్రయించడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం ఎంపీపీలు ఫిర్యాదు చేశారన్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే ఎరువులను రైతులకు అందించాలన్నారు. మండల స్థాయిలో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలు, ఇంకా ఎంత అవసరం ఉంటుందో వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. గంగవరం మండలానికి చెందిన రైతులు ఎక్కడ నుంచి ఎరువులు కొనుగోలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అయితే దేవీపట్నం, గంగవరం, రంపచోడవరం మండలాలకు ఎరువుల కొరత లేదని అధికారులు తెలిపారు. అధికారులు ఎరువుల దుకాణాలను తనిఖీలు చేసి అధిక ధరకు విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్ గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహచలం, సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, వ్యవసాయాధికారులు, డీలర్లు పాల్గొన్నారు.