విద్యార్థి మృతిఘటనలో నలుగురిపై కేసు
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:15 AM
మండలంలోని తిమ్మరాజుపేట డావిన్సీ స్కూలు స్విమ్మింగ్ పూల్‌లో పడి ఒకటో తరగతి విద్యార్ధి మృతిచెందిన ఘటనకు సంబంధించి రెండో రోజూ కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి కుటుంబీకులు డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులు పాఠశాలకు చెందిన ఇద్దరు నిర్వాహకులు, బస్సు డ్రైవర్, మృతిచెందిన విద్యార్థి క్లాస్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
తిమ్మరాజుపేటలో రెండో రోజూ కొనసాగిన ఉద్రిక్తత
పాఠశాల నిర్వాహకులను అరెస్టు చేయాలని డిమాండ్
పోలీసు ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమణ
మునగపాక, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిమ్మరాజుపేట డావిన్సీ స్కూలు స్విమ్మింగ్ పూల్‌లో పడి ఒకటో తరగతి విద్యార్ధి మృతిచెందిన ఘటనకు సంబంధించి రెండో రోజూ కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి కుటుంబీకులు డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులు పాఠశాలకు చెందిన ఇద్దరు నిర్వాహకులు, బస్సు డ్రైవర్, మృతిచెందిన విద్యార్థి క్లాస్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో వారు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
ఎలమంచిలికి చెందిన జనపరెడ్డి శ్రీనివాసరావు, నాగశ్రీలత, దంపతుల కుమారులు ప్రశాంత్, మోక్షిత్ సందీప్ మునగపాక మండలం తిమ్మరాజుపేటలోని డావిన్సీ స్కూలులో ఆరో తరగతి, ఒకటో తరగతి చదువుతున్నారు. రోజూ బస్సులో వెళ్లివస్తుంటారు. గురువారం ఉదయం సాయంత్రం స్కూల్ నుంచి పెద్ద కుమారుడు ఒక్కడే రావడంతో. ఆందోళన చెందిన తల్లి శ్రీలత... బస్సు డ్రైవర్, తరగతి టీచర్, ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో కుటుంబీకులతో కలిసి పాఠశాలకు వెళ్లారు. స్విమ్మింగ్ పూల్ పక్కన సందీప్ మృతిచెంది కనిపించాడు. దీంతో నిర్ఘాంతపోయిన వారు కన్నీరుమున్నీరు అయ్యారు. పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు, మండలస్థాయి అధికారులు వచ్చి.. పాఠశాల నిర్వాహకులను రప్పిస్తామని, సంయమనం పాటించాలని కోరారు. కానీ పాఠశాల నిర్వాహకులు రాకపోవడంతో రాత్రి అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగించారు.
కాగా ఆర్మీలో పనిచేస్తున్న విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు ఇటీవల సెలవుపై ఎలమంచిలి వచ్చారు. సెలవులు ముగియడంతో గురువారం ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం కుమారుడు మృతిచెందిన వార్త తెలియడంతో ప్రయాణిన్ని రద్దుచేసుకుని శుక్రవారం ఉదయం 11 గంటలకు పాఠశాల వద్దకు వచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. అనంతరం పోలీసులు గట్టి బందోబస్తు మధ్య పాఠశాల ఎండీ సుందరయ్య, డైరెక్టర్ రమణాజీతోపాటు బస్సు డ్రైవర్, క్లాస్‌టీచర్‌ను తీసుకువచ్చారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని జీపులో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. బాలుడి తల్లి నాగశ్రీలత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ చెప్పడంతో శ్రీలత... పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్, క్లాస్ టీచర్‌ను బాధ్యులను చేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆందోళన విరమించారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎలమంచిలి సీఐ ధనుంజయరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.