సంతకాల ఫోర్జరీపై కేసు!
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:48 AM
ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్‌కు అవసరమైన భూ సేకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి.
గూగుల్ డేటా సెంటర్‌కు తర్లువాడలో భూ సేకరణ
కోర్టును ఆశ్రయించిన కొంతమంది రైతులు
15 మందిలో కొందరి సంతకాలు ఫోర్జరీ
పోలీసులకు ఆనందపురం తహసీల్దార్ ఫిర్యాదు
విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్‌కు అవసరమైన భూ సేకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. దీనిపై కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో కొందరి సంతకాలు ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆనందపురం తహసీల్దార్ శ్రీనుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గూగుల్ డేటా సెంటర్‌కు తర్లువాడలో 308 ఎకరాలు భూమిని సమీకరించి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోని 110 ఎకరాల్లో 51 మంది పట్టా రైతులు ఉండగా, మరో 100 ఎకరాలకు 88 మంది ఆక్రమణదారులున్నారు. మిగిలినది ప్రభుత్వ భూమి. పట్టా రైతుల్లో 22 మంది సమ్మతి తెలియజేశారు. మిగిలిన వారిలో మరికొందరు అనుకూలంగా ఉన్నారు. సమ్మతి తెలిపిన వారికి ప్రభుత్వ పరిహారం బ్యాంకు ఖాతాలకు జమ అయిన వెంటనే వీరంతా ముందుకు వస్తారని చెబుతున్నారు. మిగిలిన వారికి మరోసారి నచ్చచెప్పాలని అధికారులు యోచిస్తున్నారు. అప్పటికీ వినకపోతే భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసే యోచనలో ఉన్నారు. అన్నివిధాలా మేలైన పరిహారం ఇస్తున్నందున రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారంటున్నారు. పరిహారం కోసం జాబితా సిద్ధంచేసిన అధికారులు బహుశా సోమ, మంగళవారాల్లో బ్యాంకుకు పంపే అవకాశం ఉంది.
ఇదిలావుండగా భూములు ఇచ్చేది లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన 15మంది రైతుల్లో కొందరి సంతకాలు ఫోర్జరీ జరిగాయనే విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆనందపురం తహశీల్దారు శ్రీనుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టులో కేసు వేసిన వారిని విచారిస్తున్నారు.
విగత జీవిగా..
గల్లంతైన ఇద్దరు విద్యార్థుల్లో తీరానికి చేరిన తేజేస్ మృతదేహం
కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు
శ్రీఆదిత్య ఆచూకీ కోసం గాలింపు
మద్దిలపాలెం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
వుడా పార్కు వెనుక బీచ్‌లో శనివారం గల్లంతైన విద్యార్థి మానేపల్లి తేజెస్ మృతదేహం ఆదివారం తీరానికి కొట్టుకొచ్చింది. సముద్రంలో స్నానానికి దిగిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులు తేజెస్, శ్రీఆదిత్యలు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా శ్రీఆదిత్య ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వుడా పార్క్ వద్ద లభ్యమైన తేజెస్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.