Share News

అందుబాటులోకి క్యారవాన్‌ టూరిజం

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:25 PM

పర్యాటకులకు ఏపీటీడీసీ క్యారవాన్‌ టూరిజం అందుబాటులోకి తీసుకొచ్చిందని లంబసింగి యూనిట్‌ మేనేజర్‌ ఎస్‌.అప్పలనాయుడు తెలిపారు.

అందుబాటులోకి క్యారవాన్‌ టూరిజం
లంబసింగి వచ్చిన ఓజీ డ్రీమ్‌లైనర్స్‌ క్యారవాన్‌తో ప్రతినిధులు, యూనిట్‌ మేనేజర్‌ అప్పలనాయుడు

ట్రయల్‌ రన్‌లో భాగంగా లంబసింగి రాక

చింతపల్లి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పర్యాటకులకు ఏపీటీడీసీ క్యారవాన్‌ టూరిజం అందుబాటులోకి తీసుకొచ్చిందని లంబసింగి యూనిట్‌ మేనేజర్‌ ఎస్‌.అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఏపీటీడీసీతో ఎంవోయూ కుదుర్చుకున్న ఓజీ డ్రీమ్‌లైనర్స్‌ క్యారవాన్‌ సర్వీస్‌ ప్రతినిధులు లంబసింగిలో పర్యటించారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా హైదరాబాద్‌ నుంచి క్యారవాన్‌ను లంబసింగి తీసుకొచ్చారు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల సందర్శనలకు అనువైన ప్రాంతాలు, హరిత రిసార్ట్స్‌లో వసతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిట్‌ మేనేజర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఓజీ డ్రీమ్‌లైనర్స్‌ క్యారవాన్‌ ఏపీటీడీసీతో కలిసి పర్యాటకులకు సేవలందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. ఓజీ డ్రీమ్‌లైనర్స్‌ క్యారవాన్‌లో అత్యాధునిక లగ్జరీ సదుపాయాలు ఉన్నాయన్నారు. ఒక కుటుంబం సౌకర్యవంతంగా క్యారవాన్‌లో బస చేయవచ్చునన్నారు. క్యారవాన్‌ ద్వారా లంబసింగి, వంజంగి హిల్స్‌, అరకులోయ, బొర్రా గృహలు సందర్శించాలని ఆశించిన సందర్శకులు పర్యాటకశాఖను సంప్రతించాలన్నారు. క్యారవాన్‌లో వచ్చే పర్యాటకులకు లంబసింగి ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్‌లో మంచి విడిది అందుబాటులో ఉందని తెలిపారు.

Updated Date - Nov 16 , 2025 | 11:25 PM