కారు జోరు
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:29 AM
జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా కార్ల ధరలు కంపెనీ, మోడల్‌ను బట్టి రూ.60 వేల నుంచి రూ.2.5 లక్షల వరకూ తగ్గాయి.
జీఎస్టీ తగ్గింపు, దసరా ఆఫర్లతో భారీగా పెరిగిన విక్రయాలు
సాధారణ రోజులతో పోలిస్తే రెండు నుంచి నాలుగు రెట్లు...
ఒక్కో కారుపై రూ.60 వేల నుంచి రూ.1.8 లక్షల వరకు తగ్గుముఖం
ఇదే మంచి తరుణంగా భావిస్తున్న కొనుగోలుదారులు
మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందన్న ప్రచారమూ కారణం
విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా కార్ల ధరలు కంపెనీ, మోడల్‌ను బట్టి రూ.60 వేల నుంచి రూ.2.5 లక్షల వరకూ తగ్గాయి. దీంతో గత వారం రోజులుగా కార్ల షోరూమ్‌లన్నీ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. కొన్ని కంపెనీలైతే డిమాండ్‌కు తగ్గట్టుగా కార్లను సరఫరా చేయలేకపోతున్నాయి. వినియోగదారులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
వాహనాలపై గతంలో జీఎస్టీ 28 శాతం ఉండేది. దానిని ఈ నెల 22 నుంచి 18 శాతానికి (చాలా మోడళ్లపై) తగ్గించడం, మరోవైపు దసరా పండగ నేపథ్యంలో కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో గడిచిన వారం రోజుల నుంచి ప్రతిరోజూ పదుల సంఖ్యలో బుకింగ్స్ వస్తున్నాయని వరుణ్ మోటార్స్ ఎరీనా డివిజన్ జీఎం జీవీఎస్‌ఎన్ రాజు తెలిపారు. దసరాకు ముందే డెలివరీ ఇవ్వాలని కోరుతున్నారన్నారు. గతంలో షోరూమ్‌కు రోజుకు ఐదు నుంచి పది మంది వస్తుండేవారని, గడిచిన వారం నుంచి తక్కువలో తక్కువ 50 మంది నుంచి 60 మంది వరకూ వస్తున్నారని, వారిలో కనీసం పది మంది అయినా బుక్ చేసుకుని వెళుతున్నారని వరుణ్ మోటార్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని కంపెనీల కార్ల షోరూమ్‌లలోనూ కనిపిస్తోంది.
రెండు నుంచి నాలుగు రెట్లు అమ్మకాలు..
దసరా పండగకు మామూలుగానే కార్ల అమ్మకాలు భారీగా ఉంటాయి. పది రోజుల ముందు నుంచి పెద్దఎత్తున బుకింగ్స్ వస్తుంటాయి. మారుతీ సుజుకీ కంపెనీ వివిధ మోడల్ కార్లు సాధారణ రోజుల్లో జిల్లాలోని అన్ని షోరూమ్‌లలో కలిపి పది నుంచి 12 వరకూ విక్రయిస్తుంటుంది. దసరాకు ముందు అయితే ఈ సంఖ్య మరో ఎనిమిది వరకూ పెరుగుతుంది. అంటే, 20 కార్లను విక్రయిస్తుంటారు. కానీ, ఈ నెల 22 నుంచి అనూహ్యంగా విక్రయాలు పెరిగినట్టు వరుణ్ మోటార్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం 60 నుంచి 70 వరకూ జిల్లాలో విక్రయిస్తున్నారు. ఇందులో అత్యధికం స్విఫ్ట్, డిజైర్, వేగనార్, బ్రెజా ఉన్నాయి. హ్యుండయ్ కంపెనీకి చెందిన కార్ల విక్రయాలు కూడా అలాగే ఉన్నాయి. క్రెటా కారు అత్యధికంగా సేల్ అవుతున్నట్టు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు వెల్లడించారు. సాధారణ రోజుల్లో నాలుగు షోరూమ్‌లల్లో పది కార్లను విక్రయిస్తే..జీఎస్టీ తగ్గిన తరువాత నుంచి 25 నుంచి 30 వరకు విక్రయిస్తున్నట్టు చెబుతున్నారు. టాటా, మహీంద్ర వంటి కంపెనీలకు చెందిన కార్ల విక్రయాలు కూడా రెట్టింపు అయినట్టు చెబుతున్నారు.
పెరిగిపోతాయన్న ప్రచారమూ..
జీఎస్టీ మార్పుతో కార్ల ధరలు ఊహించని రీతిలో తగ్గాయి. అదే సమయంలో దసరా పండగ నేపథ్యంలో కార్ల కంపెనీలు ఆఫర్లను అందిస్తున్నాయి. కారు మోడల్‌ను బట్టి లక్ష రూపాయలు నుంచి రూ.2.5 లక్షల వరకు తగ్గుతోంది. కొద్దిరోజుల తరువాత తగ్గిన జీఎస్టీ రేట్లకు అనుగుణంగా కంపెనీలు ధరలు పెంచేస్తాయన్న ప్రచారమూ డిమాండ్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు.
ఇన్నాళ్లకు కోర్కె నెరవేరింది
- ఎన్.త్రినాథ్, ఆరిలోవ
కారు కొనాలన్న కోర్కె ఎప్పటి నుంచో ఉంది. అయితే, ఽరేట్లు భారీగా ఉండడంతో వెనక్కి తగ్గుతూ వచ్చాను. జీఎస్టీ తగ్గింపుతో ఇప్పుడు రేట్లు దిగివచ్చినట్టు స్నేహితులు చెప్పారు. వెంటనే షోరూమ్‌కు వచ్చి వాకబు చేశాను. మారుతీ స్విఫ్ట్ తీసుకుంటున్నా. గతంలో రూ.7.8 లక్షల వరకూ ఉండేది. ఇప్పుడు సుమారు 1.3 లక్షల వరకు తగ్గింది. ఇదే మంచి తరుణంగా అనిపించి తీసుకున్నా. మూడు, నాలుగు రోజుల్లో డెలివరీ ఇస్తానన్నారు. ఇన్నాళ్లకు కోర్కె నెరవేరుతుండడంతో ఆనందంగా ఉంది.