Share News

గంజాయి గుప్పు.. ఎవరిది తప్పు?

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:38 PM

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి కిలోల కొద్దీ గంజాయి జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోంది. జిల్లాలోని చెక్‌ గేట్లను దాటి రవాణా అవుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పోలీసుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గంజాయి గుప్పు.. ఎవరిది తప్పు?
మాడుగుల మండలం శంకరం పంచాయతీ బొడ్డరేవు వద్ద సోమవారం గంజాయితో పట్టుబడిన నిందితులు

దర్జాగా జిల్లాను దాటి ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్న కిలోల కొద్దీ గంజాయి

జిల్లా సరిహద్దులోని చెక్‌ గేట్లు దాటి వెళుతుండడంపై అనుమానాలు

తాజాగా అనకాపల్లి జిల్లాలో 736 కిలోలు పట్టివేత

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకం

రవాణాకు సహకరిస్తున్న వారెవరో?

స్మగ్లర్ల వాహనాల్లో పోలీసులు తిరుగుతున్నా ఉన్నతాధికారులు మౌనం

ఇలా అయితే గంజాయి కట్టడి సాధ్యమేనా అని పలువురి సందేహం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి కిలోల కొద్దీ గంజాయి జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోంది. జిల్లాలోని చెక్‌ గేట్లను దాటి రవాణా అవుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పోలీసుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి జిల్లా మీదుగా రవాణా అయి తాజాగా అనకాపల్లి జిల్లాలో మూడు చోట్ల 736 కిలోల గంజాయి ఒకే రోజు పట్టుబడడం కలకలం రేపింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పట్టుబడుతున్న గంజాయి ఒడిశా నుంచి దిగుమతి అవుతుందని పోలీసులు చెబుతున్నప్పటికీ, అది ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో రెండు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు భూభాగంలో సాగవుతుందనే వాదన బలంగా వినిపిస్తున్నది. అలాగే గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న నిందితులు సైతం ఇతర రాష్ట్రాల వారి కంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వారే అధికంగా ఉండడంతో ఈ గంజాయి ఎక్కడిదనే అనుమానం కలుగుతున్నది. సోమవారం అనకాపల్లి జిల్లాలో మూడు చోట్ల పట్టుబడిన గంజాయి కేసుల్లో 16 మంది నిందితుల్లో 14 మంది అల్లూరి జిల్లాకు చెందిన వాళ్లే ఉన్నారు. వాస్తవానికి ఆయా కేసుల్లోని నిందితులు ఒడిశా, మహరాష్ట్ర ప్రాంతాలకు చెందిన వారుండడం సహజం. కానీ అందుకు భిన్నంగా అల్లూరి జిల్లాకు చెందిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఈ గంజాయి వాస్తవంగా ఒడిశా నుంచి దిగుమతి అయిందా?, లేక జిల్లాలోనే పండించారా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఒడిశాకు చెందిన గంజాయే అనుకుంటే, జిల్లాకు చెందిన స్మగ్లర్లు అధికంగా ఉన్నారంటే, వారిపై జిల్లాలో పోలీసులకు కనీస నిఘా లేదని స్పష్టమవుతున్నది. దీంతో ఉమ్మడి విశాఖపట్నం లేదా ఇతర ప్రాంతాల్లో పట్టుబడుతున్న గంజాయి కేవలం ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా ముద్ర వేసి మిన్నకుంటే, చాపకింద నీరులా అల్లూరి జిల్లాలో గంజాయి సాగు పెరిగే ప్రమాదముందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని గంజాయి సాగు, రవాణాపై పోలీసు యంత్రాంగం మరింత పటిష్టంగా, పారదర్శకంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఉన్నతాధికారులకు సంపూర్ణ అవగాహన లేకపోవడం, స్టేషన్లలో ఉండే అధికారులపైనే పూర్తిగా ఆధారపడడంతో తప్పులు జరుగుతున్నాయని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గతంలో గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తున్న వ్యవహారాల్లో మారేడుమిల్లి సీఐ, మోతుగూడెం ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయ్యారు. వాస్తవానికి అప్పట్లోనూ తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు వారిపై చర్యలు చేపట్టారు. మోతుగూడెం ప్రాంతం నుంచి రవాణా అవుతున్న గంజాయి నెల్లూరు జిల్లాలో పట్టుబడింది. ఈ క్రమంలో మోతుగూడెం పోలీసులు స్మగ్లర్ల వద్ద డబ్బులు తీసుకుని గంజాయి రవాణాకు సహకరించినట్టు నెల్లూరు పోలీసులకు పక్కా ఆధారాలు లభించడంతోనే వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. అది ఏలూరు రేంజ్‌ పరిధిలో ఉండడంతో పోలీసు అధికారులపై తక్షణ చర్యలు చేపట్టారు. అదే విశాఖపట్నం రేంజ్‌ పరిధిలో ఇటువంటి ఘటనలు జరిగితే పట్టించుకోరనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. జిల్లాలోని అధికారులు సైతం అలానే వ్యవహరిస్తున్నారు. గంజాయి వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో పోలీసులు, ఇతరుల పాత్రపై అధికారులు కనీసం దృష్టి సారించడం లేదని తెలుస్తున్నది. వాస్తవానికి మావోయిస్టుల కదలికలను సైతం ఇట్టే కనిపెడుతున్న పోలీసులకు గంజాయి సాగు, రవాణా, స్మగ్లర్లు, వారికి సహకరిస్తున్న వారిని కట్టడి చేయడం పెద్ద విషయం కాదు. కానీ అందుకు చిత్తశుద్ధి, అంకితభావం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జిల్లా సరిహద్దులో చెక్‌ గేట్లు దాటుతున్న గంజాయి

ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా జరుగుతున్న క్రమంలో జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్‌ గేట్లు ఎలా దాటిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిత్యం తనిఖీల పేరిట పోలీసులు విపరీతమైన హడావుడి చేస్తుంటారు. గంజాయి స్మగ్లర్ల సంగతి అటుంచితే, సామాన్యులు, కుటుంబాలతో రాకపోకలు సాగిస్తున్న వారిని తనిఖీలు చేస్తుంటారు. ఈ క్రమంలో జిల్లాను దాటి గంజాయి ఇతర జిల్లాలకు ఎలా తరలుతుందనేది జవాబు దొరకని ప్రశ్నగా మారింది. వాస్తవానికి జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో, అనంతగిరి ఘాట్‌లోని బొడ్డవర వద్ద, చింతపల్లి ఘాట్‌లో డౌనూరు, పాడేరు ఘాట్‌ కింద తాటిపర్తి వద్ద కేవలం గంజాయి తనిఖీల కోసమే ప్రత్యేకంగా చెక్‌గేట్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వాహనాల్లో వందల కిలోల గంజాయి అల్లూరి జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా జరుగుతుందంటే? పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మంగళవారం నక్కపల్లి మండలం నెల్లిపూడి వద్ద 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆ గంజాయిని ఒడిశా రాష్ట్రంలో కొనుగోలు చేసి చింతపల్లి మండలం లంబసింగి తీసుకువచ్చి అక్కడ నుంచి ఆటోలో నేరుగా నర్సీపట్నం, అక్కడి నుంచి కారులో నక్కపల్లి మండలం నెల్లిపూడి గ్రామానికి తరలించి నిల్వ చేశారు. ఈ క్రమంలో జిల్లాలోని పోలీసుల సహకారం లేకుండా స్మగ్లర్లు వాహనంలో గంజాయిని ఒడిశా నుంచి చింతపల్లి, కొయ్యూరు మండలాలు దాటించి అనకాపల్లి జిల్లాలోకి ఎలా తరలించగలరనేది తాజాగా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఈ కోణంలో పోలీసులు సమగ్ర విచారణ జరిపితే గంజాయి రవాణాలో సూత్ర, పాత్రధారులు సైతం వెలుగులోకి వస్తారు.

గంజాయి అక్రమ సంపాదన జప్తు కొందరికేనా.?

గంజాయి సాగు, రవాణా ద్వారా సంపాదించిన అక్రమ ఆస్తుల జప్తులో సైతం పోలీసులు పారదర్శకత పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గంజాయి సాగు, రవాణా ద్వారా ఆస్తులు సంపాదించిన భూమి యజమానులు, స్మగ్లర్లు, రవాణాదారులు, వారికి సహకరిస్తున్న పోలీసులు, తదితరుల ఆస్తులు సైతం జప్తు చేస్తే కొంత వరకు గంజాయి శాశ్వత నిర్మూలన మరింత వేగంగా జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎన్నో అక్రమాలు చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకుని హాయిగా ఉంటున్న కొంత మంది స్మగ్లర్లను మాత్రమే గుర్తించి, అదీ కూడా వారి అక్రమ సంపాదనలో నాలుగో వంతు ఆస్తులు మాత్రమే జప్తు చేస్తుండడంతో వారు పెద్ద నష్టంగా భావించడం లేదు. అలాగే ఆయా స్మగ్లర్లు కోట్లాది రూపాయాలు కూడబెట్టేందుకు సహకరించిన వారిపైనా పోలీసులు నిఘా పెట్టడడం లేదు. అలా నిఘా పెడితే పలువురు పోలీసులు, తదితరులు సైతం వెలుగులోకి వస్తారు.

స్మగ్లర్ల వాహనాలతో పోలీసుల జల్సాలు

జిల్లాలోని కొందరు పోలీసులకు గంజాయి స్మగ్లర్లతో పరోక్ష సంబంధాలున్నాయనే ఆరోపణలు గతం నుంచి బలంగా వినిపిస్తున్నాయి. అయితే మావోయిస్టుల కట్టడి పేరిట కొందరు పోలీసు అధికారులు గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తున్నామని పేర్కొంటూ ఉన్నతాధికారులను తప్పుదారి పట్టిస్తున్నారు. కొందరు గంజాయి స్మగ్లర్లకు చెందిన వాహనాల్లో పోలీసులు ఇప్పటికీ దర్జాగా తిరుగుతున్నారు. వాస్తవానికి కేసుల్లో ఉన్న వాహనాలను వినియోగించకూడదనే చట్ట నిబంధనను అతిక్రమించి, ఒక కేసులో రెండు వాహనాలు పట్టుబడితే, ఒకటి మాత్రమే కేసులో చూపించి, మరొక వాహనాన్ని తప్పించి, దానిని సీఐలు, ఎస్‌ఐలు వినియోగించుకుంటున్నారు. వాస్తవానికి అలా చేయడం చట్టరీత్యా నేరం. గతంలో ఇలాగే ఒక కేసుకు సంబంధించిన వాహనాన్ని వినియోగించిన నేరానికి అనకాపల్లికి చెందిన ఒక డీఎస్‌పీ సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినప్పటికీ నేటికీ జిల్లాలోని అనేక మంది సీఐలు, ఎస్‌ఐలు గంజాయి కేసుల్లోని వాహనాలను తమ సొంత వాహనాల్లా వినియోగిస్తున్నారు. ఆఖరుకు పాడేరులో జిల్లా ఎస్‌పీ నిర్వహించే క్రైమ్‌ మీటింగ్‌కు సైతం అదే వాహనాల్లో జిల్లా పోలీసు కార్యాలయానికి వారంతా వస్తుండడం గమనార్హం. ఇటువంటి వ్యవహారాలను కట్టడి చేయాల్సిన ఉన్నతాధికారులే మిన్నకుండడంతో ఇటువంటివి కొనసాగుతున్నాయని స్పష్టమవుతోంది.

Updated Date - Aug 20 , 2025 | 11:38 PM