రన్నింగ్‌లో కన్వేయర్ బెల్ట్‌ను కట్ చేయగలరా?
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:32 AM
స్టీల్ ప్లాంటులో ముడి పదార్థాలు సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్‌లు తరచూ తెగిపోతుండడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఉక్కు యాజమాన్యం వాదనలో వాస్తవం ఎంత?
పోలీస్ కమిషనర్ పరిశీలన
పూర్తి విచారణ చేయాల్సి ఉందని ప్రకటన
విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటులో ముడి పదార్థాలు సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్‌లు తరచూ తెగిపోతుండడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. సరైన నిర్వహణ లేక బెల్ట్‌లు తెగిపోతున్నాయనేది కార్మికుల వాదన. అయితే బెల్ట్‌లను కావాలనే ఉద్యోగులు కట్ చేస్తున్నారని యాజమాన్యం ఆరోపిస్తోంది. ఈ నవంబరు నెలలోనే మూడు సార్లు కన్వేయర్ తెగిపోవడంతో నేరుగా పోలీస్ కమిషనర్‌కే ఫిర్యాదు చేసింది. దాంతో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం స్టీల్ ప్లాంటుకు వెళ్లి కన్వేయర్ బెల్ట్‌ను పరిశీలించారు.
గంటకు 18 నుంచి 28 కి.మీ. వేగంతో నడుస్తూ 500 టన్నుల ముడిపదార్థాలను చేరవేసే కన్వేయర్ బెల్ట్‌లు స్టీల్ ప్లాంటులో ఉన్నాయి. టన్నుల కొద్దీ బరువును మోయాల్సి ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఆ బెల్ట్‌లను తయారు చేశారు. లారీ టైర్లలో ఎలాగైతే మెటల్ వైర్లు ఉంటాయో ఈ కన్వేయర్ బెల్ట్‌ల్లో కూడా అలాంటి ఏర్పాట్లే ఉంటాయి. అటువంటి వాటిని ఆగి ఉన్నప్పుడే కట్ చేయడం కష్టం. అలాంటిది రన్నింగ్‌లో ఉండగా కట్ చేయడం అంటే ప్రాణాలతో చెలగాటమే. ప్రాణాలపై ఆశ వదులుకున్న వారే ఆ పని చేయగలుగుతారు. ఉదాహరణకు చిన్న పిండి మిల్లులోనే రన్నింగ్‌లో ఉన్న బెల్ట్ ప్రమాదవశాత్తూ తెగిపోతే అక్కడ ఉన్న సిబ్బందిపై అవన్నీ పడి ప్రమాదం జరుగుతుంది. అలాంటిది పెద్ద స్టీల్ ప్లాంటులో కన్వేయర్ తెగితే..ఆ పరిసరాల్లో ఉన్నవారికి తప్పనిసరిగా గాయాలు అవుతాయి. ఆ విషయం అందరికీ తెలుసు. అలాంటి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కావాలని ఎవరైనా ఎందుకు కట్ చేస్తారు?. ఆగి ఉన్న కన్వేయర్ బెల్ట్‌ను కట్ చేయగలరా? అన్ని పోలీస్ కమిషనర్ అక్కడి అధికారులను ప్రశ్నించారు. పదునైన ఆయుధంతో చేయవచ్చునని కొందరు పేర్కొన్నారు. దీనిపై పూర్తి విచారణ చేయాల్సి ఉందని, సాంకేతికంగా ముందుకు వెళతామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.