గిరిజన సంక్షేమ శాఖలో బదిలీల సందడి
ABN , Publish Date - May 20 , 2025 | 11:23 PM
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు (నాన్-టీచింగ్), సిబ్బంది బదిలీలకు షెడ్యూల్ విడుదల చేసినట్టు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తుకు గడువు 24వ తేదీ
25న తాత్కాలిక మెరిట్ జాబితా
26న అభ్యంతరాల స్వీకరణ
28న తుది జాబితా విడుదల
29న బదిలీల కౌన్సెలింగ్
పాడేరురూరల్, మే 20 (ఆంధ్రజ్యోతి):గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు (నాన్-టీచింగ్), సిబ్బంది బదిలీలకు షెడ్యూల్ విడుదల చేసినట్టు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల బదిలీలకు జూన్ 2వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతంలో ఈనెల 31వ తేదీ నాటికి రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసిన నాన్-టీచింగ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులన్నారు. ఈనెల 31వ తేదీ నాటికి ఒకే ప్రాంతంలో ఐదేళ్లు సర్వీస్‌ను పూర్తి చేసినవారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులు ఈనెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు డీడీ కార్యాలయంలో బదిలీల దరఖాస్తులు అందించాలన్నారు. తాత్కాలిక మెరిట్ జాబితాను ఈనెల 25న ప్రచురిస్తామని, ఈనెల 26న అభ్యంతరాలకు గడువు ఉంటుందన్నారు. తుది మెరిట్ జాబితాను ఈనెల 28వ తేదీన ప్రకటిస్తామని, ఈనెల 29వ తేదీన ఐటీడీఏ సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని డిప్యూటీ డైరెక్టర్ రజని తెలిపారు.