రేషన్ డిపోల్లో సందడి
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:02 AM
రేషన్ డిపోలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం ఎండీయూ విధానాన్ని రద్దు చేసి, చౌక ధరల దుకాణాల్లో రేషన్ పంపిణీకి ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం రేషన్ డిపోలను అట్టహాసంగా ప్రారంభించారు.
పూర్వ విధానంలో సరకులు పంపిణీ
కూటమి ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా ప్రారంభం
తొలిరోజు ఆన్‌లైన్‌లో 30,541 మందికి బియ్యం పంపిణీ
మొరాయించిన సర్వర్‌తో పంపిణీలో జాప్యం
విశాఖపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):
రేషన్ డిపోలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం ఎండీయూ విధానాన్ని రద్దు చేసి, చౌక ధరల దుకాణాల్లో రేషన్ పంపిణీకి ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం రేషన్ డిపోలను అట్టహాసంగా ప్రారంభించారు. ఆదివారం నుంచి రేషన్ డిపోల్లో బియ్యం కార్డుదారులకు పంచదార, బియ్యం పంపిణీని ప్రారంభించారు. జిల్లాలో 642 రేషన్ డిపోల్లో ఉదయం 8 గంటల నుంచి కార్డుదారులకు సరకులను అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిపోలను అలంకరించిన డీలర్లు ప్రతిచోటా డిపో వివరాలతో బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అఽఽధికారులు పలుచోట్ల డిపోలకు వెళ్లి బియ్యం కార్డుదారులకు రేషన్ సరకులను పంపిణీ చేశారు. సాగర్‌నగర్‌లో కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్, ఎంవీపీకాలనీలోని అప్పుఘర్‌లో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ డిపోల వద్ద కార్డుదారులకు బియ్యం అందజేశారు. కప్పరాడ, సీతమ్మధార ప్రాంతంలో ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, రైల్వే న్యూకాలనీలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, 95వ వార్డులో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, గోపాలపట్నం, నరవ, తదితర ప్రాంతాల్లో పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు, 67వ వార్డులో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్డుదారులకు సరకులను అందజేశారు. జిల్లాలో రేషన్ పంపిణీని డీఎస్‌వో వి.భాస్కర్, జిల్లా పరిశీలకుడు భగన్నారాయణలు పర్యవేక్షించారు. ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలో 5.24 లక్షలమంది బియ్యం కార్డుదారుల్లో 30,541 మందికి (5.8శాతం) బియ్యం, 26,483 (5.04 శాతం) మందికి పంచదార పంపిణీ చేశారు. కాగా కొన్నిచోట్ల మాత్రమే కందిపప్పును పంపిణీ చేయడం జరిగింది.
సర్వర్ మొరాయింపు
ఆదివారం ఉదయం నుంచి జిల్లాలోని 642 డిపోల్లో ఒకేసారి సరకుల పంపిణీ ప్రారంభమైంది. ఇంకా రాష్ట్రంలో వేల డిపోల్లో సరకుల పంపిణీకి డీలర్లు ప్రయత్నించడంతో సర్వర్ మొరాయించింది. నెట్‌వర్క్ ఎర్రర్ అని, మరోసారి ప్రయత్నించండి అంటూ ఈపోస్ మిషన్‌పై చూపించడంతో కార్డుదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో గంటకు పదికి మించి కార్డుదారులకు సరకులు ఇవ్వడానికి డీలర్లు ప్రయత్నించాల్సి వచ్చింది. దీనికితోడు ఆదివారం ఎండ తీవ్రత కొనసాగడంతో డిపోల వద్ద కార్డుదారులు అసౌకర్యానికి గురయ్యారు. సర్వర్ మొరాయింపు సమస్యను పౌరసరఫరాల అధికారుల దృష్టికి పలువురు డీలర్లు తీసుకువెళ్లారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సర్వర్ సమస్యను పరిష్కరించడానికి వీలుకావడం లేదని అధికారులు వివరించారు. ఒకేసారి వేలమంది డీలర్లు లాగిన్ కావడంతో సమస్య ఉత్పన్నమైందని, రెండు మూడు రోజులల్లో అంతా సర్దుకుంటుందని అధికారులు చెబుతున్నారు.