Share News

రేషన్‌ డిపోల్లో సందడి

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:43 AM

రేషన్‌ డిపోలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం ఎండీయూ విధానాన్ని రద్దు చేసి, చౌక ధరల దుకాణాల్లో రేషన్‌ పంపిణీకి ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం రేషన్‌ డిపోలను అట్టహాసంగా ప్రారంభించారు. ఆదివారం నుంచి శ్రీకారం చుట్టింది. ఉదయం ఎనిమిది గంటలకే పలువురు కార్డుదారులు రేషన్‌ డిపోలకు వచ్చారు.

రేషన్‌ డిపోల్లో సందడి
అనకాపల్లి పట్టణం కోట్ని వీధిలోని రేషన్‌ డిపోను పూలమాలలు, బెలూన్లతో అలంకరించిన డీలర్‌

పూర్వ విధానంలో సరకులు పంపిణీ

కూటమి ప్రజాప్రతినిధులు, అధికారుల చేతల మీదుగా ప్రారంభం

మామిడి తోరణాలు, పూలమాలలతో డిపోలను అలంకరించిన డీలర్లు

తొలి రోజు సాఫీగా రేషన్‌ పంపిణీ

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

రేషన్‌ డిపోలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం ఎండీయూ విధానాన్ని రద్దు చేసి, చౌక ధరల దుకాణాల్లో రేషన్‌ పంపిణీకి ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం రేషన్‌ డిపోలను అట్టహాసంగా ప్రారంభించారు. ఆదివారం నుంచి శ్రీకారం చుట్టింది. ఉదయం ఎనిమిది గంటలకే పలువురు కార్డుదారులు రేషన్‌ డిపోలకు వచ్చారు. డీలర్ల రేషన్‌ డిపోలకు అరటి, మామిడి ఆకులు, పూలమాలలు, బెలూన్లు కట్టి అందంగా అలంకరించారు. కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జిలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై చౌక ధరల దుకాణాల్లో రేషన్‌ పంపిణీని ప్రారంభించారు. కార్డుదారులు ఈపోస్‌ యంత్రంలో వేలి ముద్రలు నమోదు చేసి, బియ్యం, పంచదార విడిపించుకుని తీసుకెళ్లారు. ఎండీయూ వ్యవస్థ వున్నప్పుడు వాహనం వచ్చిన రోజునే రేషన్‌ తీసుకోవాలని, లేదంటే ఆ నెలకు లేనట్టేనని, అది కూడా చాలా సేపు క్యూలో నిల్చోవాల్సి వచ్చేదని పలువురు కార్డుదారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక నుంచి పూర్వ విధానంలోనే రేషన్‌ డిపోల్లో సరకులు పంపిణీ చేయడం వల్ల తమకు వీలున్నప్పుడు చౌక ధరల దుకాణానికి వెళ్లి రేషన్‌ తెచ్చుకుంటామని సంతోషంగా చెబుతున్నారు.

రేషన్‌ దుకాణాలను రానున్న రోజుల్లో మినీ షాపింగ్‌ మాల్స్‌గా మార్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ఆయన ఆదివారం ఉదయం 84వ వార్డు కోటివీధిలోని రేషన్‌ డిపోలో సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్పత్తిదారుల నుంచి హోల్‌సేల్‌ ధరలకు సరకులు, వస్తువులు కొనుగోలు చేసి, రేషన్‌ డిపోల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు అందించనున్నట్టు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్‌ ఆయీషా, జిల్లా సరఫరా అధికారి కెఎల్‌ఎన్‌ మూర్తి, లీగల్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఎస్‌ఎం రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు చోడవరం మండలం రేవళ్లు, రావికమతం మండలం మేడివాడ, బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట రేషన్‌ డిపోల్లో సరకుల పంపిణీని ప్రారంభించారు. కార్డుదారులు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు తమకు వెసులుబాటు వున్న రోజున చౌక ధరల దుకాణానికి వెళ్లి రేషన్‌ విడిపించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే సరకులు తీసుకువచ్చి అందిజేస్తామని చెప్పారు.

ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ ఎలమంచిలి పట్టణంలోని సీపీ పేట అచ్యుతాపురం మండలం వెదురువాడ, దొప్పెర్ల, రాంబిల్లి మండలం వెంకటాపురం, మునగపాక మండలం వెంకటాపురంలో రేషన్‌ పంపిణీని ప్రారంభించారు.

బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలోటీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, మాకవరపాలెం శెట్టిపాలెంలో నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి.రమణ, అచ్యుతాపురం మండలం దుప్పితూరు, మునగపాక మండలం అరబుపాలెం, రాంబిల్లి మండలం రాజుకోడూరులో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు రేషన్‌ పంపిణీని ప్రారంభించారు.

Updated Date - Jun 02 , 2025 | 12:43 AM