Share News

దేవుడి పేరిట వ్యాపారం!

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:51 AM

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు...విశాఖపట్నంలో దేవుడి బొమ్మలు పెట్టి వ్యాపారం చేసేవారు ఎక్కువయ్యారు.

దేవుడి పేరిట వ్యాపారం!

  • తాత్కాలికంగా ఏర్పాటుచేసే విగ్రహాల దర్శనానికి, పూజలకు టికెట్లు

  • ఎడాపెడా హుండీల ఏర్పాటు

  • ప్రాంగణాల్లో దుకాణాల ఏర్పాటుకు అడ్వాన్స్‌లు, అద్దెలు

  • బీచ్‌రోడ్డు సమీపాన ‘లులూ మాల్‌కు కేటాయించిన ఏపీఐఐసీ

  • స్థలంలో వినాయక మహోత్సవం నిర్వహణకు పెదగంట్యాడ యువకుడు దరఖాస్తు

  • ఇద్దరు నేతల సిఫారసు

  • ఇంకా అనుమతులు ఇవ్వక ముందే నేడు కర్రపూజ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు...విశాఖపట్నంలో దేవుడి బొమ్మలు పెట్టి వ్యాపారం చేసేవారు ఎక్కువయ్యారు. ఇటీవల బీచ్‌రోడ్డులో పార్క్‌ హోటల్‌ సమీపాన అయోధ్య రామాలయం సెట్‌ వేసి, బాలరాముడి విగ్రహం చూడడానికి రూ.50 టిక్కెట్‌ పెట్టి కొందరు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. సీతారాముల కల్యాణోత్సవం పేరుతో మరో దోపిడీకి తెర తీయగా అది బెడిసి కొట్టింది. ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు రావడంతో నిర్వాహకులు దానిని మూసేశారు. ఇప్పుడు వినాయ చవితి సీజన్‌ వచ్చింది. ఆగస్టు 27న వినాయ చవితి. ఎప్పటిలాగే గాజువాకలో భారీ వినాయక విగ్రహాలు పెట్టి వ్యాపారం చేసుకోవడానికి శ్రీకారం చుట్టేశారు.

అక్కడ లంకా గ్రౌండ్‌లో లక్ష చీరలతో వినాయకుడి విగ్రహం ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. అలాగే గాజువాక ఆర్టీసీ బస్‌ డిపో వద్ద మరో భారీ విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఇక అక్కడ ఇంకో భారీ విగ్రహం పెడితే జనాలు పెద్దగా రారని భావించిన పెదగంట్యాడకు చెందిన ఓ యువకుడు విశాఖ నగరంలో దుకాణం తెరుస్తున్నాడు. బీచ్‌ రోడ్డు సమీపాన గల ఏపీఐఐసీకి చెందిన 13.43 ఎకరాల స్థలంలో ‘వరసిద్ధి వినాయక మహోత్సవం’ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి బుధవారం కర్రపూజ చేస్తామని, అంతా తరలి రావాలని సోషల్‌ మీడియాలో ఆహ్వాన పత్రికను తెగ వైరల్‌ చేస్తున్నారు.

అనుమతులు ఇంకా ఇవ్వలేదు

బీచ్‌రోడ్డులో హార్బర్‌ పార్క్‌ ఏరియాలోని ఏపీఐఐసీకి చెందిన ఆ 13.43 ఎకరాల స్థలాన్ని ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం లులూ మాల్‌కు కేటాయించింది. భారీ షాపింగ్‌మాల్‌ నిర్మాణానికి 99 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. అయితే ‘యూత్‌ ఐకాన్‌’ పేరుతో ఆహ్వాన పత్రిక ముద్రించిన సదరు యువకుడు వినాయ చవితి ఉత్సవాలకు ఆ భూమిని కేటాయించాలని ఏపీఐఐసీ అధికారులకు దరఖాస్తు చేశాడు. నగరంలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో సిఫారసు కూడా చేయించాడు. ఇద్దరు సిఫారసు చేయడంతో ఏపీఐఐసీ అధికారులు అనుమతి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. వినాయక చవితి ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి దరఖాస్తును పరిశీలనలో పెట్టారు. వచ్చిన వ్యక్తికి పరిస్థితిని కూడా వివరించారు. ఆ భూమిని లులూ మాల్‌కు ఇచ్చేశారని, ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు ఎవరైనా వస్తే తక్షణమే ఖాళీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అవన్నీ తాను చూసుకుంటానని దరఖాస్తుదారుడు బదులిచ్చాడు. అధికారులు ఇంకా అనుమతులు ఇవ్వకముందే అందులో కర్రపూజను బుధవారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

పెదగంట్యాడ నుంచి వచ్చి చేయాల్సిన అవసరం ఏమిటి?

వినాయక చవితి ఉత్సవాలు వీధివీధినా చేస్తారు. అతను పెదగంట్యాడ నుంచి విశాఖపట్నం వచ్చి 13.43 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించాల్సిన అవసరం ఏమిటి?, దీనికి అవసరమైన నిధులు ఎక్కడ నుంచి తెస్తారు?...అనేది ఆలోచిస్తే...ఉత్సవం వెనుక మతలబు అర్థమవుతుంది. దేశమంతా వినాయక చవితిని నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు నిర్వహిస్తే గాజువాక ముఠాలు మాత్రం నెల రోజులు చేస్తున్నాయి. కొన్నేళ్లుగా అదే జరుగుతోంది. వినాయక చవితి అని పెద్ద మైదానంలో భారీ విగ్రహం పెట్టి, దానిని చూడడానికి, పూజలకు వేర్వేరుగా టికెట్లు, దక్షిణకు హుండీలు పెట్టి దండుకోవడం అలవాటుగా మారింది. అక్కడితో ఆగకుండా ఆ ప్రాంగణంలో జాతరలా పలు రకాల వ్యాపారాలు నిర్వహించుకోవడానికి దుకాణాలు, జెయింట్‌ వీల్‌ వంటివి పెట్టి, వారి నుంచి లక్షల రూపాయల్లో అడ్వాన్సులు, అద్దెలు వసూలు చేస్తున్నారు.

అధికారులు ఆలోచించాలి?

వ్యాపార ధోరణితో ఉత్సవాలు చేసే వారికి అనుమతులు ఇచ్చే ముందు అధికారులు బాగా ఆలోచించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా సరే వినాయక ఉత్సవాలు తొమ్మిది రోజులతో ముగించాలని స్పష్టంచేయాలి. ఆయా ప్రాంగణాల్లో వ్యాపారాలు నిర్వహించకూడదనే నిబంధన పెట్టాలి. ఏదైనా ప్రమాదం జరిగితే నివారించడానికి తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలి. ముఖ్యంగా టిక్కెట్లు పెట్టి డబ్బులు వసూలు చేయకూడదని ఆంక్షలు పెట్టాలి.

నాయకులూ తస్మాత్‌ జాగ్రత్త

‘కుర్రాళ్లు ఏదో చేసుకుంటామని ఉత్సాహ పడుతున్నారు’ అని ప్రజాప్రతినిధులు వెనుకాముందు చూడకుండా సిఫారసు చేస్తున్నారు. అదే కొంప ముంచుతోంది. వారి పేర్లు చెప్పి నిర్వాహకులు నగరంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి భారీగా చందాలు దండేస్తున్నారు. ఎగ్జిబిషన్‌ పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. హిందూ పండగలను ఈవెంట్లుగా మార్చుకొని లాభపడాలని చూస్తున్నారు. ఇటువంటి వారికి దూరంగా ఉండడం, సిఫారసులు చేయకపోవడం నాయకులకు అన్నివిధాలా శ్రేయస్కరం. వద్దంటే...ఒక్కరితో పోతుంది. ఏదైనా జరిగితే నియోజకవర్గంలో పరువు పోతుంది.

Updated Date - Jul 30 , 2025 | 12:51 AM