దుకాణం పేరిట దందా
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:37 AM
ఫుడ్‌కోర్టు పేరుతో మరోసారి వసూళ్ల దందా మొదలైంది. వీఎంఆర్‌డీఏ సెంట్రల్‌పార్కు వద్ద అనధికారికంగా ఏళ్ల తరబడి కొనసాగిన ఫుడ్‌కోర్టును జీవీఎంసీ అధికారులు కొద్దికాలం కిందట తొలగించారు. అక్కడ స్మార్ట్ వెండింగ్ జోన్ పేరుతో తిరిగి దుకాణాలను ఏర్పాటుచేయాలని జీవీఎంసీ నిర్ణయించింది
సెంట్రల్‌పార్కు వద్ద స్మార్ట్ వెండింగ్ జోన్
ఏర్పాటుకు జీవీఎంసీ సన్నాహాలు
గతంలో ఫుడ్‌కోర్టు ఉన్నచోటే...
120 దుకాణాల ఏర్పాటుకు కౌన్సిల్ అజెండాలో ప్రతిపాదన
ఇదే అదనుగా రంగంలోకి దళారులు
అందులో దుకాణం ఇప్పిస్తామంటూ వసూళ్లు
ఒక్కొక్క దానికి రూ.లక్ష...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఫుడ్‌కోర్టు పేరుతో మరోసారి వసూళ్ల దందా మొదలైంది. వీఎంఆర్‌డీఏ సెంట్రల్‌పార్కు వద్ద అనధికారికంగా ఏళ్ల తరబడి కొనసాగిన ఫుడ్‌కోర్టును జీవీఎంసీ అధికారులు కొద్దికాలం కిందట తొలగించారు. అక్కడ స్మార్ట్ వెండింగ్ జోన్ పేరుతో తిరిగి దుకాణాలను ఏర్పాటుచేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. శుక్రవారం జరిగే కౌన్సిల్ సమావేశం అజెండాలో దీనిని చేర్చడంతో దళారులు రంగంలోకి దిగిపోయారు. వెండింగ్‌జోన్‌లో దుకాణం ఇప్పిస్తామంటూ ఒక రాజకీయ నేత పేరు చెప్పి దుకాణానికి రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు. ఫుడ్‌కోర్టులో దుకాణం పోయినవారితోపాటు కొత్తవారు కూడా దుకాణం కోసం పోటీపడుతున్నారు.
నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలను జీవీఎంసీ అధికారులు ఇటీవల తొలగించారు. అందులో భాగంగా వీఎంఆర్‌డీఏ సెంట్రల్ పార్కు వద్ద జీవీఎంసీ అనుమతి లేకుండా కొనసాగుతున్న ఫుడ్‌కోర్టును కూడా తొలగించారు. దుకాణాలను తొలగించడం వల్ల రోడ్డునపడిన వారికి తిరిగి జీవనోపాధి కల్పించేందుకు నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ స్మార్ట్ వెండింగ్ జోన్‌లతోపాటు స్ర్టీట్ వెండింగ్ జోన్‌లను ఏర్పాటుచేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రకటించారు. దీనికోసం అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించేందుకు యూసీడీ అధికారులతో సర్వే చేయించారు. జీవీఎంసీలోని ఎనిమిది జోన్ల పరిధిలో సుమారు తొమ్మిది వేల మంది వరకు రోడ్డుపక్కన దుకాణాలే ప్రధాన జీవనాధారంగా జీవిస్తున్నారని సర్వేలో అధికారులు గుర్తించారు. వారందరికీ 98 వార్డుల పరిధిలో స్మార్ట్ వెండింగ్ జోన్‌లు, స్ర్టీట్ వెండింగ్‌జోన్‌లు ఏర్పాటుకి అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలో ఐదు వార్డుల్లో స్మార్ట్ వెండింగ్ జోన్‌లను తక్షణం ఏర్పాటుచేసేందుకు అవసరమైన స్థలం ఉందని, మరో 128 చోట్ల స్ర్టీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటుకు అవకాశం ఉందని టౌన్‌ప్లానింగ్ అధికారులు నివేదించారు. యూసీడీ, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తొలిదశలో జోన్-2 పరిధిలో ఎండాడ, జోన్-4 పరిధిలో వీఎంఆర్‌డీఏ సెంట్రల్ పార్కు, జోన్-6 పరిధిలో గాజువాక వద్ద స్మార్ట్ వెండింగ్ జోన్‌లను ప్రారంభించేందుకు కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారుల వాటా కింద కొంత మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణం రూపంలో తీసుకుని జీవీఎంసీ కొంతమొత్తం కలిపి కంటెయినర్ దుకాణాలను ఏర్పాటుచేసి వాటికి ఫ్యాన్, సోలార్ లైటింగ్, వై-ఫై, తాగునీరు, వాష్‌బేసిన్ వంటి సదుపాయాలను కల్పించి నిత్యం పరిశుభ్రంగా ఉండేలా డిజైన్ రూపొందించారు.
సెంట్రల్ పార్కు వద్ద దుకాణానికి రూ.లక్ష
సెంట్రల్ పార్కు తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో 120 దుకాణాల ఏర్పాటుకు వీలుగా ఆర్కిటెక్చర్ డిజైన్ తయారుచేశారు. స్ర్టీట్ వెండార్లుగా పేర్లు నమోదుచేసుకున్న వారిలో అర్హులకు అక్కడ దుకాణాలు కేటాయించాలి. ఒకవేళ దుకాణాల కంటే ఆశావహులు ఎక్కువగా ఉన్నట్టయితే లాటరీ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలి. కానీ కూటమి నేత పేరు చెబుతూ...ముగ్గురు దళారులు రంగంలోకి దిగారు. సెంట్రల్‌పార్కు వద్ద ఏర్పాటుచేసే వెండింగ్ జోన్‌లో దుకాణం ఇప్పిస్తామంటూ వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఒక్కో దుకాణం కోసం రూ.లక్ష చొప్పున వసూలుచేస్తున్నారు. రూ.లక్ష కంటే ఎక్కువమొత్తం ఇస్తామంటూ కొందరు పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఫుడ్‌కోర్టు ద్వారా జీవీఎంసీకి ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా, వైసీపీ నేతలు, కూటమి నేతలు దుకాణాల నుంచి రోజువారీ వసూళ్లు చేసుకున్నారు. ఫుడ్‌కోర్టును తొలగించేందుకు అధికారులు ప్రయత్నించినా, కౌన్సిల్‌లో పలుమార్లు తీర్మానం చేసినా వారే అడ్డుకున్నారు. చివరకు కమిషనర్ కేతన్‌గార్గ్ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా తొలగించారు. ఇలాంటి తరుణంలో దళారులు మళ్లీ రంగప్రవేశం చేయకుండా కమిషనర్ అడ్డుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.