Share News

మండిన సండే

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:58 AM

నైరుతి రుతుపవనాలు ప్రవేశంచిన మూడు రోజుల తరువాత నగరంలో ఆదివారం ఎండ తీవ్రత కొనసాగింది.

మండిన సండే

  • మధ్యాహ్నం వేడిగాడ్పులు

  • బీచ్‌కు పొటెత్తిన సందర్శకులు

  • ఎయిర్‌పోర్టులో 38 డిగ్రీలు

విశాఖపట్నం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి):

నైరుతి రుతుపవనాలు ప్రవేశంచిన మూడు రోజుల తరువాత నగరంలో ఆదివారం ఎండ తీవ్రత కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతోపాటు వేడి వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం నగరంపైకి పడమర దిశ నుంచి పొడి గాలులు వీయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మఽధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నగరంపైకి వడగాడ్పులు కొనసాగడంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారంతా ఠారెత్తిపోయారు. ఈ వేసవి సీజన్‌లో తొలిసారిగా నగరంలో గాడ్పులు వీశాయి. రాత్రి వరకు వేడి వాతావరణం కొనసాగింది. విశాఖ ఎయిర్‌పోర్టులో 38 డిగ్రీలు (సాధారణం కంటే 2.8 డిగ్రీలు ఎక్కువ) నమోదైంది. కాగా ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చిన సందర్శకులతో ఆర్కే బీచ్‌ కిటకిటలాడింది. చాలా రోజుల తరువాత బీచ్‌కు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు.


రాష్ట్రంలో తొలి యాంటీ డ్రగ్‌ పార్కు

సిటీ సెంట్రల్‌ పార్కులో రూ.3.5 కోట్లతో ఏర్పాటు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

యువతలో అత్యధికులు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకుఅలవాటు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం గంజాయి సాగు, రవాణా కట్టడికి సరైన చర్యలు చేపట్టకపోవడంతో అది మహామ్మారిలా వ్యాపించింది. విశాఖపట్నం కేంద్ర కారాగారంలో మగ్గుతున్న రిమాండ్‌ ఖైదీలలో 70 శాతం మంది గంజాయితో పట్టుబడినవారే ఉంటున్నారు. పోలీస్‌ స్టేషన్లలోని వాహనాల్లో సగం గంజాయితో పట్టుబడినవే ఉంటున్నాయి. ఆ మత్తుకు బానిసలైన యువత జీవితాన్ని కోల్పోతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపి, నిర్మూలనకు ప్రత్యేకంగా ‘ఈగిల్‌’ టీమ్‌ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మత్తుకు బానిసలైన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి, తిరిగి కొత్త జీవితం ప్రారంభించేలా చేయడానికి విశాఖపట్నంలో ‘యాంటీ డ్రగ్‌ పార్క్‌’ ఏర్పాటుకు వీఎంఆర్డీఏ ముందుకువచ్చింది. దీనికి చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ చొరవ తీసుకున్నారు. నాడు ‘యువగళం’ పేరుతో నారా లోకేశ్‌తో కలిసి పాదయాత్ర చేసినప్పుడు మాదక ద్రవ్యాల బారినపడి పిల్లలు పాడైపోతున్నారని అనేక మంది తల్లిదండ్రులు చెప్పినప్పుడు వారి మదిలో ఈ ‘యాంటీ డ్రగ్‌ పార్కు’ రూపుదిద్దుకుంది. వీఎంఆర్డీఏ చైర్మన్‌గా ప్రణవ్‌గోపాల్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత కమిషనర్‌ విశ్వనాథన్‌తో చర్చించి దీనికి రూపకల్పన చేశారు.

రెండు ఎకరాల్లో.. రూ.3.5 కోట్లతో..

ద్వారకా ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఉన్న సిటీ సెంట్రల్‌ పార్కులో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.3.5 కోట్ల వ్యయంతో యాంటీ డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేయనున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పదితే ఏమి జరుగుతుంది? అవి లేకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ అర్థమయ్యేలా చెబుతారు. అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తారు. దీనిని చికిత్సా కేంద్రంలా కాకుండా రోజూ ఆహ్లాదం కోసం పార్కుకు వచ్చినట్టు వచ్చి కొత్త జీవితం ప్రారంభించేలా చూస్తారు.

పార్క్‌ ఆఫ్‌ లైఫ్‌గా చెబుతాం

ప్రణవ్‌గోపాల్‌, వీఎంఆర్డీఏ చైర్మన్‌

ఇది పేరుకు యాంటీ డ్రగ్‌ పార్కు అయినా దీనిని మేము ‘పార్క్‌ ఆఫ్‌ లైఫ్‌’గా చెబుతాం. మత్తుకు బానిసలైన వారిని అందులోనుంచి బయటకు తీసుకురావడమే కాకుండా, కొత్తగా ఎవరూ మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. యువగళం పాదయాత్ర సందర్భంగా వచ్చిన ఆలోచన ఇది. యువతను సన్మార్గంలో నడిపించాలన్నదే మా ప్రయత్నం.


రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

ఫొటో షూట్‌ కోసం బయలుదేరి కానరాని లోకాలకు..

బైకుకు అడ్డంగా కుక్క రావడమే కారణం

పెందుర్తి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): సూర్యాస్తమయం సమయంలో సరదాగా ఫొటోలు తీసుకునేందుకు బైకుపై బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో వారి జీవితాలు అస్తమించిపోయాయి. ఇంటి నుంచి బయలుదేరిన అరగంట వ్యవధిలోనే ఈ ఇద్దరు యువకులు మృత్యుఒడికి చేరినట్టు అందిన సమాచారంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటన ఆదివారం సాయంత్రం పెందుర్తిలో చోటుచేసుకుంది. సీఐ సతీశ్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పెందుర్తి ఆదిత్యనగర్‌లో ఉంటున్న శరగడం శ్రీనివాసరావు పద్మనాభం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు శరగడం డానీ సత్య అవినాశ్‌ (19) విజయనగరం ఎంవీజీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అవినాశ్‌, పెందుర్తిలో ఉంటున్న మద్దాల శ్రీరామ్‌ (17) స్నేహితులు. శ్రీరామ్‌ ఇటీవల ఇంటర్‌ పూర్తి చేసి ఇంజనీరింగ్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరూ కలిసి ఆదివారం సాయంత్రం ఫొటో షూట్‌ కోసం వేరే స్నేహితుడి నుంచి బైకు తీసుకుని బయలుదేరారు. ఎన్‌హెచ్‌-16 రోడ్డు సరిపల్లి ఆర్వోబీ మీదుగా అవినాశ్‌ బైకును నడుపుతుండగా ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో వాహనాన్ని అదుపు చేయలేక సమీపంలో గల డివైడర్‌ను బలంగా ఢీకొన్నాడు. దీంతో వాహనం నుజ్జవ్వడంతో పాటు వారిద్దరూ రోడ్డుపై ఎగిరిపడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేదని స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ సతీశ్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ నరసింగరాజు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:58 AM