Share News

బర్లీ పొగాకు రైతు విలవిల

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:12 PM

విత్తన మార్పిడితో బర్లీ పొగాకు రైతులు, వాతావరణం అనుకూలించక పత్తి రైతులు నష్టాలను చవిచూసే పరిస్థితులు నెలకొన్నాయి. పెట్టుబడి డబ్బులైనా వస్తాయో రావోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

బర్లీ పొగాకు రైతు విలవిల
కంఠారంలో బర్లీ పొగాకు తోట(ఫైల్‌)

పత్తి రైతులు కూడా..

విత్తన మార్పిడితో పొగాకు, అధిక వర్షాలకు పత్తికి తీవ్ర నష్టం

పెట్టుబడి ఖర్చులు కూడా రావేమోనని రైతన్న దిగులు

పంట సిద్ధమైన కొనుగోలు ధర ప్రకటించని కంపెనీలు

కొయ్యూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): విత్తన మార్పిడితో బర్లీ పొగాకు రైతులు, వాతావరణం అనుకూలించక పత్తి రైతులు నష్టాలను చవిచూసే పరిస్థితులు నెలకొన్నాయి. పెట్టుబడి డబ్బులైనా వస్తాయో రావోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మండలంలోని చింతలపూడి, మాకవరం, కొమ్మిక, కంఠారం, బాలారం, ఆడాకుల, బకులూరుతో పాటు మరో నాలుగు పంచాయతీల్లో బర్లీ పొగాకు, పత్తి పంటలు వేశారు. సుమారు రెండు వేల ఎకరాల పైబడి బర్లీ పొగాకు, మరో రెండు వేల ఎకరాల్లో పత్తి పంటలు సాగు చేశారు. బర్లీ పొగాకు విషయానికి వస్తే గతంలో బ్లాంకెట్‌ ఏ-1 విత్తనానికి బదులుగా ఐటీసీ కంపెనీ ఈ సంవత్సరం సాగుకు బ్లాంకెట్‌ ఏ-2 విత్తనం మార్పిడి చేయడమే కాకుండా మొక్కకు దిగువ వరుస ఆకులు, పై ఆకులు మినహా మధ్యన వచ్చే ఆకులనే కొనుగోలు చేసేలా ఆంక్షలు పెట్టింది. దీనికి తోడు గత సంవత్సరం వరకు ఇచ్చిన బ్లాంకెట్‌ ఏ-1 విత్తనం సాగుతో మొక్కకు 36 నుంచి 38 మేర ఆకులు వచ్చేవి. ప్రస్తుతం సాగు చేసిన బ్లాంకెట్‌-2 విత్తన మొక్కకు కేవలం 24 ఆకులు వచ్చి అనంతరం పువ్వు వచ్చేస్తున్నది. దీంతో దిగుబడి తగ్గిపోవడమే కాకుండా బర్లీ పొగాకు కొనుగోలు చేసే కంపెనీల ఆంక్షల వలన గత సంవత్సరంతో పోలిస్తే సగానికి పైగా ఆదాయం తగ్గిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా బర్లీ పొగాకు ఎకరానికి ప్రతి ఏటా 1000 కిలోల దిగుబడి రాగా, ఈ సంవత్సరం 600 కిలోలు దాటి వచ్చే అవకాశం లేదు. గత సంవత్సరం బర్లీ పొగాకు కిలో రూ.115 ధర పలికింది. ఈ ఏడాది పొగాకు కొనుగోలు చేసే ఐటీసీ, ఐఎల్‌టీడీ, మెట్టపల్లి ఆదినారాయణ, తదితర కంపెనీలు ఇంకా ధర నిర్ణయించలేదు.

పత్తి రైతుకు నష్టం

అధిక వర్షాల కారణంగా పత్తి మొక్కలు ఏపుగా ఎదిగినా పూత, పిందె రాలేదు. దీంతో రైతాంగం వీటి సంరక్షణకు ఎరువులు, పురుగు మందులు, పంట సస్యరక్షణకు అదనంగా పెట్టుబడి పెట్టారు. పత్తి పంటకు గత ఏడాదితో పోలిస్తే అదనంగా మరో రూ.10 వేలు దాటి పెట్టుబడి రూపంలో ఖర్చు చేశారు. ఈ ఏడాది పత్తి ఎకరానికి కనీసం 200 కిలోలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది కిలో రూ.60లు వంతున వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం అధిక వర్షాల కారణంగా సగానికి పైగా దిగుబడి తగ్గినా ధర నిర్ణయించకపోవడంతో కొద్దిపాటి కోత కోసిన పత్తిని రైతులు ఇళ్లలో లాటు వేసి ఉంచారు. గత ఏడాది కిలో రూ.60లకు కొనుగోలు చేసిన వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో ధర పలకడం లేదని పేర్కొంటూ ఇప్పటికీ కొనుగోలు ప్రారంభించలేదు. దీంతో పంట సాగుకు గాను వడ్డీలకు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు అయినా వస్తాయో, రావోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:12 PM