Share News

వీధికుక్కలపై మల్లగుల్లాలు!

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:01 AM

‘ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, విద్యాసంస్థల్లో వీధికుక్కలు కనిపించడానికి వీల్లేదు.

వీధికుక్కలపై మల్లగుల్లాలు!

తరలింపు సాధ్యాసాధ్యాలపై చర్చ

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో చర్యలకు సిద్ధమవుతున్న జీవీఎంసీ అధికారులు

నగరంలో సుమారు రెండు లక్షల వీధికుక్కలు

వాటికి ఫీడింగ్‌ సెంటర్లు ఏర్పాటుకు లక్ష కెన్నెల్స్‌ అవసరం

భారీగా బడ్జెట్‌, సిబ్బందిని నియమించాలి

గణాంకాలతో సిద్ధమవుతున్న జీవీఎంసీ అధికారులు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

‘ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, విద్యాసంస్థల్లో వీధికుక్కలు కనిపించడానికి వీల్లేదు. రెండువారాల్లోగా వాటన్నింటిని రీహాబిలేటషన్‌ సెంటర్లు, ఫీడింగ్‌ సెంటర్లకు తరలించాలి. వీధుల్లో తిరిగే కుక్కలను ఆపరేషన్‌ తర్వాత తిరిగి పట్టుకున్నచోట విడిచిపెట్టకుండా, రీహాబిలిటేషన్‌ సెంటర్‌లోనే ఉంచాలి.’ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు సుప్రీంకోర్టు తాజాగా జారీచేసిన ఆదేశాలివి...

సుప్రీంకోర్టు ఆదేశంతో వీధికుక్కల నియంత్రణపై అధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం రెండు లక్షల వరకు వీధికుక్కలు ఉంటాయని అంచనా. ఇవన్నీ వీధులు, ఆస్పత్రులు, బస్టాండ్‌లు, ఖాళీ స్థలాలు, పార్కుల్లో సంచరిస్తుంటాయి. తరచూ ఎక్కడో ఒకచోట చిన్నారులు, మహిళలు, రోడ్లపై నడుచుకుంటూ వెళ్లేవారిని, ద్విచక్రవాహనాలపై వెళ్లేవారిని కరుస్తుంటాయి.బాధితులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, అర్బన్‌హెల్ట్‌సెంటర్లకు వెళ్లి యాంటీరేబిస్‌ వ్యాక్సిన్లు (ఏఆర్‌వీ) వేయించుకుంటారు. కొన్నిసార్లు కుక్కకాటుని నిర్లక్ష్యం చేయడం, సరియైున విధానంలో వాక్సిన్‌ తీసుకోకపోవడం వంటి కారణాలతో రేబిస్‌ సోకి మృత్యువాతపడుతున్నారు. నగరంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కేజీహెచ్‌, ఘోషాస్పత్రి, ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, ప్రాంతీయ కంటిఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల ఆవరణలోకి వీధికుక్కలు చొరబడి స్వైరవిహారం చేస్తున్నాయి. వివిధ రుగ్మతలతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చేవారితోపాటు వారి సహాయకులను కాటేస్తున్నాయి. ద్వారాకా, మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్‌, బస్‌షెల్టర్లలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. నగరంలో ప్రతి చోటీ వీధికుక్కలు గుంపులుగా సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుక్కల నియంత్రణకు జీవీఎంసీ ఏటా రూ.15 లక్షల వరకు వెచ్చిస్తున్నా వాటి సంఖ్య తగ్గకపోగా, పెరిగిపోతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నియంత్రణే ధ్యేయం

దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో కుక్కకాటు బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈనేపథ్యంలో వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు భావించింది. వీధికుక్కల నియంత్రణ కు అన్నిరాష్ర్టాలతోపాటు స్థానిక పట్టణ సంస్థలకు మార్గదర్శకాలతోపాటు ఆదేశాలు జారీచేసింది. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో కుక్కలు చొరబడకుండా రెండు వారాల్లోగా ఫెన్సింగ్‌ వేయించుకోవాలని, మూడు నెలలకు ఒకసారి కుక్కలు ఆవరణలోకి ప్రవేశిస్తున్నాయా? లేదా? ఎవరినైనా కాటేశాయా? తనిఖీ చేయాలని ఆదేశించింది. కుక్కల నియంత్రణకు కేర్‌టేకర్‌ను నియమించుకోవాలని సూచించింది. వీధులు, బస్టాండ్‌ల్లో వీధికుక్కలు కనిపించకుండా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు చర్యలు తీసుకోవడంతోపాటు వాటిని బయటకు తరలించాలని ఆదేశించింది. వీధికుక్కలకు ఆపరేషన్‌ చేసిన తర్వాత పట్టుకున్నచోట వదలకుండా రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఉంచాలని స్పష్టంచేసింది. మిగిలిన కుక్కలకు ఫీడింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేసి నీరు, ఆహారం అందజేయాలని సూచించింది.

అధికారుల తర్జనభర్జన

సుప్రీంకోర్టు ఆదేశాలు జీవీఎంసీ అధికారుల్లో కలవరం రేపుతున్నాయి. నగర పరిధిలో రెండు లక్షల వరకు ఉన్న వీధికుక్కలను రీహాబిలిటేషన్‌ సెంటర్లు, ఫీడింగ్‌ కేంద్రాలకు తరలించాలంటే పెద్ద దింత్రాంగమే అవసరమంటున్నారు. కుక్కలను పట్టుకోవడానికి సిబ్బందితోపాటు తరలించడానికి వాహనాలు సమకూర్చుకోవాలి. వాటిని ఉంచడానికి భారీగా కెన్నెల్స్‌ను కొనుగోలుచేయాలి. ఒక కెన్నెల్‌లో రెండు కుక్కలను ఉంచినా లక్ష కెన్నెల్స్‌ అవసరమవుతాయని, అందుకోసం విశాలమైన స్థలాన్ని గుర్తించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ దశలో దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అధికారులు సమావేశమై సుప్రీంకోర్టు ఆదేశాలపై చర్చించి, ఏం చేయాలనే దానిపై నిర్ణయించే అవకాశం ఉంది.

Updated Date - Nov 10 , 2025 | 12:25 AM