నిర్మించారు.. వదిలేశారు!
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:51 AM
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బాలికల వసతిగృహానికి భవనం నిర్మించి ఏడాది కావస్తున్నప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరంభంనాటికి వసతిగృహాన్ని విద్యార్థినులకు అందుబాటులోకి తెస్తామన్న అధికారుల ప్రకటనలు ఆరు నెలలు దాటినా కార్యరూపం దాల్చలేదు.
సబ్బవరంలో అందుబాటులోకి రాని బాలికల వసతిగృహం
గత టీడీపీ హయాంలో శంకుస్థాపక
రూ.1.94 కోట్లు మంజూరు
ఏడాదిలో 90 శాతం పనులు పూర్తి
ఐదేళ్లపాటు పట్టించుకోని వైసీపీ పాలకులు
కూటమి వచ్చిన తరువాత నిధులు విడుదల
ఏడాది క్రితం పనులు పూర్తి
ఇంతవరకు ప్రారంభించని అధికారులు
సబ్బవరం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బాలికల వసతిగృహానికి భవనం నిర్మించి ఏడాది కావస్తున్నప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరంభంనాటికి వసతిగృహాన్ని విద్యార్థినులకు అందుబాటులోకి తెస్తామన్న అధికారుల ప్రకటనలు ఆరు నెలలు దాటినా కార్యరూపం దాల్చలేదు.
గ్రామీణ ప్రాంతంలో బాలికల డ్రాపౌట్స్‌ను తగ్గించి, చదువులో వారిని ప్రోత్సహించేందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలో (2014-19) వున్నప్పుడు హైబ్రిడ్ యాన్యునిటీ మోడల్ పథకంలో వసతిగృహాలను నిర్మించాలని నిర్ణయించింది. సబ్బవరం మండలంలోని ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న ఇతర గ్రామాలు, వేరే మండలాలకు చెందిన బీసీ బాలికల కోసం వసతిగృహం నిర్మాణానికి 2018లో రూ. 1.94 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలంలో భవన నిర్మాణం చేపట్టారు. పనులు శరవేగంగా చేయడంతో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి రూ.1.7 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. సుమారు రూ.25 లక్షల విలువ చేసే పనులు మిగిలిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గత వైసీపీ దిగిపోయే వచ్చే వరకు పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బాలికల వసతిగృహం నిర్మాణ పనులు పూర్తిచేయడానికి రూ.25 లక్షలు మంజూరుచేసింది. కాంట్రాక్టర్ ఈ ఏడాది ఆరంభంనాటికి పనులు పూర్తిచేశారు. వసతిగృహానికి అవసరమైన వార్డెన్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, గెస్ట్ ఫ్యాకల్టీ, వాచ్ ఉమన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ ఏడాది జూన్‌లో విద్యా సంస్థలు తెరిచేనాటికి వసతిగృహాన్ని అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించారు. ఇది జరిగి ఏడు నెలలు దాటినా.. వసతిగృహం ప్రారంభానికి నోచుకోలేదు. అయితే వాటర్ కనెక్టవిటీ పనులు, టెర్రస్ గేట్, డ్రైనేజీ పనులు పెండింగ్‌లో వున్నాయని, వీటికి సుమారు రూ.10 లక్షలు అవసరం అవుతాయని సిబ్బంది చెబుతున్నారు. కాగా వసతిగృహం నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని, కిటీకీలు ఊడిపోయాయని, తలుపుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే వుందని అంటున్నారు.