Share News

గూడు లేని బడులకు భవనాలు

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:23 PM

భౌగోళికంగా ప్రతికూల వాతావరణం, శత శాతం గిరిజన ప్రాంతం, దూర దూరంగా ఉండే గిరిజన పల్లెలు. దీంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ భవనాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. చాలా చోట్ల పాకలు, షెడ్లలో కొనసాగుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.

గూడు లేని బడులకు భవనాలు
ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ ముఖిపుట్టులో రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాల

జిల్లాలో పాఠశాలల భవన నిర్మాణాలకు రూ.45 కోట్లు మంజూరు

ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం

ప్రతి స్కూల్‌కు భవనం నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం

మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక శ్రద్ధ

గిరిజనుల్లో ఆనందం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

భౌగోళికంగా ప్రతికూల వాతావరణం, శత శాతం గిరిజన ప్రాంతం, దూర దూరంగా ఉండే గిరిజన పల్లెలు. దీంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ భవనాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. చాలా చోట్ల పాకలు, షెడ్లలో కొనసాగుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పాఠశాలలకు భవన నిర్మాణాల కోసం కూటమి ప్రభుత్వం రూ.45 కోట్లు మంజూరు చేయడంతో విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి.

జిల్లాలోని ప్రతి పాఠశాలకు భవన సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన జీవో:264ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఆయా నిధులతో జిల్లా వ్యాప్తంగా కనీస వసతి లేని 286 పాఠశాలకు భవనాలను నిర్మించడంతో పాటు మరో 86 పాఠశాలలకు అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నారు.

పట్టించుకోని గత పాలకులు

జిల్లాలోని రంపచోడవరం మండలం మినహా 21 మండలాల్లోనూ కనీస వసతి లేని ప్రాథమిక పాఠశాలలు వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే గత పాలకులు వాటి గురించి పట్టించుకోలేదు. దీంతో చాలా ఏళ్లుగా పరాయి పంచన, తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పాకలు, షెడ్లలోనే పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ముంచంగిపుట్టు మండలం సారథి గ్రామంలో, పెదబయలు మండలం కొరవంగి పంచాయతీ పరిధిలో బొడ్డగొంది గ్రామంలో ప్రాథమిక పాఠశాలలకు ఎటువంటి భవనాలు లేవు. దీంతో తొలుత ప్లాస్టిక్‌ కవర్ల నీడతోనే పాకను నిర్వహించగా, వర్షాకాలంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన తల్లిదండ్రులు తరువాత సిమెంట్‌ రేకులతో షెడ్లను నిర్మించారు. దీంతో వాటిలోనే ప్రస్తుతం పాఠశాలల నిర్వహణ కొనసాగుతున్నది. చింతపల్లి మండలంలో అత్యధికంగా 46 పాఠశాలలకు భవనాలు లేవు. అలాగే ముంచంగిపుట్టులో 43, పెదబయలులో 37, హుకుంపేటలో 26, వై.రామవరం, జి.మాడుగులలో 25, జీకేవీధిలో 22, చింతూరులో 20, అలాగే మిగిలిన మండలాల్లో 20లోపు పాఠశాలలకు భవనాలు లేవు.

మంత్రి నారా లోకేశ్‌ చొరవతో..

గిరిజన ప్రాంతంలో వసతి లేని ప్రాథమిక పాఠశాలలకు భవనాలను నిర్మిస్తామని గతేడాది జూలైలోనే రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ముంచంగిపుట్టు మండలం కెందుగూడ గ్రామంలో గిరిజనులు శ్రమదానంతో పాఠశాలకు షెడ్డు నిర్మించుకున్న విషయం మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆ పాఠశాల భవన నిర్మాణానికి గతేడాదే రూ.15 లక్షలు మంజూరు చేశారు. అలాగే రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలకు భవనాలు నిర్మించేందుకు రూ.46 కోట్లు మంజూరు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఈ క్రమంలో కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాఠశాలల భవనాల నిర్మాణానికి రూ.45 కోట్ల 2 లక్షలు 5 వేలు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో నంబర్‌: 264ను విడుదల చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి తమ గ్రామాల్లోని పాఠశాలలకు భవనాలు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పాఠశాలకు భవన నిర్మాణం చేపట్టేందుకు మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 11:23 PM