Share News

నగరంలో సందడే సందడి

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:46 AM

నగరం వీవీఐపీలతో శుక్రవారం సందడిగా మారింది. ఒకేసారి అనేక కార్యక్రమాలు వేర్వేరు వేదికలపై ఏర్పాటుకావడం, మంత్రులు, పారిశ్రామిక ప్రముఖులు రావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

నగరంలో సందడే సందడి

ముఖ్యులంతా విశాఖలోనే అటు సీఎం, ఇటు డిప్యూటీ సీఎం...మరోవైపు ఐటీ మంత్రి

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):

నగరం వీవీఐపీలతో శుక్రవారం సందడిగా మారింది. ఒకేసారి అనేక కార్యక్రమాలు వేర్వేరు వేదికలపై ఏర్పాటుకావడం, మంత్రులు, పారిశ్రామిక ప్రముఖులు రావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పార్టీ సమావేశాల కోసం గురువారం నుంచి ఇక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం రుషికొండ ప్యాలెస్‌ సందర్శనకు వెళ్లారు. ఆ తరువాత 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ నాయకులతో బీచ్‌ రోడ్డులోని బే వ్యూ హోటల్‌లో సమావేశమయ్యారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం సాయంత్రమే నగరానికి వచ్చారు. పార్టీ కార్యాలయంలో రాత్రి బస చేసి అక్కడే శుక్రవారం ఉదయం ప్రజాదర్బార్‌ నిర్వహించి, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పీఎం పాలెం ‘వి’ కన్వెన్షన్‌ సెంటర్‌లో చార్టర్డ్‌ అకౌంటెంట్ల సమావేశానికి హాజరయ్యారు. చంద్రపాలెం పాఠశాలలో ఏఐ లేబొరేటరీ ప్రారంభించారు. అక్కడి నుంచి రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లి సైయంట్‌ సంస్థ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ఏఐ ల్యాబ్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. సాయంత్రం అక్కడే మహిళా క్రికెటర్లతో ఇష్టాగోష్టి నిర్వహించారు. మధ్యలో నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లి ఏరోస్పేస్‌ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్నారు. అలాగే బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్నారు.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకొని బీచ్‌ రోడ్డులో పర్యాటక శాఖకు చెందిన డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రారంభించారు. వీటి కొనుగోలుకు విశాఖపట్నం పోర్టు రూ.4 కోట్లు సమకూర్చింది. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళ్లి ఇండియా ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సదస్సులో పాల్గొన్నారు. ఆ తరువాత రాడీసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లి గ్రిప్పింగ్‌ నెట్‌వర్క్‌ సదస్సులో పాల్గొన్నారు. సాయంత్రం బయలుదేరి కుప్పం వెళ్లారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాల వీరాంజనేయస్వామి, హోం శాఖ మంత్రి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, తదితరులు నగరానికి వచ్చారు. ఇలా నగరం ఉదయం నుంచి సాయంత్రం వరకు కళకళలాడింది.

Updated Date - Aug 30 , 2025 | 01:46 AM