Share News

తొట్లకొండపై బౌద్ధ వివరణ కేంద్రంలో క్యాంటీన్‌!

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:41 AM

తొట్లకొండపై ఎనిమిదేళ్ల క్రితం బౌద్ధమత వివరణ/ప్రచారం కోసం నిర్మించిన కేంద్రం (ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌)లో తాజాగా క్యాంటీన్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది.

తొట్లకొండపై   బౌద్ధ వివరణ  కేంద్రంలో క్యాంటీన్‌!

మత వివరాలు తెలియజేసేందుకు

ఎనిమిదేళ్ల క్రితం ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు

అప్పటినుంచి ప్రారంభించని అధికారులు

తాజాగా అందులో క్యాంటీన్‌ ఏర్పాటుకు నిర్ణయం

పురావస్తు స్థలాల పరిరక్షకుల అభ్యంతరం

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

తొట్లకొండపై ఎనిమిదేళ్ల క్రితం బౌద్ధమత వివరణ/ప్రచారం కోసం నిర్మించిన కేంద్రం (ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌)లో తాజాగా క్యాంటీన్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. పర్యాటకులకు బౌద్ధమత విశేషాలను వివరించేందుకు ఏర్పాటుచేసిన సెంటర్‌లో క్యాంటీన్‌ ఏర్పాటుచేయడంపై పురావస్తు స్థలాలను రక్షించే ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. క్రీ.పూ. మూడో శతాబ్దానికి చెందిన తొట్లకొండపై బౌద్ధ మతానికి చెందిన అనేక కట్టడాలు ఉన్నాయి. వాటిని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి బౌద్ధమతానికి చెందిన సన్యాసులు, పరిశోధకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో తొట్లకొండ విశిష్టతను వివరించడానికి వీలుగా ఒక సెంటర్‌ నిర్మాణం, శిథిలమైన కట్టడాల మరమ్మతులకు 2014లో అప్పటి పాలకులు రూ.1.8 కోట్లు మంజూరుచేశారు. ఆ సెంటర్‌లో ప్రాజెక్టర్‌ ద్వారా బౌద్ధమత విశిష్టతను తెలియజేసే డాక్యుమెంటరీ ప్రదర్శన, లైబ్రరీ, ఇతర వసతులు, హాలు, మరుగుదొడ్లు, సమాచారం అందించే డెస్క్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ భవన నిర్మాణం 2016-17లో పూర్తిచేశారు. ఇంతవరకూ భవనం ప్రారంభించాలనే విషయాన్ని పురావస్తుశాఖ అధికారులు మరిచిపోయారు. కొండపైకి వచ్చే వారికి కనీసం తాగునీటి సదుపాయం కూడా లేదు. ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయజైన్‌ తొట్లకొండను సందర్శించి అక్కడ వసతులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కొండపై కొత్తగా నిర్మించిన భవనం ఎందుకు వినియోగించలేదని అధికారులను నిలదీశారు. చివరకు ఆయన జోక్యంతో వీఎంఆర్‌డీఏ అధికారులు స్పందించి తొలుత భవనానికి చిన్నచిన్న మరమ్మతులు చేశారు. అనంతరం అజయజైన్‌ సూచన మేరకు కొండపైకి వచ్చేవారికి మంచినీరు, టీ, స్నాక్స్‌ లభించేలా క్యాంటీన్‌ నడపడానికి వీఎంఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. అందుకు ఒకరు ముందుకు వచ్చారు. అయితే క్యాంటీన్‌ నడిపే క్రమంలో శీతల పానీయాలు సరఫరా చేసే కంపెనీ బోర్డు ఏర్పాటుచేశారు. దీనిపై కొందరు పురావస్తు ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయాన్ని పురావస్తు శాఖ ఏడీ ఫల్గుణరావు వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమాచార కేంద్రంలో ఒక పక్క క్యాంటీన్‌ నిర్వహణకు అనుమతి ఇచ్చామన్నారు. తొట్లకొండపైకి వచ్చే సందర్శకులకు తాగునీరు, వాష్‌రూమ్‌, స్నాక్స్‌, టీ, కాఫీ వంటివి అక్కడ అందుబాటులో ఉంటాయన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 01:41 AM