Share News

అన్న చేతిలో తమ్ముడి హతం

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:21 PM

అన్నదమ్ముల మధ్య చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. ఈ ఘటన మండలం రంగబయలు పంచాయతీ కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

అన్న చేతిలో తమ్ముడి హతం
మృతుడు కామేశ్వరరావు (ఫైల్‌ఫొటో)

పనసపండు తిన్నదని తమ్ముడి ఆవుని గాయపరిచిన అన్న

గొడవ పడిన అన్నదమ్ములు

ఆగ్రహంతో తమ్ముడు గుండెపై బాణంతో పొడిచిన అన్న

అక్కడికక్కడే మృతి..

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ముంచంగిపుట్టు, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి):

అన్నదమ్ముల మధ్య చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. ఈ ఘటన మండలం రంగబయలు పంచాయతీ కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలో అత్యంత మారుమూల రంగబయలు పంచాయతీ కేంద్రంలో అన్నదమ్ములు ఎస్‌.లైచోన్‌, ఎస్‌.కామేశ్వరరావు నివాసముంటున్నారు. శనివారం సాయంత్రం ఎస్‌.లైచోన్‌ పనస చెట్టు నుంచి ఒక పనసపండు తీసి కిందకు పడేశాడు. అదే సమయంలో చెట్టు వద్ద ఉన్న ఆవు ఆ పనసపండును తినేసింది. దీంతో చెట్టు పైనుంచి కిందకు దిగిన లైచోన్‌ కోపంతో కత్తితో ఆవుపై దాడి చేసి గాయపరిచాడు. గాయాలతో ఉన్న ఆవును చూసిన తమ్ముడు ఎస్‌.కామేశ్వరరావు(51) ఆవును ఎవరు గాయపరిచారని స్థానికులను అడగ్గా.. అన్న లైచోన్‌ గాయపరిచాడని చెప్పారు. ఆ విషయాన్ని అన్నని అడగ్గా నేనుకాదని అన్న లైచోన్‌ బదులిచ్చాడు. ఈ సమయంలో వారి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో స్థానికులు కలుగజేసుకొని సర్దిచెప్పడంతో ఆ గొడవ అక్కడితో ముగిసిపోయింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఫూటుగా మద్యం సేవించిన అన్నయ్య లైచోన్‌ తమ్ముడు ఇంటి వద్దకు వెళ్లి నా పనసపండును మీ ఆవు తినేయడంతో నేనే గాయపరిచాను.. నువ్వు ఏమి చేస్తావు అంటూ కేకలు వేయడంతో మరోసారి వారి మధ్య గొడవ తలెత్తి కొట్లాటకు దారితీసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన అన్నయ బాణంతో తమ్ముడు కామేశ్వరరావు గుండెపై బలంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కామేశ్వరరావు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడు కామేశ్వరరావుకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల ఉన్నారు. గతంలోనే ఆయన భార్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న జి.మాడుగుల సీఐ పి.శ్రీనివాసరావు, పెదబయలు ఇన్‌చార్జి ఎస్‌ఐ రమణ ఆదివారం ఉదయం రంగబయలు గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై వివరాలు సేకరించారు. మృతుడు కుమారుడు దయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అలాగే నిందితుడు లైచోన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొని ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు.

Updated Date - Jun 15 , 2025 | 11:21 PM