Share News

రంగంలోకి దళారులు!

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:16 AM

ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 1,132 ఎకరాల భూ సమీకరణకు వీఎంఆర్‌డీఏ నిర్ణయించడంతో దళారుల హడావిడి మొదలైంది.

రంగంలోకి దళారులు!

  • ల్యాండ్‌ పూలింగ్‌ ప్రకటనతో గ్రామాల్లో ప్రవేశం

  • భీమన్నదొరపాలెం రైతులతో చర్యలు ప్రారంభం

  • గోరింటలో భూములు కొనుగోలు చేసిన మాజీ ఉన్నతాధికారి

  • శొంఠ్యాంలో వైసీపీ నేతకు భారీగా భూములు

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 1,132 ఎకరాల భూ సమీకరణకు వీఎంఆర్‌డీఏ నిర్ణయించడంతో దళారుల హడావిడి మొదలైంది. ఆనందపురం మండలం భీమన్నదొరపాలెంలో కొందరు దళారులు రెండుమూడు రోజులుగా రైతులతో మంతనాలు జరుపుతున్నారు. గోరింటలో సుమారు 60 నుంచి 70 ఎకరాల డీపట్టా భూములు కొనుగోలు చేసిన మాజీ ఉన్నతాధికారికి చెందిన వారు ప్రస్తుతం ఇక్కడ మకాం వేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు, ఉన్నతాధికారులు, వారి అనుయాయులు, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిలో భారీగానే డీపట్టాభూములు కొనుగోలుచేశారు. కొన్నిచోట్ల అడ్వాన్స్‌లు ఇచి అనధికారిక అగ్రిమెంట్లు చేసుకున్నారు.

అప్పట్లో డీపట్టా భూములకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు జారీచేశారు. తరువాత వివాదం చెలరేగడంతో ప్రక్రియ నిలిచిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిగా ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్‌ల జారీపై నిషేధం కొనసాగుతోంది. అప్పట్లో పెద్దలు కొనుగోలుచేసిన డీపట్టాభూముల్లో చాలావరకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి.వాటిలో గోరింట, శొంఠ్యాం గ్రామాలున్నాయి. గోరింట సర్వేనంబరు 108లో 198.31 ఎకరాల్లో సుమారు 60 నుంచి 70 ఎకరాలను మాజీ ఉన్నతాధికారి కొనుగోలు చేశారు. ఆయన తరపున దళారులు త్రిలోక్‌, సుభాష్‌ ఆనందపురం తహసీల్దారు కార్యాలయం నుంచి చక్రం తిప్పారు. ఇప్పుడు ఈ భూములను వీఎంఆర్‌డీఏ భూ సమీకరణకు తీసుకుంటున్నందున అప్రమత్తమయ్యారు.

సొమ్ము చేసుకునేందుకు...

భూ సమీకరణలో భాగంగా డీపట్టా ఉంటే ఎకరాకు 900 గజాలు, రైతుల ఆక్రమణలో ఉన్న భూములకు (రెవెన్యూ రికార్డుల్లో నమోదుకావాలి. ఇంకా తోటలు ఏపుగా పెరిగి ఉండాలి) 450 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తారు). ముందుగా చేసుకున్న అనఽధికారికి ఒప్పందం మేరకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కొనుగోలుదారులకు రైతులు రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ రైతుల వద్ద ఉన్న డీపట్టా భూములకు సంబంధించే వచ్చే ప్లాట్లు విక్రయించేలా కొందరు రంగంలోకి దిగారు.

వైసీపీ నేత గుప్పిట్లో...

శొంఠ్యాం సర్వేనంబరు 347పీలో 251.55 ఎకరాల భూమిని సమీకరించేందుకు వీఎంఆర్‌డీఏ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ సర్వేనంబరులో డీపట్టాలు ఎక్కువగా లేకపోయినా రైతుల ఆధీనంలో తోటలు పెంచుతున్నారు. నగరానికి చెందిన వైసీపీ నేత ఒకరు ఈ గ్రామంలో సుమారు 40 నుంచి 50 ఎకరాలు కొనుగోలుచేశారు. అయితే డీపట్టాలకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు జారీకాలేదు. కేవలం రైతుల ఆధీనంలో ఉన్న భూముల విషయంలో ల్యాండ్‌ పూలింగ్‌ జరిగితే ఎకరాకు 450 గజాల చొప్పున ప్లాటు వస్తుందని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైసీపీ నేత, అతని అనుచరులు శొంఠ్యాంలో భూములు కొనుగోలుచేశారు. తాజాగా భూ సమీకరణ ప్రకటన, తదనంతరం గ్రామసభ నిర్వహణతో వైసీపీ నేత, అతని అనుచరులు రైతులతో మాట్లాడినట్టు చెబుతున్నారు. భీమన్నదొరపాలెంలో సర్వేనంబరు -1లో 122.53 ఎకరాల్లో డీపట్టా భూములు తక్కువ. రైతుల ఆఽధీనంలో భూములూ స్వల్పమే. అయినా రెండుమూడు రోజులుగా దళారులు కొందరు రైతులతో మాట్లాడుతున్నారు. గ్రామంలో డీపట్టా భూములను చాలా వరకు కూటమి నేతలు, మరో వ్యాపారి కుటుంబం ఏళ్ల క్రితమే కొనుగోలుచేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలతో పరిచయాలను ఆసరాగా చేసుకుని కూటమి నేతలు డీపట్టా భూములకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. గిడిజాల సర్వేనంబరు 258లో 309 ఎకరాల కొండ, దానికి ఆనుకుని భూములను సమీకరించనున్నారు. ఇక్కడ కూడా కూటమి నేతలు కొందరు చోటా నాయకులతో మంతనాలు జరుపుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గత భూ సమీకరణలో చోటుచేసుకున్న అక్రమాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిదే.

Updated Date - Aug 11 , 2025 | 12:16 AM