Share News

గూగుల్‌కు భూ సేకరణలో బ్రోకర్‌ మాయాజాలం!

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:23 AM

ఆనందపురం మండలం తర్లువాడ సర్వేనంబరు-1లో గూగుల్‌ డేటా సెంటర్‌కు కేటాయించిన భూముల వ్యవహారంలో కొందరు రైతులను ఒక బ్రోకర్‌ అనేక రకాలుగా మాయలో పడేస్తున్నాడు.

గూగుల్‌కు భూ సేకరణలో బ్రోకర్‌ మాయాజాలం!

ప్రతి రైతుకు 55 సెంట్ల భూమి, రూ.1.15 కోట్లు ఇస్తానని ఆఫర్‌

మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తికి ప్రతిపాదన

గ్రామానికి చెందిన వైసీపీ నేత ద్వారా బేరసారాలు

మాటనిలబెట్టుకోకపోవడంతో తర్లువాడ రైతుల్లో అయోమయం

ప్రభుత్వ ప్యాకేజీయే బాగుందంటున్న అత్యధికులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆనందపురం మండలం తర్లువాడ సర్వేనంబరు-1లో గూగుల్‌ డేటా సెంటర్‌కు కేటాయించిన భూముల వ్యవహారంలో కొందరు రైతులను ఒక బ్రోకర్‌ అనేక రకాలుగా మాయలో పడేస్తున్నాడు. రెండెకరాలు కలిగిన ఉన్న డీపట్టాదారుడికి 55 సెంట్ల భూమి, రూ.1.15 కోట్ల నగదు ఇస్తానని వారం క్రితం ప్రతిపాదన చేశాడు. మూడు రోజుల్లో సొమ్ము చెల్లిస్తానని ఇచ్చిన మాటను బ్రోకర్‌ నిలబెట్టుకోలేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం చేసిన ప్రతిపాదనకు ఎక్కువమంది రైతులు మొగ్గుచూపగా, కొద్దిమంది మాత్రం ఇంకా బ్రోకర్‌ మాయలో ఉన్నారని గ్రామంలో ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో కణమాం గ్రామానికి చెందిన వైసీపీ నేతతో కలిసి సదరు బ్రోకర్‌ నాటకమాడుతున్నాడని పలువురు చెబుతున్నారు.

గూగుల్‌ డేటా సెంటర్‌ కోసం 308 ఎకరాలు అవసరం కావడంతో విశాఖ జిల్లా యంత్రాంగం సేకరణకు సన్నద్ధమైంది. దీనిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవ తీసుకుని పదేపదే గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి, వారిలో అపోహలు తొలగించారు. దీంతో భూముల కోసం సర్వే ప్రక్రియ సాఫీగా సాగిపోయింది. సర్వేనంబరు-1లో 51 మంది రైతులకు 1971లో అప్పటి ప్రభుత్వం రెండు ఎకరాల చొప్పున డీపట్టాలు ఇచ్చింది. మరో 80 మంది ఆక్రమణదారులకు గాను కొద్దిమంది వివరాలు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. వీరు కాకుండా 1998-2000 సంవత్సరాల్లో గ్రామానికి చెందిన 528 మందికి డీఆర్‌డీఏ అధికారులు కొద్ది భూమి కేటాయించి అక్కడ కూరగాయలు/తోటలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. వీరిలో చాలామంది ఆయా భూములను సాగు చేయకుండా వదిలేశారు. కాగా గూగుల్‌ డేటా సెంటర్‌కు భూములు ఇచ్చేందుకు రైతులు పలు డిమాండ్లు పెట్టగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. డీపట్టా ఉన్న రైతులకు ఎకరాకు 20 సెంట్ల భూమి ఇచ్చి, మిగిలిన 80 సెంట్లకు ఎకరా రూ.50 లక్షల చొప్పున లెక్కగట్టి రూ.40 లక్షల నగదు, ఒక ఉద్యోగం, వాణిజ్య సముదాయంలో దుకాణం, ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి డీపట్టాదారుల్లో మెజారిటీ రైతులు, ఆక్రమణదారులు అంగీకరించగా కొద్దిమంది డీపట్టాదారులు మాత్రం ససేమిరా అంటున్నారు.

రంగంలోకి బ్రోకర్‌

భూములు ఇచ్చేది లేదని చెబుతున్న డీపట్టాదారుల వెనుక బ్రోకర్‌ హస్తం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కీలక అధికారి కోసం ఓ బ్రోకర్‌ తర్లువాడ వచ్చాడు. డీపట్టా రైతుల నుంచి 100 ఎకరాలు తీసుకుంటానని బేరం కుదుర్చుకున్నాడు. డీపట్టాలకు ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు జారీచేసి తీసుకువస్తానని, ఎకరాకు రూ.ఏడు లక్షలు నగదు, 60 సెంట్లు భూమి ఇస్తానని నమ్మబలికాడు. ఫ్రీహోల్డ్‌ చేసినందుకు ఎకరాకు 40 సెంట్లు తీసుకునేలా అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. ఆరు నెలలు నుంచి ఏడాది మధ్యన ఫ్రీహోల్డ్‌ ప్రక్రియ పూర్తిచేస్తానని చెప్పిన బ్రోకర్‌, హామీని నిలబెట్టుకోలేదు. ఒప్పందం మేరకు ప్రతి రైతుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఈలోగా ఫ్రీహోల్డ్‌ వ్యవహారంపై దుమారం రేగడం, 2024 ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో ప్రక్రియకు తెరపడింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఫ్రీహోల్డ్‌పై ఆంక్షలు విధించింది. ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి మౌనంగా ఉండిపోయిన బ్రోకర్‌, తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌ నెలకొల్పుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో తెరపైకి వచ్చారు. వెంటనే అడ్వాన్స్‌లు ఇచ్చిన రైతులతో మాట్లాడి భూములు తనకే ఇవ్వాలని, అన్ని అనుమతులు తీసుకువస్తానని మరోసారి నమ్మించాడు. ఈలోగా జిల్లా యంత్రాంగం దూకుడు పెంచగా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవ తీసుకుని గ్రామస్థులంతా ఒకే తాటిపైకి వచ్చేలా సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సదరు బ్రోకర్‌కు హెచ్చరికలు జారీచేయడంతో తర్లువాడ భూముల వ్యవహారానికి దూరంగా ఉంటానని చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఒక పక్క అలా చెప్పినా, మరో వైపు ఆనందపురం మండలం కణమాం గ్రామానికి చెందిన వైసీపీ నేత ద్వారా గ్రామంలోని కొందరు రైతులను రెచ్చగొట్టి కోర్టులో కేసులు వేయించారు. అయితే కోర్టులో చుక్కెదురు కావడంతో వారం కిందట వైసీపీ నేత ద్వారా ఒక ప్రతిపాదన పెట్టారని చెబుతున్నారు. రెండెకరాల డీపట్టా ఉన్న రైతుకు మూడు రోజుల్లో రూ.55 సెంట్లు భూమి, రూ.1.15 కోట్ల నగదు ఇస్తామని బేరం పెట్టారు. దీనికి కొద్దిమంది మొగ్గుచూపగా మిగిలిన వారంతా ససేమిరా అన్నారు. అయితే మూడు రోజుల్లో సొమ్ములు ఇవ్వలేకపోవడంతో రైతులు డైలామాలో పడ్డారు. కాగా ప్రభుత్వం మాత్రం ప్రతి ఎకరాకు 20 సెంట్లు, రూ.40 లక్షల నగదు, ఇంటికి ఒక ఉద్యోగం, దుకాణం, మూడు సెంట్ల భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. బ్రోకర్‌ ప్రతిపాదన కంటే ప్రభుత్వమే ఎక్కువ పరిహారం ఇస్తున్నందున మెజారిటీ రైతులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని గ్రామానికి చెందిన ఒకరు తెలిపారు. మిగిలిన కొద్దిమంది కూడా త్వరలోనే ప్రభుత్వ ప్రతిపాదనకు మొగ్గుచూపుతారని అన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 01:23 AM