Share News

విరగ్గాసిన డ్రాగన్‌ ఫ్రూట్‌

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:43 AM

మండలంలోని గొందిపాకలు పంచాయతీ చిక్కుడుబట్టి గ్రామంలో ఓ గిరిజన రైతు పెరట్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ విరగ్గాసింది. అరుదైన ఉద్యాన పంటల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ ఒకటి.

విరగ్గాసిన డ్రాగన్‌ ఫ్రూట్‌
చిక్కుడుబట్టిలో కాసిన డ్రాగన్‌ఫ్రూట్‌

చింతపల్లి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొందిపాకలు పంచాయతీ చిక్కుడుబట్టి గ్రామంలో ఓ గిరిజన రైతు పెరట్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ విరగ్గాసింది. అరుదైన ఉద్యాన పంటల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ ఒకటి. 2008లో తొలిసారిగా చింతపల్లి మండలం జల్లూరుమెట్ట గ్రామంలో తెనాలికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయ్‌శ్రీరామ్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించాడు. నాటి నుంచి గిరిజన ప్రాంతంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు విస్తరించింది. ఈ పంట సాగుకు గిరిజన ప్రాంత వాతావరణం అనుకూలించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా సాగును ప్రోత్సహిస్తుంది. పాడేరు రెవెన్యూ డివిజన్‌లో అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, జీకేవీధి, చింతపల్లి మండలాల్లో గిరిజన రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. చిక్కుడుబట్టి గ్రామంలో గిరిజన రైతు వనుము సింహాచలం పెరటిలో పది డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు మూడేళ్ల క్రితం నాటాడు. మూడు మొక్కలు గత ఏడాది నుంచి కాపుకొస్తున్నాయి. ప్రస్తుతం సీజన్‌ కావడంతో డ్రాగన్‌ ఫ్రూట్స్‌ అధికంగా వచ్చాయి. ఒక్కొక్క మొక్క నుంచి 35-45 కాయలు వస్తున్నాయని, పింక్‌, వైట్‌ రకాల కాయలు కాస్తున్నాయని రైతు తెలిపాడు. డ్రాగన్‌ ఫ్రూట్‌ కాయలను రూ.30-40 ధరకు ప్రాంతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు రైతు సింహాచలం తెలిపాడు.

Updated Date - Jun 30 , 2025 | 12:43 AM