Share News

ప్రమాదంలో వారధులు

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:41 AM

చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని పలు మార్గాల్లో వున్న ప్రధాన వంతెనలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి.

ప్రమాదంలో వారధులు

ఫొటోరైటప్స్‌ః 25సీడీఎం2: ప్రమాదకర స్థితిలో వున్న గోవాడ వంతెన

25సీడీఎం5:

25సీడీఎం12: పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలతో గౌరీపట్నం వంతెనకు పొంచిఉన్న ముప్పు

25బీపీటీ2: ఇటీవల వర్షాలు, వరదలకు కొట్టుకుపోయిన వడ్డాది కాజ్‌వే

24సీడీఎం8: విజయరామరాజుపేట వద్ద బొడ్డేరు నదిపై కొట్టుకుపోయిన కాజ్‌వే

శిథిలావస్థకు చేరిన కట్టడాలతో పొంచిఉన్న ముప్పు

ఇప్పటికే కూలిపోయిన వడ్డాది, విజయరామరాజుపేట, కట్టువాని అగ్రహారం వంతెనలు

కాజ్‌వేలు నిర్మించి చేతులు దులుపుకుంటున్న అధికారులు

వరద ఉధృతికి కొట్టుకుపోతున్న కాజ్‌వేలు

సత్వరమే పునరుద్ధరణ పనులు చేపట్టని దుస్థితి

రాకపోకలకు రోజుల తరబడి ప్రజల ఇక్కట్లు

ప్రతిపాదనలకే పరిమితమైన కొత్త వంతెనల నిర్మాణం

చోడవరం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని పలు మార్గాల్లో వున్న ప్రధాన వంతెనలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. వాటి స్థానంలో కొత్త వంతెనలు నిర్మించకుండా, తాత్కాలికంగా కాజ్‌వేలతో సరిపెట్టడం, భారీ వర్షాలకు అవి కొట్టుకుపోతుండడంతో ఆయా మార్గాల్లో రోజుల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రత్నామ్నాయ మార్గాల్లో చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో ప్రధానమైన శారదా, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు వంటి నదులు మాడుగుల, చోడవరం నియోజకవర్గాల మీదుగా వెళుతుంటాయి. వీటిపై పలుచోట్ల ప్రజల రాకపోకల కోసం దశాబ్దాల క్రితం వంతెనలు నిర్మించారు. కాలక్రమేణాల వాహనాల రద్దీ పెరగడంంతో వంతెనలు బలహీనంగా మారి, కూలిపోతున్నాయి.. లేదా కుంగిపోతున్నాయి.

బుచ్చెయ్యపేట మండలంవడ్డాది వద్ద పెద్దేరు నదిపై ఎప్పుడో బ్రిటీష్‌ హయాంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరి, 2022 మే 11వ తేదీన కుంగిపోయింది. దీంతో నర్సీపట్నం నుంచి పాడేరు, మాడుగుల, చోడవరం వైపు వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను వేరే మార్గాల్లో మళ్లించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ కొత్త వంతెన నిర్మాణం చేపట్టకుండా... పక్కనే తక్కువ ఎత్తులో కాజ్‌వే నిర్మించి చేతులు దులుపుకుంది. పెద్దేరు నదిలో వరద ఉధృతి పెరిగితే.. కాజ్‌వే మీదుగా నీరు ప్రవహించి ఛిద్రం అవుతున్నది. దీనికి బాగు చేసే వరకు ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు.

చోడవరం-పాడేరు మార్గంలో బొడ్డేరు నదిపై విజయరామరాజుపేట వద్ద వున్న వంతెన రెండేళ్ల క్రితం కూలిపోయింది. ఇక్కడ కూడా తాత్కాలికంగా కాజ్‌వే నిర్మించారు. బొడ్డేరు నదిలో వరద ఉధృతి పెరిగితే.. ఇక్కడ కాజ్‌వే కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది. గత వారం కురిసిన భారీ వర్షాలకు నదిలో వరద పోటెత్తడంతో కాజ్‌వే ధ్వంసమైంది. చోడవరం వైపు నుంచి మాడుగుల, నర్సీపట్నం, పాడేరు ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీడికాడ, దేవరాపల్లి, మాడుగుల, బుచ్చెయ్యపేట మండలాలకు ప్రధానమైన చీడికాడ మండలం కట్టువాని అగ్రహారం వద్ద బొడ్డేరు నదిపై వున్న మరో వంతెన కూలిపోయింది. చోడవరం మండలం గవరవరం వద్ద శారదా నదిపై వున్న వంతెన పుష్కరకాలం క్రితం కుంగిపోగా, కొత్త వంతెన నిర్మించి, అందుబాటులోకి తీసుకురావడానికి దాదాపు పదేళ్లు పట్టింది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో వున్న ఈ వంతెనలు కూలిపోవడం వల్ల ఈ రెండు నియోజకవర్గాల ప్రజలే కాకుండా మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వడ్డాది, విజయరామరాజుపేట వంతెనల స్థానంలో కొత్తవంతెన నిర్మాణానికి ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. తాజాగా కూలిన కట్టువాని అగ్రహారం వంతెన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

ప్రమాదం అంచున మరికొన్ని వంతెనలు

బీఎన్‌ రోడ్డులో చోడవరం మండలం గోవాడ వద్ద శారదా నదిపై వంతెన శిథిలావస్థకు చేరింది. 1960వ సంవత్సరంలో నిర్మించిన ఈ వంతెన సామర్థ్యం 40 టన్నులు కాగా.. 80 నుంచి 100 టన్నుల బరువగల గ్రానైట్‌ రాళ్లను రవాణా చేసే వాహనాలు వెళుతున్నాయి. మరోవైపు వంతెన కింద, పిల్లర్లకు సమీపంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో వంతెనకు ముప్పు పొంచివుంది. పొరపాటున ఈ వంతెన కూలిపోతే.. విశాఖపట్నం, అనకాపల్లి వైపు నుంచి చోడవరం, మాడుగుల, పాడేరు ప్రాంతాలకు వాహనాల రాకపోకలు స్తంభించిపోతాయి.

వడ్డాది-విజయరామరాజుపేట మధ్య బొడ్డేరు నదిపై వున్న వంతెన కూలిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించాల్సిన వాహనాలను చోడవరం మండలం గౌరీపట్నం మీదుగా మళ్లించారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరగడంతో గౌరీపట్నం వంతెనకు ముప్పు వాటిల్లుతున్నది. 1994లో నిర్మించిన ఈ వంతెన ఇసుక అక్రమ తవ్వకాలతో పిల్లర్లు బలహీనంగా మారాయి. మరో ప్రత్యామ్నాయ వారధి అయిన చోడవరం సమీపంలో పెద్దేరు నదిపై ఉన్న జన్నవరం వంతెన కూడా నేడో రేపో అన్నట్టుగా ఉంది. ఇది కూలిపోతే చోడవరం నుంచి రావికమతం, బుచ్చెయ్యపేట, రోలుగుంట మండలాలకు రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. మాడుగుల ఘాట్‌ రోడ్‌ జంక్షన్‌- మాడుగుల మధ్య తాచేరు నదిపై వున్న వంతెన కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితిలో వుంది.

ప్రతిపాదనలకే పరిమితం

ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు జిల్లాలో బలహీనంగా వున్న వంతెనలను ఇటీవల పరిశీలించారు. గోవాడ, విజయరామరాజుపేట, వడ్దాది, గౌరీపట్నం వద్ద కొత్త వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. వడ్దాది, విజయరామరాజుపేట వద్ద కూలిన వంతెనలతోపాటు గోవాడ వద్ద ప్రస్తుతం వున్న వంతెన స్థానంలో కొత్త వంతెనల నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపారు. నిధులు మాత్రం మంజూరు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌అండ్‌బీ అధికారులు ఒకసారి ప్రతిపాదనలు పంపారు. ఆయా ప్రాంతాల్లో కొత్త వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులపైనే వుందని రెండు నియోజకవర్గాల ప్రజలు అభిప్రాయపడతున్నారు.

Updated Date - Aug 26 , 2025 | 01:41 AM