కూలేందుకు సిద్ధంగా వంతెన
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:22 PM
మండలంలోని నడింపాలెం నుంచి గాంకొండకు వెళ్లే ప్రధాన రహదారిలో లంకవీధి సమీపంలో గల వంతెన శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ వంతెన కూలిపోతే నాలుగు గ్రామాల ప్రజల రాకపోకలు స్తంభించిపోతాయి.
ఏడాదిగా ఇదే పరిస్థితి
గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినా ఫలితం శూన్యం
బ్రిడ్జి కూలిపోతే నాలుగు గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం
కొయ్యూరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని నడింపాలెం నుంచి గాంకొండకు వెళ్లే ప్రధాన రహదారిలో లంకవీధి సమీపంలో గల వంతెన శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ వంతెన కూలిపోతే నాలుగు గ్రామాల ప్రజల రాకపోకలు స్తంభించిపోతాయి. లంకవీధి సమీపంలో ఇటీవల అల్లూరి అనుచరుల వారసులకు నాగార్జున కన్‌స్ట్రక్షన్ యాజమాన్యం నిర్మించిన అపార్టుమెంట్‌లకు సమీపంలో కొండవాగు ప్రవాహంపై ఈ వంతెన ఉంది. దీనిని మూడు దశాబ్దాల క్రితం నిర్మించారు. ఏడాది క్రితం వంతెనకు సంబంధించిన ఒక స్తంభం కుంగిపోయింది. దీంతో వంతెన శ్లాబ్ సగానికి పైగా గాలిలో ఉంది. మిగతా స్తంభాలు కూడా బీటలు వారాయి. ఈ వంతెన మీదుగా గాంకొండ, లంకవీధి తీగలమెట్ట, దిబ్బలపాలెం గ్రామాలకు చెందిన రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో తిరుగుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా గ్రామాల ప్రజలు వంతెన శ్లాబ్‌కు కర్రలు సపోర్టుగా పెట్టారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ సమస్యపై ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు విన్నవించుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వంతెనకు తాత్కాలికంగా మరమ్మతులు చేయించడంతో పాటు దీని స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగ మండల జేఈ రామకృష్ణ వివరణ కోరగా, ఈ వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి రూ.75 లక్షల అంచనా వ్యయంతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు.