Share News

సివిల్స్‌ ఉచిత శిక్షణకు బ్రేక్‌

ABN , Publish Date - Apr 27 , 2025 | 10:51 PM

గిరిజన అభ్యర్థులకు సివిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వాలనుకున్న ఐటీడీఏ అధికారుల ఆలోచనలకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ఏడాది ఉచిత శిక్షణ వ్యవహారం అయోమయంలో పడింది. ఉచిత శిక్షణకు సంబంధించి ఐటీడీఏ అధికారులు టెండర్లు ఆహ్వానించారు.

సివిల్స్‌ ఉచిత శిక్షణకు బ్రేక్‌
ఉచిత శిక్షణకు దరఖాస్తులు అందజేస్తున్న నిరుద్యోగులు(ఫైల్‌)

కోచింగ్‌ నిర్వహణ టెండర్ల ప్రక్రియపై వివాదం

కోర్టుకు చేరిన వ్యవహారం

ఎప్పటికి కొలిక్కి వస్తుందో చెప్పలేని పరిస్థితి

700 మంది అభ్యర్థులు దరఖాస్తు

శిక్షణ ప్రారంభంకాకపోవడంతో నిరాశ

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గిరిజన అభ్యర్థులకు సివిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వాలనుకున్న ఐటీడీఏ అధికారుల ఆలోచనలకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ఏడాది ఉచిత శిక్షణ వ్యవహారం అయోమయంలో పడింది. ఉచిత శిక్షణకు సంబంధించి ఐటీడీఏ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఈ క్రమంలో టెండర్లను దక్కించుకునే కోచింగ్‌ సంస్థల మధ్య పోటీ నేపథ్యంలో టెండర్‌ ఏకపక్షంగా ఉందని ఒక సంస్థ హైకోర్టును ఆశ్ర యించడంతో ప్రస్తుతం ఈవ్యవహారం కోర్డులో ఉంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గిరిజన అభ్యర్థులకు 9 నెలలు సివిల్స్‌ ఉచిత శిక్షణ నిర్వహించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రూ.కోటి 86 లక్షలు మంజూరు చేసింది. దీనిలో రూ.కోటి ఉచిత కోచింగ్‌ నిర్వహణకు, రూ.86 లక్షలు అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించేందుకు వినియోగించాలని రాష్ట్ర అధికారులు సూచించారు. అయితే కోచింగ్‌ నిర్వహించే ఏజెన్సీని టెండర్‌ ప్రక్రియ ద్వారా మాత్రమే ఎంపిక చేయాలని గిరిజన సంక్షేమ శాఖాధికారులు ఐటీడీఏ అధికారులను ఆదేశించారు.

కోర్టుకు చేరిన టెండర్ల ప్రక్రియ

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెలలో కోచింగ్‌ నిర్వహణకు టెండర్లను ఆహ్వానించారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన 14 కోచింగ్‌ ఏజెన్సీలు టెండర్లలో పాల్గొన్నాయి. అయితే టెండర్ల ప్రక్రియలో పాల్గొనే ఏజెన్సీలకు ఎస్‌టీ అభ్యర్థులకు కనీసం రెండేళ్లు కోచింగ్‌ ఇచ్చిన అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు. గత రెండేళ్లుగా 21వ సెంచరీ అకాడమీ అనే సంస్థ 70 శాతం రాయితీతో గిరిజన అభ్యర్థులకు సివిల్స్‌లో కోచింగ్‌ ఇస్తుండడంతో ఈ టెండర్ల ప్రక్రియలో కేవలం 21వ సెంచరీ అకాడమీ మాత్రమే అర్హత సాధించింది. దీంతో టెండర్ల ప్రక్రియ ఏకపక్షంగా నిర్వహించారని మిగిలిన కోచింగ్‌ ఏజెన్సీలు గగ్గోలు పెట్టడంతో టెండర్‌ను రద్దు చేసి, రెండో మారు టెండర్‌ ఆహ్వానించారు. దీంతో రెండో సారి టెండర్‌కు 13 కోచింగ్‌ ఏజెన్సీలు దరఖాస్తులు చేశాయి. అయితే ఈ టెండర్‌లోనూ 21వ సెంచరీ అకాడమీనే అర్హత సాధించింది. దీంతో ఇది ఏకపక్షంగా జరిగిందని, ఐటీడీఏ అధికారులు 21వ సెంచరీ అకాడమీకి లబ్ధి చేకూరేలా టెండర్ల ప్రక్రియను నిర్వహించారని తెలంగాణకు చెందిన శరత్‌చంద్ర కోచింగ్‌ అకాడమీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ టెండర్ల ప్రక్రియలో 12 సంస్థలు అనర్హతకు గురికాగా, కేవలం ఒక సంస్థ మాత్రమే అర్హత సాధించడం సరికాదని కోర్టు భావించి, టెండర్‌ ఫలితాలను వెల్లడించవద్దని సూచించింది. దీని వల్ల మొత్తం వ్యవహారం కోర్డు పరిధిలోకి వెళ్లడంతో ప్రస్తుతానికి ఉచిత కోచింగ్‌ ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది. తదుపరి హైకోర్టు ఆదేశాలు, సూచనలను అనుసరించి కోచింగ్‌పై దృష్టి సారిస్తామని ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి. సివిల్స్‌ ఉచిత శిక్షణకు 700 మంది గిరిజన అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. వాస్తవానికి మార్చి ఒకటో తేదీ నుంచే ఎంపిక చేసిన 100 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ మొదలు కావాల్సిఉండగా, టెండర్‌ వివాదం కోర్టుకు చేరడంతో అభ్యర్థుల ఆశలు నెరవేరని పరిస్థితి నెలకొంది.

Updated Date - Apr 27 , 2025 | 10:51 PM