మేలి రకం మిరియాల ఉత్పత్తికి బ్రేక్
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:19 PM
ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రం(హెచ్‌ఎన్‌టీసీ)లో మేలిరకం మిరియాల మొక్కల ఉత్పత్తి నిలిచిపోయింది. మిరియాల మొక్కల ఉత్పత్తి కోసం నిర్మించిన పాలిహౌస్ శిథిలమైనా గత వైసీపీ ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది.
హెచ్‌ఎన్‌టీసీలో శిథిలమైన పాలిహౌస్
గత ఐదేళ్లుగా కనీస మరమ్మతులు చేపట్టని వైసీపీ ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు
అంతరించిపోయిన మదర్ ప్లాంట్లు
చింతపల్లి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రం(హెచ్‌ఎన్‌టీసీ)లో మేలిరకం మిరియాల మొక్కల ఉత్పత్తి నిలిచిపోయింది. మిరియాల మొక్కల ఉత్పత్తి కోసం నిర్మించిన పాలిహౌస్ శిథిలమైనా గత వైసీపీ ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. మిరియాల ఉత్పత్తికి వాతావరణం అనుకూలించక విత్తన మొక్కలు(మదర్ ప్లాంట్స్) అంతరించిపోయాయి. దీంతో ఆదివాసీలకు మేలి రకం మిరియాల మొక్కలు దూరమయ్యాయి.
జిల్లాలో ఆదివాసీలు కాఫీ తరహాలో మిరియాల సాగు చేపడుతున్నారు. కాఫీ తోటల్లో మిరియాలను అంతర పంటగా సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. కిలో మిరియాలకు ప్రాంతీయ మార్కెట్‌లో రూ.600 ధర లభిస్తున్నది. ప్రస్తుతం ఆదివాసీలు సాగు చేస్తున్న మిరియాల మొక్కల నుంచి ఆశించిన దిగుబడి రావడం లేదు. దీంతో ఆదివాసీ రైతులకు మేలి రకం మిరియాలను అందజేయాలనే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో కేరళ కాలికట్ సుగంధ ద్రవ్య పంట బోర్డు అభివృద్ధి చేసిన ఏడు మేలి రకం మొక్కలను అధికారులు దిగుమతి చేసుకున్నారు. ఈ మొక్కలు తెగుళ్లను తట్టుకోవడంతో పాటు ఒక్కొక్క మొక్క నుంచి 3- 4 కిలోల దిగుబడి వస్తుంది. స్పైస్ బోర్డు నుంచి గిరిముండ, శక్తి, శ్రీకర, పంచమి, పౌర్ణమి, మలబార్ ఎక్సెల్, సుబ్కర రకాల 2,307 మొక్కలను చింతపల్లి ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రానికి దిగుమతి చేసుకున్నారు. ఈ ఏడు రకాల మొక్కలను చింతపల్లి ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రంలో షేడ్‌నెట్ నర్సరీ ద్వారా అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.ఐదు లక్షల నిధులు వెచ్చించి ఐటీడీఏ అదే ఏడాది పాలిహౌస్‌ను నిర్మించింది. ఈ పాలిహౌస్‌లో 2019 నుంచి ఉత్పత్తి చేసిన నూతన రకాల మిరియాల మొక్కలను ప్రతి ఏటా ఐటీడీఏ 1.3 లక్షల నుంచి 1.6 లక్షల మొక్కలను రైతులకు నామమాత్రపు ధరకు పంపిణీ చేసేవారు.
అంతరించిపోయిన మదర్ ప్లాంట్స్
హెచ్‌ఎన్‌టీసీలో పాలిహౌస్ శిథిలావస్థకు చేరుకోవడం వల్ల మిరియాల మొక్కల ఉత్పత్తికి వాతావరణం అనుకూలించలేదు. మిరియాల మొక్కల అభివృద్ధికి తగినంత నీడ ఉండాలి. సాధారణ వాతావరణం కంటే 10 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. తొలి రోజుల్లో పాలిహౌస్ మొక్కల ఉత్పత్తికి అనువుగా ఉండేది. 2023 నుంచి పాలిహౌస్ పైకప్పు చిరిగిపోతూ రంధ్రాలు ఏర్పడ్డాయి. సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడం వలన ప్రస్తుతం పైకప్పు పూర్తిగా శిథిలమైపోయింది. మొక్కలపై నేరుగా ఎండ పడడం వల్ల మొక్కలపై పగటి ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా ఉంది. ఈ కారణంగా మిరియాల మొక్కల ఉత్పత్తికి సహకరించే విత్తన మొక్కలు 2024 నాటికి పాలిహౌస్‌లో 60 శాతం చనిపోయాయి. పాలిహౌస్‌లో పైకప్పు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల మిరియాల మొక్కల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం విత్తన మొక్కలు(మదర్ ప్లాంట్స్) పూర్తిగా అంతరించిపోయాయి. దీంతో పాలిహౌస్‌లో మేలి రకం మిరియాల మొక్కల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
రైతులకు దూరమైన మేలి రకం మొక్కలు
గత ఏడాది నుంచి హెచ్‌ఎన్‌టీసీలో మొక్కల ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఆదివాసీ రైతులకు ఈ ఏడాది మిరియాల మొక్కల పంపిణీ జరగలేదు. కేవలం గత వైసీపీ పాలకులు, ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విలువైన మేలి రకం మిరియాల మొక్కల ఉత్పత్తి నిలిచిపోయింది. రానున్న రోజుల్లో మేలి రకం మొక్కలు రైతులకు పంపిణీ చేయాలంటే కేరళ నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని చింతపల్లి హెచ్‌ఎన్‌టీసీలో మేలి రకం మిరియాల మొక్కల ఉత్పత్తిని పునఃప్రారంభించి రైతులకు తక్కువ ధరకు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.