తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కి బ్రేకులు
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:09 AM
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలకు బ్రేకులు పడ్డాయి. వాహనాలకు ఆయిల్ కొట్టించకపోవడంతో ఈ నెల 16వ తేదీ నుంచి ఏరియా ఆస్పత్రిలో నిలిపేశారు. జిల్లా మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది.
ఆయిల్ కొట్టించకపోవడంతో ఆగిన సేవలు
16వ తేదీ నుంచి ఎక్కడి వాహనాలు అక్కడే
సాంకేతిక సమస్య కారణమంటున్న ఉమ్మడి జిల్లా అధికారి
నర్సీపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలకు బ్రేకులు పడ్డాయి. వాహనాలకు ఆయిల్ కొట్టించకపోవడంతో ఈ నెల 16వ తేదీ నుంచి ఏరియా ఆస్పత్రిలో నిలిపేశారు. జిల్లా మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది.
తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు 2015 డిసెంబరు 31న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకున్న తర్వాత బాలింతను, శిశువును క్షేమంగా ఇంటికి చేర్చడానికి ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల నిర్వహణపై ప్రభుత్వం శ్రద్ధచూపలేదు. వీటి నిర్వహణ బాధ్యతను అరబిందో ఫార్మా కంపెనీకి అప్పగించింది. వాహనానికి ఇచ్చిన సిమ్ కార్డులో డబ్బులు వేసి అవసరం పడినప్పుడు పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి డబ్బులు పడక పోవడంతో వాహనాలకు ఆయిల్ కొట్టలేదు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 22 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఆగిపోయినట్టు తెలిసింది. మూడు రోజులుగా వాహనాలు నిలిచి పోవడంతో బాలింతలు ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లడానికి ఆటోలను ఆశ్రయించాల్సి వస్తున్నది. మరోవైపు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీతాలు అందాల్సి వుందని పేర్కొన్నారు. నెలకు రూ.8 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారని, ఇందులోనే పీఎఫ్ కట్ చేస్తున్నాయని డ్రైవర్స్ యూనియన్ నాయకుడు పారుపల్లి కృష్ణ అన్నారు. కాగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఆగిపోవడంపై ఉమ్మడి విశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. సాంకేతిక సమస్య కారణంగా సిమ్ కార్డులు రీచార్జి కాలేదని, గురువారం నుంచి సమస్య ఉండదని అన్నారు.