ఇటు పారిశ్రామికాభివృద్ధి, అటు యువతకు ఉపాధి
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:17 AM
పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనలకుగాను ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ) పార్కు ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ డోల శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. సుమారు రూ.700 కోట్ల వ్యయంతో జిల్లాలో నియోజకవర్గానికొకటి చొప్పున ఏడు ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది.
అదే ఎంఎస్‌ఎంఈల లక్ష్యం
నియోజకవర్గానికొకటి చొప్పున ఏర్పాటుచేస్తాం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి
డాక్టర్ డోల శ్రీబాలవీరాంజనేయస్వామి
చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు వల్ల స్వస్థలాల్లోనే యువతకు అవకాశాలు
కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు
అనుకూల వాతావరణం: ఎంపీ ఎం.శ్రీభరత్
పెదగంట్యాడ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):
పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనలకుగాను ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ) పార్కు ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ డోల శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. సుమారు రూ.700 కోట్ల వ్యయంతో జిల్లాలో నియోజకవర్గానికొకటి చొప్పున ఏడు ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో రెండు పూర్తయ్యాయి. వాటిని మంత్రి మంగళవారం ప్రారంభించారు. మరో ఐదు పార్కుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెదగంట్యాడ పారిశ్రామికవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 70 శాతం కేంద్ర వాటా, 30 శాతం రాష్ట్ర వాటాతో ఈ పార్కులు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో నగరంలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగనున్నాయన్నారు. గత ప్రభుత్వంపై నమ్మకం లేక పారిశ్రామికవేత్తలు ఎవరూ పెట్టుబడులు పెట్టలేదని, దాంతో యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయన్నారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో నూతన ప్రభుత్వం కొలువుతీరిన తరువాత పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు వల్ల స్వస్థలాల్లోనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఎంపీ ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, అందుకే ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు అంతర్జాతీయస్థాయి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎంఎస్‌ఎంఈ చైర్మన్ శివశంకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, పెదగంట్యాడ తహశీల్దార్ అమల, పలువురు పారిశ్రామికవేత్తలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా కనిగిరిలో నిర్వహించిన పరిశ్రమల ప్రోత్సాహక సమావేశాన్ని వర్చువల్‌గా తిలకించారు.