ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
ABN , Publish Date - May 25 , 2025 | 01:11 AM
ముంబై నుంచి విశాఖపట్నం వచ్చే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (18620)లో బాంబు ఉన్నట్టు శనివారం అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో కలకలం రేగింది.
క్షుణ్ణంగా సోదాలు నిర్వహించిన బాంబు, డాగ్ స్క్వాడ్‌లు
అటువంటిదేమీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నసిటీ పోలీసు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది
విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):
ముంబై నుంచి విశాఖపట్నం వచ్చే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (18620)లో బాంబు ఉన్నట్టు శనివారం అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో కలకలం రేగింది. రైలు ప్లాట్‌ఫామ్‌కు చేరిన వెంటనే బాంబు, డాగ్ స్క్వాడ్‌లు క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే...విజయవాడ బీసెంట్‌రోడ్డులో బాంబు పెట్టినట్టు శనివారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ సోదాలు జరుగుతుండగానే ముంబై నుంచి విశాఖ వచ్చే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు కూడా బాంబు బెదిరింపు రావడంతో జీఆర్పీ, రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్)తోపాటు నగర పోలీసు శాఖ అప్రమత్తమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (18620) ఉదయం 10.50 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరాల్సి ఉండగా, మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.48 గంటల ప్రాంతంలో వచ్చింది. బాంబు, డాగ్ స్క్వాడ్‌లు హుటాహుటిన తనిఖీలు చేపట్టాయి. సెకండ్ సిట్టింగ్ (ఎస్-2) కోచ్‌లో సీటు నంబర్ 80 వద్ద అనుమానాస్పద బ్యాగ్‌ను రైల్వే పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్ తమ వద్ద ఉన్న పరికరాలతో తనిఖీ చేయగా....ఆ బ్యాగ్‌లో బాంబు లేదని తేలింది. దీంతో పోలీసులు బ్యాగ్‌ను తెరిచి చూడగా దుస్తులు, సబ్బులు, ఆధార్‌కార్డు లభ్యమయ్యాయి. ఆధార్ కార్డులోని వివరాలను బట్టి ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్ తివారీదిగాగుర్తించారు.
ప్రయాణికుల ఆందోళన
రైలు ఆగిన వెంటనే బాంబు, డాగ్ స్క్వాడ్‌లు, పోలీసు బలగాలు కోచ్‌లలోకి ప్రవేశించి సోదాలు నిర్వహిస్తున్న సమయంలో బాంబు బెదిరింపు వచ్చిందని తెలుసుకున్న ప్రయాణికులు...భయాందోళనకు గురై లగేజీ పట్టుకుని స్టేషన్ బయటకు పరుగులు తీశారు.