Share News

తాజంగి జలాశయంలో బోటు షికారు

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:59 AM

మండలంలో లంబసింగికి సమీపంలో వున్న తాజంగి జలాశయంలో బోటు షికారు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. పర్యాటక వికాస్‌ నూతనంగా సమకూర్చిన ఆరు బోట్లను స్థానిక సర్పంచ్‌ మహేశ్వరి ప్రారంభించారు.

తాజంగి జలాశయంలో బోటు షికారు
నూతన బోట్లలో విహరిస్తున్న పర్యాటకులు.

పునఃప్రారంభించిన పర్యాటక వికాస్‌

అందుబాటులో ఆరు నూతన బోట్లు

చింతపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలో లంబసింగికి సమీపంలో వున్న తాజంగి జలాశయంలో బోటు షికారు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. పర్యాటక వికాస్‌ నూతనంగా సమకూర్చిన ఆరు బోట్లను స్థానిక సర్పంచ్‌ మహేశ్వరి ప్రారంభించారు. లంబసింగిని సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఐటీడీఏ సహకారంతో జలాశయం వద్ద సాహస క్రీడలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతను స్థానిక నిరుద్యోగ యువత ఏర్పాటు చేసుకున్న ‘పర్యాటక వికాస్‌ కమిటీ’కి అప్పగించింది. తొలుత జలాశయంలో పర్యాటకులకు జిప్‌లైన్‌, ట్రంపోలిన్‌, ఆర్చరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ఐటీడీఏ నాలుగు బోట్లు సమకూర్చడంతో బోటుషికారు అందుబాటులోకి వచ్చింది. అయితే ఏడాది క్రితం రెండు బోట్లు పూర్తిగా పాడైపోయాయి. ఐటీడీఏ సూచనలతో పర్యాటక వికాస్‌ పొదుపు నగదుతో ఆరు కొత్త బోట్లను కొనుగోలు చేసి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం జలాశయం వద్ద ఎనిమిది బోట్లు ఉన్నాయి. బోటు షికారుకు ఒక్కొక్కరికి రూ.100 టికెట్‌ ధరగా పర్యాటక వికాస్‌ నిర్ణయించింది. తాజంగి జలాశయంలో సాహస క్రీడలతోపాటు బోటు షికారు పునఃప్రారంభం కావడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక వికాస్‌ చైర్మన్‌ శెట్టి శంకరరావు, సభ్యులు పెనుమాల మురళీకృష్ణ, సిరగం నారాయణరావు, మాజీ సర్పంచ్‌లు పెనుమల కాంతమ్మ, దత్తుని రామస్వామి, స్థానిక నేతలు కోరాబు అంగదరావు, బోనంగి బాలయ్య పడాల్‌, బి.నూకరాజు, పురుషోత్తం, ఆండ్రాబు లక్ష్మణ్‌, పాంగి రాము, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:59 AM