Share News

మార్చి నెలాఖరుక ల్లా బీఎన్‌ రోడ్డు పనులు పూర్తి చేస్తాం

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:29 AM

వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా బీఎన్‌ రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్‌ సుధాకర్‌, ఈఈ సాంబశివరావులు శనివారం జిల్లా కోర్టుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. బీఎన్‌ రహదారి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై స్థానిక న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్‌, తదితరులు జిల్లా కోర్టులో దాఖలు చేసిన కేసుకు సంబంధించి శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్‌అండ్‌బీ చీఫ్‌ సెక్రటరీ తరఫున విచారణకు హాజరైన ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు ఈ మేరకు జిల్లా జడ్జికి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మార్చి నెలాఖరుక ల్లా బీఎన్‌ రోడ్డు పనులు పూర్తి చేస్తాం
కోర్టు విచారణకు హాజరై బయటకు వస్తున్న ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు

జిల్లా కోర్టుకు ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారుల లిఖిత పూర్వక హామీ

- పనులకు అవసరమైన నిధులు మంజూరైనట్టు వెల్లడి

- జనవరి 29కి వాయిదా పడిన కేసు

చోడవరం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా బీఎన్‌ రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్‌ సుధాకర్‌, ఈఈ సాంబశివరావులు శనివారం జిల్లా కోర్టుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. బీఎన్‌ రహదారి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై స్థానిక న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్‌, తదితరులు జిల్లా కోర్టులో దాఖలు చేసిన కేసుకు సంబంధించి శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్‌అండ్‌బీ చీఫ్‌ సెక్రటరీ తరఫున విచారణకు హాజరైన ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు ఈ మేరకు జిల్లా జడ్జికి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పటికే బీఎన్‌ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వం కాంట్రాక్టరుకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించడంతో పాటు, రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు కూడా విడుదల చేసిందని జడ్జికి వివరించారు. కాంట్రాక్టరు కూడా బీఎన్‌ రోడ్డు పనులు ప్రారంభించారని, ఈ పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తవుతాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది డేవిడ్‌ బీఎన్‌ రోడ్డులో దెబ్బతిన్న విజయరామరాజుపేట, వడ్డాది వంతెనల నిర్మాణం గురించి జిల్లా జడ్జి దృష్టికి తీసుకుని వెళ్లగా, విజయరామరాజుపేట వంతెన కూడా మార్చిలోగా పూర్తి చేస్తామని, వడ్దాదిలో వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి రూ.26 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, ఆ నిధులు మంజూరైతే వడ్డాది వంతెన నిర్మాణం చేపడతామని వివరించారు. ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారుల వాదనలు లిఖిత పూర్వక హామీని పరిగణలోనికి తీసుకున్న 9వ అదనపు జిల్లా జడ్జి ఎం.హరినారాయణ కేసును జనవరి 29కి వాయిదా వేశారు.

రోడ్డు పనుల పురోగతిని బట్టి న్యాయపోరాటం

బీఎన్‌ రోడ్డు పనులు మార్చిలోగా పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు లిఖిత పూర్వక హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని న్యాయవాది కాండ్రేగుల డేవిడ్‌ తెలిపారు. పనుల పురోగతిని పరిశీలిస్తామని, పనుల్లో మళ్లీ జాప్యం జరిగితే న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Nov 23 , 2025 | 12:30 AM