బీఎన్ రోడ్డు మరమ్మతులు ఇక చేయలేం
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:06 AM
బిల్లులు చెల్లిస్తేనే గానీ బీఎన్ రోడ్డు మరమ్మతులు కూడా ఇకపై చేయలేమని రోడ్ల, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ వీకె. విజయశ్రీ వద్ద కాంట్రాక్టర్ ఖరాఖండిగా చెప్పేశారు. ఎన్‌డీపీ నిధులతో జిల్లాలో ఆర్‌అంబీ రోడ్లను పరిశీలించేందుకు శుక్రవారం ఆమె ఇక్కడికి వచ్చారు.
ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ ముందే చేతులెత్తిసిన కాంట్రాక్టర్
బిల్లులు చెల్లిస్తేగానీ పనులు చేయలేమని స్పష్టీకరణ
గుంతలు పూడ్చలేకుంటే పనులు
వదిలి వెళ్లిపోండంటూ సీఈ ఆగ్రహం
మీ డబ్బు వస్తుంది.. ముందు పనులు చేయండని మందలింపు
రావికమతం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
బిల్లులు చెల్లిస్తేనే గానీ బీఎన్ రోడ్డు మరమ్మతులు కూడా ఇకపై చేయలేమని రోడ్ల, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ వీకె. విజయశ్రీ వద్ద కాంట్రాక్టర్ ఖరాఖండిగా చెప్పేశారు. ఎన్‌డీపీ నిధులతో జిల్లాలో ఆర్‌అంబీ రోడ్లను పరిశీలించేందుకు శుక్రవారం ఆమె ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని గర్నికం, మేడివాడ, దొండపూడి, కొత్తకోట తదితర గ్రామాలలో బీఎన్ రోడ్డుపై ఏర్పడిన చెరువును తలపించేలా ఉన్న భారీ గోతులను ఆమెకు టీడీపీ మండల అధ్యక్షుడు కోమటి శంకరరావు, టీడీపీ నేతలు రాజాన కొండనాయుడు, గొర్లె సాంబశివ, వజ్రపు వెంకట నర్సింహామూర్తి, గోకివాడ రమణ తదితరులు చూపించారు. ఈ గుంతల వల్ల కనీసం రాకపోకలకు కూడా సాధ్యం కావడం లేదన్నారు. వీటిలో వాహనదారులు పడి ప్రమాదాలకు గురవుతున్నారని చీఫ్ ఇంజనీరుకు వివరించారు. అలాగే భారీ వాహనాలైతే ఈ గుంతల్లో కూరుకుపోయి ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతున్నదని వివరించారు. ఈ గుంతలను పరిశీలించిన ఆమె తక్షణమే మరమ్మతులు చేయాలని ఆమె వెంట ఉన్న కాంట్రాక్టర్ వెంకటేశ్వరావును ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో ఖర్చుపెట్టిన రూ.10 కోట్లలో రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమేర పనులు చేపట్టామని, తమతో పనులు చేయించడమేగాని బిల్లు ఇవ్వకుంటే ఇకపై ఎటువంటి పనులు చేయలేమని కాంట్రాక్టర్ తేల్చిచెప్పారు. దీంతో కాంట్రాక్టర్‌పై ఆమె మండిపడ్డారు. కనీసం గుంతలు పూడ్చడం చేతకాకుంటే కాంట్రాక్ట్ వదిలి వెళ్లిపోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నిర్లక్ష్యం వలనే ఈ రోడ్డు ఇలా మారిందని మండిపడ్డారు. బడ్జెట్ విడుదల అయ్యాక మీ డబ్బు వస్తుంది.. ఎక్కడికి పోదు. ముందు పని చేయించండి అని సూచించారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ విజయశ్రీ విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో నిర్మాణంలో ఉన్న రోడ్ల పనులకు రూ.130 కోట్ల వరకు బకాయిలు ఉన్న మాట వాస్తమేనన్నారు. బీఎన్ రోడ్డు బిల్లు ఒక్కటే కాదని, చాలా రోడ్లకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదలకు కృషి చేస్తున్నామన్నారు. అప్పటి వరకు రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను తాత్కాలిక మరమ్మతులు చేయాలని కాంట్రాక్టర్లను కోరుతున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, డీఈఈ విద్యాసాగర్, ఏఈఈ సాయిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.