గోవాడ షుగర్స్‌పై నీలినీడలు!
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:41 AM
సహకార రంగంలో అగ్రగామిగా వెలుగొందిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీని చీకట్లు అలముకున్నాయి. కొన్నేళ్ల నుంచి నష్టాల్లో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాదికి ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ సాధ్యం కాదని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలోఉన్నతాధికారులు తేల్చిచెప్పినట్టు సమాచారం. చెరకు రైతులకు ఇబ్బంది కలగకుండా చెరకును పొరుగు జిల్లా ఫ్యాక్టరీకి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించినట్టు తెలిసింది.
ఈ ఏడాది చెరకు క్రషింగ్ లేనట్టేనా?
రైతులు, కార్మికులు, సప్లయర్లకు రూ.40 కోట్ల మేర బకాయిలు
ఫ్యాక్టరీలో ఉన్న పంచదార, మొలాసిస్ విలువ రూ.10 కోట్లు
మహాజన సభ నిర్వహణకు అధికారుల వెనుకంజ
ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీకి చెరకు తరలింపుపై మంతనాలు
ప్రభుత్వ నిర్ణయంపైనే ఫ్యాక్టరీ భవిష్యత్తు
చోడవరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సహకార రంగంలో అగ్రగామిగా వెలుగొందిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీని చీకట్లు అలముకున్నాయి. కొన్నేళ్ల నుంచి నష్టాల్లో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాదికి ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ సాధ్యం కాదని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలోఉన్నతాధికారులు తేల్చిచెప్పినట్టు సమాచారం. చెరకు రైతులకు ఇబ్బంది కలగకుండా చెరకును పొరుగు జిల్లా ఫ్యాక్టరీకి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించినట్టు తెలిసింది.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వున్నప్పటికీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో రానున్న సీజన్‌లో క్రషింగ్ జరుగుతుందన్న ఆశాభావంతో రైతులు చెరకు సాగు కొనసాగించారు. ఏటా సెప్టెంబరు నెలాఖరులోగా గోవాడ ఫ్యాక్టరీ మహాసభ నిర్వహిస్తుంటారు. కానీ ఈ ఏడాది ఇంతవరకు మహాజన సభ నిర్వహణపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. గత రెండు సీజన్లకు సంబంధించి రైతులకు చెరకు బకాయిలు, రవాణా చార్జీలు కలిపి రూ.29 కోట్లు చెల్లించాల్సి వుంది. ఇక కార్మికులకు ఐదు నెలల వేతన బకాయిలు, ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది రూ.7 కోటల వరకు చెల్లించవలసి ఉంది. ఇక సప్లయర్లకు మరో రూ.3 కోట్లు పెండింగ్‌లో వున్నాయి. మొత్తం బకాయిలు రూ.40 కోట్లు వున్నాయి. ఫ్యాక్టరీలో 50 వేల క్వింటాళ్ల పంచదారతోపాటు, మొలాసిస్ వుంది. వీటిని విక్రయిస్తే రూ.10 కోట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. మహాజన సభ నిర్వహిస్తే రైతులు, కార్మికులు తమ బకాయిల గురించి నిలదీస్తారన్న ఉద్దేశంతో అధికారులు మహాజన సభను నిర్వహించడానికి వెనుకంజ వేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ప్రభుత్వం నిధులు సమకూర్చితే.. అప్పుడు మహాజన సభ నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఫ్యాక్టరీలో క్రషింగ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే.. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో వున్న చెరకును శ్రీకాకుళం జిల్లా సంకిలిలోని ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్లేలా ఆ ఫ్యాక్టరీ అధికారులతో ‘గోవాడ’ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఇటీవల సంకిలి ఫ్యాక్టరీ ఫీల్డు సిబ్బంది, గోవాడ ఫ్యాక్టరీ ఫీల్డు సిబ్బందికి ఫోన్లు చేసి ఏయే కాటాల పరిధిలో ఎంతెంత చెరకు ఉన్నదీ వాకబు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఈ ఏడాది చెరకు క్రషింగ్ జరిగే అవకాశాలు చాలా తక్కువని అర్థం అవుతున్నది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఫ్యాక్టరీ భవిష్యత్తు ఆధారపడి వుందని అధికారులు అంటున్నారు.