చెరువులవేనం రోడ్డుపై నీలినీడలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:50 PM
ఆంధ్రకశ్మీర్ లంబసింగికి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చెరువులవేనం గ్రామానికి రహదారి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. భీమనాపల్లి రోడ్డు నుంచి చెరువులవేనం వరకు రహదారి నిర్మాణానికి జనవరిలో రూ.2.4 కోట్లు పీఎం జన్‌మన్ నిధులు విడుదలయ్యాయి. అయినప్పటికీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు రహదారి నిర్మాణంపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రహదారిపై పడిన కొండచరియలు, బండరాళ్లను స్థానిక గిరిజనులు శ్రమదానంతో తొలగిస్తున్నారు.
జనవరిలో రూ.2.4 కోట్లు విడుదల
ఇంతవరకు పిలవని టెండర్లు
రోడ్డు సంగతి పట్టని పీఆర్ ఇంజనీర్లు
కనీసం గ్రామసభ కూడా ఏర్పాటు చేయని అధికారులు
ఇటీవల వర్షాలకు బురదగా మారిన రహదారి
కొన్నిచోట్ల పడిన కొండచరియలు, బండరాళ్లు
శ్రమదానంతో తొలగిస్తున్న గిరిజనులు
మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న పర్యాటక సీజన్
చింతపల్లి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై ఉన్న చెరువులవేనం గ్రామానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంతవరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పనులు చేపట్టలేదు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన చెరువులవేనం గ్రామానికి జనవరి నెలలో రూ.2.4 కోట్లు మంజూరయ్యాయి. కానీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ప్రారంభించలేదు. చెరువులవేనం వాతావరణం భిన్నంగా ఉంటుంది. శీతాకాలంలో మంచు మేఘాలు చెరువులవేనం తాకుతూ పయనిస్తుంటాయి. వ్యూపాయింట్‌కి ఎదురుగానున్న లోయ మొత్తం మంచు దుప్పటి కప్పినట్టు సుందరంగా ఉంటుంది. నాలుగేళ్లుగా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. నవంబరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులతో జాతర వాతావరణం తలపిస్తున్నది.
అధ్వానంగా చెరువులవేనం రహదారి
చెరువులవేనం రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. గతంలో చెరువులవేనంకి వెళ్లేందుకు లంబసింగి నుంచి కేవలం కాలిబాట మాత్రమే ఉండేది. మూడేళ్ల క్రితం భీమనాపల్లి నుంచి చెరువులవేనం వరకు రూ.80 లక్షలతో కనెక్ట్ పాడేరులో భాగంగా మెటల్ రోడ్డు మంజూరైంది. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ గ్రావెల్ రోడ్డు మాత్రమే నిర్మించాడు. గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మెటల్ వేయలేదు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈమట్టి రోడ్డు బురదమయమైపోతున్నది. వాహనాలు జారిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారిపైకి బండరాళ్లు కొట్టుకు వచ్చాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. దీంతో రెండు రోజులుగా గ్రామానికి చెందిన 50మంది గిరిజనులు శ్రమదానం చేసి కొండచరియలు, బండరాళ్లను తొలగిస్తున్నారు. మరో రెండు రోజులు ఈ పనులు ఉంటాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. మరో రెండు నెలల్లో పర్యాటక సీజన్ ప్రారంభం కానున్నది. చెరువులవేనం ప్రకృతి అందాలను వీక్షించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. పర్యాటక సీజన్ ప్రాంరభానికి ముందుగానే రహదారి నిర్మాణం చేపడితే సందర్శకులు, ఆదివాసీలకు ఉపయోగకరంగావుంటుంది.
జాడలేని పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు
‘దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని’ అన్న చందంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. చెరువులవేనం రహదారికి ఈ ఏడాది జనవరిలో నిధులు మంజూరైన పనులు ప్రారంభం కాలేదు. పాడేరు రెవెన్యూ డివిజన్‌లో తర్వాత మంజూరైన పీఎం జన్‌మన్ రహదారుల పనులు ప్రారంభమైనా చెరువులవేనం రోడ్డుకు కనీసం టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి చేయలేదు. గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేయలేదు. కూటమి ప్రభుత్వం రహదారి నిర్మాణానికి నిధులు విడుదల చేసిందనే విషయాన్ని కూడా స్థానిక గిరిజనులకు తెలియపర్చలేదు. రహదారి స్థితిని తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ పీఆర్ ప్రాజెక్టు చింతపల్లి ఏఈఈ వెంకటేశ్వరరావుని పలుమార్లు ఫోన్ చేసినప్పటికి కనీసం స్పందించలేదు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని చెరువులవేనం రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ ఆదివాసీలు, పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.