Share News

రక్తమోడుతున్న రైలు పట్టాలు

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:12 AM

ఫుట్‌పాత్‌ ప్రయాణం.. నిర్లక్ష్యం.. అజాగ్రత్త కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రైలు పట్టాలపై శవాలుగా తేలుతున్నారు. తుని ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత దశాబ్ద కాలంలో వందల మంది రైలు పట్టాల వద్ద మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

రక్తమోడుతున్న రైలు పట్టాలు
ఫుట్‌పాత్‌పై కూర్చుని ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు చేస్తున్న దృశ్యం

పట్టాలు దాటుతూ, రైలు నుంచి జారిపడి మృతి చెందుతున్న ప్రయాణికులు

- ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు మరికొందరు..

- గత ఐదేళ్లలో 344 మంది మృత్యువాత

- రైల్వే పోలీసులు అవగాహన కల్పిస్తున్నా తగ్గని ప్రమాదాలు

పాయకరావుపేట, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఫుట్‌పాత్‌ ప్రయాణం.. నిర్లక్ష్యం.. అజాగ్రత్త కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రైలు పట్టాలపై శవాలుగా తేలుతున్నారు. తుని ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత దశాబ్ద కాలంలో వందల మంది రైలు పట్టాల వద్ద మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

తుని ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి కశింకోట వరకు, అదే విధంగా కాకినాడ జిల్లాలో తుని నుంచి పిఠాపురం వరకు ఉంది. సుమారు 100 కిలోమీటర్ల పరిధి ఉన్న ప్రాంతంలో తరచూ ఎక్కడో ఒకచోట రైలు ప్రమాదాలు జరుగుతూ పలువురు మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కిక్కిరిన ప్రయాణికులతో ఉంటున్న జనరల్‌ బోగీల్లో బాత్‌రూమ్‌ వద్ద నిలబడిన వారితో పాటు ఫుట్‌పాట్‌పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్నవారు పలువురు ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతి చెందుతున్నారు. రెండ్రోజుల క్రితం తుని గుల్లిపాడు రైల్వే స్టేషన్ల మధ్యలో గొడిచెర్ల కొత్తూరు గ్రామ సమీపంలో ఒకే రోజు రెండు రైళ్ల నుంచి ఇద్దరు ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందిన విషయం తెలిసిందే. అదే విధంగా తుని నుంచి కశింకోట వరకు రైలు పట్టాలను ఆనుకుని, సమీపంలో పలు గ్రామాలు ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తరచూ పట్టాలు దాటుతూ రాకపోకలు సాగిస్తుంటారు. ఆయా సమయాల్లో దూరంగా కనిపిస్తున్న రైలు దగ్గరకు వచ్చేసరికి పట్టాలు దాటేయ వచ్చనే ఆలోచనతో పలువురు ప్రమాదకర పరిస్థితుల్లో పట్టాలు దాటుతూ మృతి చెందుతున్నారు. ఎక్కువగా మలుపులు ఉన్నచోట్ల రైలు దగ్గరకు వస్తేనే గాని కనిపించని కారణంగా కొంతమంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా గుల్లిపాడు, నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ల మధఽ్య పెద్ద మలుపు ఉండడంతో ఈ ప్రాంతంలో రైలు దగ్గరకు వస్తేనే గాని కనిపించదు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో రైల్వే ఉద్యోగితో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తుని రైల్వే స్టేషన్లో కూడా పలువురు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక తుని, పాయకరావుపేట పట్టణాల మధ్య తాండవ నదిపై ఉన్న రైల్వే వంతెనపై పట్టాల మధ్య ఉన్న కాలిబాటను రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు దగ్గర దారిగా ఎంచుకుని ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు నెలల క్రితం రాత్రి సమయంలో తండ్రి, కొడుకులు తాండవ వంతెన దాటుతున్న సమయంలో రైలు రావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విధంగా 2021 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు ఐదేళ్లలో తుని ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన రైలు ప్రమాదాల్లో మొత్తం 344 మంది మృత్యువాత పడగా, వీరిలో రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందినవారు 153 మందికాగా, పట్టాలు దాటుతూ రైలు ఢీకొన్న సంఘటనల్లో 153 మంది మరణించారు. అదే విధంగా 38 మంది రైలు పట్టాలపై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 58 మంది ఎక్కడివారో వివరాలు తెలియక వీరందరినీ ఆనాథ శవాలుగా ఖననం చేశారు. దీనిపై తుని రైల్వే పోలీస్‌ స్టేసన్‌ ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రైలు ప్రమాదాల నివారణలో భాగంగా రైల్వే పోలీసులు, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు సంయుక్తంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవగాహన కల్పించడంతో పాటు రైలు వచ్చే సమయంలో మైకు ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో రైలు పట్టాలు దాటకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ధిక్కరించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇక ఆత్మహత్యలకు ప్రయత్నించేవారిని ఇప్పటి వరకు నలుగురిని గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చి రక్షించామని ఆయన తెలిపారు.

Updated Date - Oct 12 , 2025 | 01:12 AM