రక్తమోడుతున్న రోడ్లు
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:07 AM
నగరంలో రహదారులు రక్తమోడుతున్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదం జరుగుతోంది.
నగరంలో ఇటీవల పెరిగిన రోడ్డు ప్రమాదాలు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని ఫొటోలు తీయడం, పెండింగ్ ఛలాన్‌లు కట్టించడంపైనే పోలీసులు దృష్టి
వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరణపై నిర్లక్ష్యం
ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతున్న చోదకులు
అదే ప్రమాదాలకు కారణం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో రహదారులు రక్తమోడుతున్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదం జరుగుతోంది. ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు గాయపడుతున్నారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు...ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని ఫొటోలు తీయడం, పెండింగ్ చలాన్‌లను కట్టించడంలోనే నిమగ్నం కావడం వల్లే ఇటీవల కాలంలో ్డప్రమాదాల సంఖ్య పెరగడానికి కారణంగా చెబుతున్నారు.
వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘించే వారిని సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయడం, ఏదో ఒక కూడలి వద్ద నిలబడి వచ్చిపోయే వాహనాలను ఆపి పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌లు ఉన్నాయేమోనని తనిఖీ చేయడం, ఉంటే వాటిని కట్టించడంపై మాత్రమే శ్రద్ధచూపుతున్నారు. సమీపంలో ట్రాఫిక్ జామ్ అయినా తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్ చలాన్‌లపై నిమగ్నమై ఉండడంతో వాహన చోదకులు కొందరు సిగ్నల్స్ వద్ద వేచివుండకుండా ముందుకు దూసుకువెళ్లిపోతున్నారు. ఇది ప్రమాదాలకు దారితీస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి మద్దిలపాలెం జంక్షన్ వద్ద రెడ్‌సిగ్నల్ పడిందని సత్యం జంక్షన్ వైపు నుంచి వస్తున్న ఒక ద్విచక్ర వాహన చోదకుడు తన వాహనాన్ని ఆపాడు. వెనుక నుంచి అపరిమితవేగంతో వచ్చిన లారీ సిగ్నల్ వద్ద ఆపకుండా ఆగివున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కొన్ని అడుగులు దూరం ఈడ్చుకువెళ్లింది. ఈ ప్రమాదంలో అల్లిపురానికి చెందిన జోగేశ్వరరావు అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అలాగే శుక్రవారం సాయంత్రం అగనంపూడి జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఒక మహిళను ద్విచక్ర వాహనచోదకుడు ఢీకొట్డాడు. ఈ ప్రమాదంలో మహిళతోపాటు వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. ఈనెల ఆరున ఆరిలోవ పైనాపిల్ కాలనీ వద్ద బీఆర్‌టీఎస్ రోడ్డు దాటుతున్న ఒకరిని అపరిమిత వేగంతో వచ్చిన వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈనెల ఆరో తేదీ అర్ధరాత్రి ఒక కారు ఇసుకతోట వైపు నుంచి వేగంగా వచ్చి మద్దిలపాలెం ఆటోమోటివ్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ఇటీవల కాలంలో ఈ తరహా ప్రమాదాలు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాదిలో 274 మంది మృతి
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఇటీవల కాలంలో మళ్లీ పెరిగింది. 2022లో 1,353 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 358 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,100 మంది క్షతగాత్రులయ్యారు. 2023లో 1,180 ప్రమాదాలు జరగ్గా 336 మంది మృతిచెందారు. 1,080 మంది క్షతగాత్రులయ్యారు. 2024లో 1,106 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 317 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 980 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది అక్టోబరు నెలాఖరు నాటికి 1,045 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 274 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 564 మంది క్షతగాత్రులయ్యారు. గత వారం రోజుల్లోనే రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 15 మంది వరకు మృత్యువాతపడ్డారు. గత మూడేళ్లుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ వచ్చినప్పటికీ ఈ ఏడాది ప్రమాదాల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా పెరిగేలా ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
సీపీ దృష్టిసారించకపోతే మరింత పెరిగే అవకాశం
పెండింగ్ చలాన్‌ల వసూళ్లపై కాకుండా వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టిపెట్టాల్సిందిగా సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీచేయాల్సిన అవసరం ఉంది. అలాగే కొందరు సిబ్బంది విధి నిర్వహణను పక్కనపెట్టి చెట్ల కింద కుర్చీలో కూర్చొని సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై కనిపించకపోవడంతో ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అదే ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై ఉంటే వాహన చోదకులు నిబంధనలను పాటిస్తారు కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం తగ్గుతుంది. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంపై సీపీ దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.
గ త మూడేళ్లలో నమోదైన రోడ్డు ప్రమాదాలు
సంవత్సరం ప్రమాదాలు మరణాలు క్షతగాత్రులు
2022 1353 358 1100
2023 1180 336 1080
2024 1106 317 980
2025(అక్టోబరు నాటికి) 1045 274 564
-----------------------------------------