డ్రైనేజీ కాలువలు కబ్జా
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:34 AM
భీమిలి- నర్సీపట్నం రోడ్డులో చోడవరం మండల పరిధిలో పలుచోట్ల ఇరువైపులా డ్రైనేజీ కాలువలు ఆక్రమణకు గురయ్యాయి.
బీఎన్ రోడ్డుపైకి వర్షంనీరు
కొద్దిపాటి వానకే వాగును తలపిస్తున్న రహదారి
నీటి ప్రవాహంతో మరింత పాడైపోతున్న వైనం
చోడవరం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):
భీమిలి- నర్సీపట్నం రోడ్డులో చోడవరం మండల పరిధిలో పలుచోట్ల ఇరువైపులా డ్రైనేజీ కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మండలంలో వెంకన్నపాలెం జంక్షన్ నుంచి అంభేరుపురం వరకు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలను కబ్జా చేయడం, లేదంటే ఆయా దుకాణదారులు మట్టితో కప్పేయడంతో, వర్షం నీరు ప్రవహించే మార్గం లేక.. రోడ్డుపై చేరుతున్నది. కొన్నిచోట్ల పొలాల్లో నీరు కూడా రోడ్డుపైకి ప్రవహిస్తున్నది. కొద్దిపాటి వర్షం కురిసినా రహదారులు వాగుల్లా మారిపోతున్నాయి. రోడ్డుపై ఏర్పడిన భారీ గోతుల్లో రోజుల తరబడి నీరు నిలిచిపోతున్నది. ఇప్పటికే అధ్వానంగా వున్న ఈ రహదారి, మరింత దారుణంగా తయారవుతున్నది. గోతులు మరింత పెద్దవి అవుతున్నాయి. రాళ్లు తేలిపోయి వాహనదారులతోపాటు పాదచారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు రాత్రిపూట ప్రమాదాలకు గురవుతున్నారు. భవిష్యత్తులో ఈ రోడ్డును అభివృద్ధి చేసినప్పటికీ ఆక్రమణలు తొలగించకపోతే సమస్య మరింత తీవ్రం అవుతుంది. కోట్లాది రూపాయలు వృథా అవుతాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి వెంకన్నపాలెం నుంచి అంభేరుపురం వరకు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించాలని, డ్రైనేజీ కాలువలు తవ్వించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.